Rahul Gandhi Protest: పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం జరగాల్సిందే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. వీడియో ఇదిగో..
Rahul Gandhi Protest
Rahul Gandhi Protest: జూలై 20న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పెల్లెట్ గన్ (Pellet Gun) కాల్పులకు గురైన బాధితుడికి మద్దతుగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. బాధితుడు సాహిల్ లోచాబ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడానికి నిరాకరించడంతో ఈ నిరసన దిగారు.
నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సాహిల్ లోచాబ్పై పెల్లెట్ గన్ కాల్పులు జరిగాయని, దాంతో అతని శరీరంపై 200కు పైగా గాయాలు కావడంతో పాటు ఒక కంటి చూపును కోల్పోయాడని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఎయిమ్స్ (AIIMS) మెడికల్ నివేదికలు, ఎమ్మెల్సీ (MLC) కాపీలు స్పష్టంగా తీవ్ర గాయాలను ధృవీకరిస్తున్నప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనుక పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణమని ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థుల గొంతును కేంద్ర ప్రభుత్వం పోలీసు బలప్రయోగంతో అణచివేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఘటన కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిందంటూ పోలీసులు నెపం నెట్టివేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని మండిపడ్డారు.
బాధితుడు సాహిల్ లోచాబ్కు న్యాయం జరిగే వరకు, దోషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్ నుండి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు పాల్గొని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- Rajasthan Local Polls: రాజస్థాన్లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓటమి.. గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..
- AI in Education: ఏఐని నిషేధిస్తే రహస్యంగా వాడతారు.. స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
- Yelahanka Property Dispute: వైఎస్ షర్మిలకు కోర్టు షాక్.. యలహంక ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ
- చైనా ‘36 వ్యూహాలు’ ప్రాసంగికత
- సోనియాగాంధీ ‘బిలాంగింగ్’ గొప్ప వ్యక్తిగత గాథ