Census of India 2027: అత్యంత ప్రభావవంతమైన 2027 సెన్సెస్
Census of India 2027: అత్యంత ప్రభావవంతమైన 2027 సెన్సెస్
స్వాతంత్య్రానంతరం భారతదేశ ఎనిమిదవ జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్) 2027, పదహారు సంవత్సరాల విరామం తరువాత జరుగుతున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్యపై దీర్ఘకాలంగా ఉన్న స్తంభనను ఇది ఎత్తివేస్తున్నందున దీనికి దేశ రాజకీయ వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కింద అవసరమైన జనాభా అధికారిక డేటాను సెన్సెస్ నివేదిక ఇస్తుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ సీట్ల హద్దుల సర్దుబాటు (డీలిమిటేషన్) చేసేందుకు ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు సెన్సెస్ వీలుకల్పిస్తుంది. సమాఖ్య అధికార సమతులనాలను తాజాగా రూపొందించేందుకు సెన్సెస్ సహాయపడుతుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ చట్టం అమలుకు చట్టబద్ధత కల్పిస్తుంది. 84వ రాజ్యాంగ సవరణ 2026 తర్వాత చేపట్టే తొలి సెన్సెస్ వరకు చట్టసభల్లో సీట్ల సంఖ్యపై 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా స్తంభన విధించింది. డీలిమిటేషన్ క్రమం పునఃప్రారంభించటానికి రానున్న 2027 జనాభా లెక్కలు లీగల్ ప్రాతిపదిక అవుతాయి.
సెన్సెస్ డేటా ప్రచురించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాల లోపల సీట్లు పునర్సర్దుబాటు చేసేందుకు పార్లమెంటు తాజా డీలిమిటేషన్ చట్టం ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 82 ఆదేశిస్తున్నది. మహిళలకు సీటు రిజర్వేషన్‌పై ఇది పెద్ద ప్రభావం చూపుతుంది. 2026 అనంతరం సెన్సెస్ తదుపరి చేపట్టే తొలి డీలిమిటేషన్‌తో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ అమలును 106వ రాజ్యాంగ సవరణ నేరుగా ముడిపెట్టింది. తాజా సెన్సెస్ సమాఖ్య సమతులనాన్ని మార్చివేసి ప్రాంతీయ బలాబలాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. అధిక జనాభా వృద్ధి రేటు వల్ల ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలకు సీట్లు పెరిగి, జనాభాను స్థిరీకరించిన దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గే అవకాశముంది. ఈ మార్పులతో పాటు తమ సవరించిన జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సీట్ల సంఖ్యలో కూడా మార్పులు జరుగుతాయి.
కేవలం జనాభా సంఖ్యలు ప్రాతిపదికగా లోక్‌సభ సీట్లు తిరిగి కేటాయించటం వల్ల దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల ప్రాతినిధ్య బలం తగ్గుతుంది. హిందీ ప్రాంతంపై అధికంగా ఆధారపడిన ఏ జాతీయ పాలక పార్టీ అయినా మొత్తం పార్లమెంటు సీట్లలో ఎక్కువ పొందుతుంది. స్థానిక బలాలతో కూడిన దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గి వాటి రాజకీయ ప్రభావం తరుగుతుంది. అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ డీలిమిటేషన్ వల్ల బహుశా అతిపెద్ద లబ్ధిదారు కానుంది. అయితే ఈ విన్యాసం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ, ప్రాతినిధ్యం, సహకార ఫెడరలిజం విషయాల్లో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించవచ్చు.
డీలిమిటేషన్ కసరత్తుకు ముందుగా, పెరిగే సభ్యుల సంఖ్యకు సరిపోను పార్లమెంటు కొత్త భవనాన్ని సిద్ధం చేశారు. రూ.1,200 కోట్ల వ్యయ అంచనాతో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన త్రిభుజాకార నాలుగు అంతస్థుల భారత పార్లమెంటు విస్తీర్ణం 64,500 చదరపు మీటర్లు. 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు అది జాగా కలిగి ఉంది. ప్రతి సీటు ముందూ స్మార్ట్ డిజిటల్ టచ్ స్క్రీన్, పర్యావరణ మిత్ర ఆకుపచ్చ కళాకృతులు, స్పీకర్ పోడియం సమీపంలో చారిత్రక సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. సంయుక్త సమావేశం కోసం లోక్‌సభ ఛాంబర్‌ను 1,272 మంది సభ్యులకు సరిపడా విస్తరించవచ్చు. పాత పార్లమెంటు భవనం 543 లోక్‌సభ, 250 రాజ్యసభ సభ్యులకు సీటింగ్ కలిగి ఉంది. సంయుక్త సమావేశాలు చారిత్రకంగా 560 సీట్లున్న భవంతి సెంట్రల్ హాల్లో జరుగుతున్నాయి.
మొబైల్ అప్లికేషన్లు, వెబ్ పోర్టల్స్ ఉపయోగిస్తూ, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో తొలిసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో, 1931 నాటి నుంచి తొలిసారి కులాలవారీ జనాభా లెక్కలు, వాటితోపాటు వారి ప్రామాణిక జనాభా పొందిక, ఆర్థిక, గృహవసతి డేటా కూడా సేకరిస్తారు. డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఉంటుంది. కుల సమ్మిళిత డేటా ఎస్సీలు, ఎస్టీలకే పరిమితం కాదు. కులాల వివరాలను వివరంగా నమోదు చేస్తారు. సంక్షేమం అందజేత, వనరుల పంపిణీ, విధాన ప్రణాళికల రూపకల్పనకు తాజా గణాంకాలు ప్రాతిపదిక అవుతాయి.
