Skip to content
తెలంగాణ వార్తలు

Nidhhi Agerwal ED: ఈడీ విచారణకు హాజరైన సినీ నటి నిధి అగర్వాల్…బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 4 గంటల పాటు ప్రశ్నల వర్షం…

Prajapaksham 19 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Nidhhi Agerwal ED: ఈడీ విచారణకు హాజరైన సినీ నటి నిధి అగర్వాల్…బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 4 గంటల పాటు ప్రశ్నల వర్షం…

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్‌ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఈడీ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ నటి నిధి అగర్వాల్ స్వయంగా అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణలో భాగంగా నటి నిధి అగర్వాల్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను పోలీసులు భద్రత మధ్య లోపలికి తీసుకెళ్లారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఆమెకు ముందే నోటీసులు జారీ కాగా, గతంలో హైదరాబాద్ సీఐడీ ఎదుట కూడా ఆమె హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఆమె కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల వివరాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. యాప్‌ల ప్రచార కార్యక్రమాల కోసం ఆమె అందుకున్న భారీ పారితోషికంపై ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. నటికి జరిగిన ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

ప్రమోషన్ల కోసం జరిగిన చెల్లింపులు ఏయే మార్గాల ద్వారా జరిగాయనే అంశంపై విచారణ జరిపారు. ఈ లావాదేవీలలో ఏవైనా హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ జరిగిందా అనే కోణంలో కూపీ లాగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ అక్రమ వ్యవహారంలో దాదాపు 21 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అక్రమ బెట్టింగ్, జూదం యాప్‌లను ప్రచారం చేశారనే ఆరోపణలతో తెలంగాణ పోలీసులు గతేడాది రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో సహా పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఐడీ అధికారుల ఎదుట కూడా నిధి అగర్వాల్ హాజరయ్యారు.

సీఐడీ విచారణ సమయంలో నటి తన అధికారిక వాంగ్మూలాన్ని అధికారులకు సమర్పించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ, తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతైన ఆధారాలను సేకరిస్తూ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

ఇదిలా ఉంటే 32 ఏళ్ల వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గతేడాది మార్చి 19న దాఖలైన ఈ ఫిర్యాదులో, 1867 నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించే అక్రమ జూదం యాప్‌లను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖులు ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువకులు ఈ యాప్‌లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నారని, తన సామాజిక వర్గంలోని యువకులతో మాట్లాడినప్పుడు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని శర్మ వెల్లడించారు.

ఈ అక్రమ జూదం యాప్‌లను ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్‌లతో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు. కాగా, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను కఠినంగా నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తుది విచారణకు స్వీకరిస్తామని ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు: ED Nidhhi Agerwal Telangana