నేతల నోటి నుంచి నిప్పురవ్వలు… తెలంగాణ కాంగ్రెస్‌కు అంతర్గత చిక్కులు
Sushmita Patel Sensational Comments On CM Revanth Reddy
జి.మధు, వనపర్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బయట ప్రతిపక్షాల సవాళ్లకంటే ఇంటి వద్ద పోరే తలనొప్పిగా మారుతోందా? అధికార పక్షానికి చెందిన ముఖ్య నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అధిష్టానం దృష్టికి ఫిర్యాదులు వెళ్లడం వంటి పరిణామాలు పార్టీ అంతర్గత వ్యవహారాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ శైలి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య చోటుచేసుకుంటున్న వివాదం, తాజాగా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రిపై నోరుపారేసుకోవటం, వనపర్తి రాజకీయాల్లో పార్టీ సీనియర్ నేత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు.. ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక రాజకీయ ముఖం, ఈ నేత సందర్భానుసారంగా చేసే వ్యాఖ్య లు పార్టీ అధికారిక వైఖరితో ఎంతవరకు సరిపోతున్నాయన్న చర్చ తరచూ జరుగుతోంది.. ఇటీవల ఇతను చేసిన ఆరోపణలను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయంటూ బిఆర్‌ఎస్ దీన్ని కాంగ్రెస్‌పై దాడికి రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. ఇక్కడ సమస్య ఒక్క నేత వ్యాఖ్యలకే పరిమితం కాదు. అధికార పార్టీలో ఉన్న నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసి ప్రతిసారి దాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష విషయంలో కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా అధికారుల తో సమావేశం నిర్వహించారని మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత వివాదం మరింత ముదిరింది. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాల ని సురేఖ టిపిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇది కేవలం ఇద్దరు నాయకుల వ్యక్తిగత విభేదంగా కొట్టిపారేయలేని పరిస్థితి. ఒకే పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య సమన్వయం లేకపోతే దాని ప్రభావం కేడర్ పై, జిల్లా రాజకీయాలపై పడే అవకాశం ఉంది.
ఉమ్మడి పాలమూరు రాజకీయాల్లో సీనియర్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వనపర్తిలో ఇప్పుడు అసలు ప్రశ్న ఎవరు సరైనవారు అన్నదానికంటే ఈ వివాదం వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందన్నదే.
తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న పరిణామాలను కేవ లం వ్యక్తిగత విభేదాలుగా చూడటం ఒక కోణం మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు ఆ పార్టీలోకి వచ్చారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు, తమ తమ నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ పునాదులు కలిగిన నాయకులు -ఇవన్నీ ఒకే వ్యవస్థలో పని చేయాల్సి వచ్చింది. అక్కడే సమన్వయం కీలకంగా మారింది. పార్టీలో ప్రతి నాయకుడికి రాజకీయ ప్రాధాన్యం ఉండవచ్చు. కానీ ప్రభుత్వం, పార్టీ రెండింటికి ఒక స్పష్టమైన కమాండ్ వ్యవస్థ ఉండాల్సిందే. ఆ వ్యవస్థ బలహీనంగా కనిపిస్తే ప్రతి నాయకుడి వ్యాఖ్య ఒక రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉంటుంది.
అధికార పార్టీకి సాధారణంగా ప్రతిపక్షాల విమర్శలు తప్పవు. కానీ అధికార పార్టీలోని నాయకుల వ్యాఖ్యలనే ప్రతిపక్షాలు ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవడం మాత్రం పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిణామం. ఇటీవల రాజగోపాల్‌డ్డి వ్యాఖ్యలను కెటిఆర్ ప్రస్తావించడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. కాంగ్రెస్ అంతర్గత వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ తన రాజకీయ ప్రచారంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంటే కాంగ్రెస్ నేతలు మాట్లాడే ప్రతి మాట ఇక వ్యక్తిగత వ్యాఖ్యగా మిగలడం లేదు. అది వెంటనే సోషల్ మీడియా, ప్రతిపక్ష రాజకీయ ప్రచారంలో భాగమవుతోంది. నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే మొదట ప్రభావితమయ్యేది కిందిస్థాయి కార్యకర్తలే. ఎవరిని అనుసరించాలి? ఎవరి మాట పార్టీ అధికారిక వైఖరి? నియోజకవర్గంలో ఎవరికి ప్రాధాన్యం? అనే ప్రశ్నలు కేడర్‌లో తలెత్తే అవకాశం ఉంటుంది.
రేవంత్ నాయకత్వానికి అసలు పరీక్ష ః ఇప్పటి వరకు కాంగ్రెస్‌లోని అనేక విభేదాలు స్థానిక స్థాయిలో పరిష్కరించుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ వివాదాలు పదేపదే బహిరంగమైతే వాటిని నియంత్రించడం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు న్న ప్రధాన రాజకీయ సవాళ్లలో ఒకటి ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ అంతర్గత సమన్వయాన్ని కూడా బలపరచడం. మంత్రి, ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అనే తేడా లేకుండా పార్టీకి ఒకే రాజకీయ క్రమశిక్షణ ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిణామాలను చూసి తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా సంక్షోభంలో ఉందని చెప్పడం తొందరపాటు. అధికారం లో ఉన్న పార్టీకి సహజంగానే అనేక వర్గాలు, వ్యక్తిగత రాజకీ య ఆకాంక్షలు ఉంటాయి. అయితే అవి బహిరంగ విభేదాలుగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సరిపోవు. పార్టీ అంతర్గత ఐక్యత కూడా అంతే ముఖ్యం. సీనియర్లకు గౌరవం.. కొత్త నాయకత్వానికి అవకాశం. నియోజకవర్గాల్లో స్పష్టమైన బాధ్యతలు, నేతల మధ్య సమన్వయం, వివాదాలు బహిరంగం కాకుండా పార్టీ వేదికపైనే పరిష్కారం – ఇవన్నీ బలపడాల్సిన అవసరం ఉంది.
- Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
- అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో జగమే సంగీతం
- ‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’