భారతదేశ గత జాతీయ సెన్సెస్ 2011లో నిర్వహించబడింది. 2021లో నిర్వహించాల్సిన సెన్సెస్ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడింది. మోదీ ప్రభుత్వం తాత్సారం వహిస్తూ దాన్ని 2027కు తీసుకువచ్చింది. 2011లో దేశ మొత్తం జనాభా 1.21 బిలియన్లు (121,01,93,422), అక్షరాస్యత రేటు 74.04 శాతం. లింగ దామాషా 1,000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు. 2001-2011 మధ్య పదేళ్లలో జనాభా వృద్ధి రేటు 17.64 శాతం. జనాభాలో పురుషులు 51.54 శాతం, స్త్రీలు 48.46 శాతం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (19 కోట్ల 98 లక్షలు). సిక్కిం అతితక్కువ జనాభా రాష్ట్రం (సుమారు 6,10,000). జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 382 మంది. బాలల లింగ దామాషా (0-6 సంవత్సరాలు) 1,000 మంది పురుషులకు 919 మంది స్త్రీలు. అక్షరాస్యత రేటు పురుషులలో 82.14 శాతం, మహిళల్లో 65.66 శాతం. అక్షరాస్యతలో కేరళది అగ్రస్థానం కాగా బిహార్ కడపటి స్థానం. మతం రీత్యా హిందువులు 79.8 శాతం, ముస్లింలు 14.23 శాతం. తొలిసారి రికార్డు చేసిన ‘నో రెలిజియన్’ (ఏ మతం లేదు) వ్యక్తులు 28 లక్షల 70 వేలు.
భారత దేశ జనాభా లెక్కల సేకరణకు ఎంతో విశ్వసనీయత ఉంది. ఆపరేషనల్ పరిధిలో కొన్ని తేడాలు, లోపాలున్నప్పటికీ జాతీయ జనాభా పొందిక, వారి సామాజిక-ఆర్థిక స్థితి తెలుసుకునేందుకు అవే గీటురాయి. 6,40,000లకు పైగా గ్రామాలు, వేలాది పట్టణాలతో కూడిన ఈ సువిశాల దేశంలో ప్రతి ఇంటికీ తిరిగి సేకరించే సమాచారం పలువిధాల ప్రయోజనకరం. రాజకీయ నియోజకవర్గాల పునర్నిర్ణయం, పరిపాలనకు ఉద్దేశించిన ప్రణాళికలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వంటి ఇతర నమూనా ప్రాజెక్టులకు ఈ గణాంక సమాచారమే పునాది. 140 కోట్ల ప్రజల నివాసాలను చేరుకుని డేటా రికార్డు చేసేందుకు 30 లక్షల మందికి పైగా ఫీల్డ్ వర్కర్లను నియమించారు.
గమనిక : అయితే 2026 తదుపరి చేపట్టే తొలి సెన్సెస్ ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టాలని రాజ్యాంగ సవరణ ఆదేశం ఉన్నప్పటికీ, మహిళా రిజర్వేషన్‌ను 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలనే పేరుతో నరేంద్రమోదీ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికపై నియోజకవర్గాల పునర్విభజనకు, రాజ్యాంగ సవరణ, 50 శాతం సీట్లు పెంపుదల, ఇతర చట్ట సవరణల కోసం మార్చి నెలలో చేసిన ప్రయత్నానికి పార్లమెంటు ఆమోదం పొందటంలో విఫలమైంది. కొన్ని పార్టీల్లో చీలికల కారణంగా తమ మద్దతుదారుల సంఖ్య కొంత పెరిగినందున అదనపు బలాలను సమకూర్చుకుని ఆ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తొందరపడుతోంది. తమ సీట్లు దామాషా తగ్గుదలను వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు పరిష్కారం కనుగొనకుండానే, ప్రభుత్వ ప్రతిపాదనలను ముందుగా చర్చించటానికి అఖిలపక్ష సమావేశం పిలవాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను పట్టించుకోకుండానే ప్రభుత్వం ఏకపక్ష ప్రయత్నాలు చేస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు రెండు సంవత్సరాల క్రితమే ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పుడు డీలిమిటేషన్‌కు మహిళా రిజర్వేషన్ చట్టం అమలును జతచేసి ప్రతిపక్షాలను లొంగదీసుకోవటానికి ప్రభుత్వం చేసిన బెదిరింపు ప్రయత్నం ఫలించకపోయినా, ప్రభుత్వం మొండిగా తిరిగి అదే ప్రయత్నం చేస్తున్నది. కేవలం హిందీ రాష్ట్రాలపై పట్టుతోనే కేంద్రంలో అధికారం చెలాయించే పరిస్థితి కల్పించే డీలిమిటేషన్ ప్రక్రియ దేశ సమగ్రతకు, భావసమైక్యతకు, ఫెడరల్ స్ఫూర్తికి కలుగజేసే హానిని అది పరిగణనలోకి తీసుకోవటంలేదు. ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని గరిష్ట ఏకాభిప్రాయంతో ముందుకు సాగటమే ఉత్తమ మార్గం.
(సం.)