Skip to content
జాతీయం వార్తలు

ఆకలిదప్పులతో మలమలలాడే అనాథలెందరో!

Prajapaksham 14 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఆకలిదప్పులతో మలమలలాడే అనాథలెందరో!

ఆకలిదప్పులతో మలమలలాడే అనాథలెందరో!

–ఎం. కోటేశ్వరరావు

“ఆకలి ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడేట్లు చేసింది, ఇది సామూహిక వైఫల్యం” ఈ వ్యాఖ్య చేసింది గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి హెచ్.డి. సుతార్. ఆ తల్లిది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆదర్శంగా వర్ణించి, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అదే విధంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ స్వంతగడ్డ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు పని చేశారు. ఆ కాలాన్ని గుజరాత్ స్వర్ణయుగంగా కొందరు పరిగణిస్తారు. తరువాత కూడా అదే బీజేపీ నేతల ఏలుబడిలో ఉంది. మోదీ కేంద్రంలో ప్రధానిగా రెండింజన్ల పాలన సాగిస్తున్నారు.

అలాంటి చోట ఒక తల్లి తన రెండేళ్ల కుమార్తెకు (బేటీ పడావో, బేటీ బచావో నినాదం ఇచ్చిన తరువాత) ఆకలి తీర్చలేక అసహాయతకు లోనై ఏడుస్తున్న పసికందు నోరు మూయించేందుకు ఒక దెబ్బ వేసింది. అపస్మారకంలోకి పోవడంతో స్వయంగా తల్లే బతికించేందుకు ఆసుపత్రికి తీసుకుపోయింది. ఫలితం లేక ఆ బేటీ మరణించింది. కూతుర్ని చంపిన నేరానికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న తల్లిని జైల్లో పెట్టారు. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. ఆ కేసులో హైకోర్టు విచారణలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఎగువన చదివారు. ఆ తల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

తనను దూషించిన జెన్-జీ తరం యువతీ యువకులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ గనుక అంత ఉదారత ప్రదర్శించారని దాన్ని కూడా ఆయన ప్రతిష్ఠ పెంచేందుకు ఉపయోగించిన వారిని దేశం చూసింది. అసలు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానే క్షమించటం అనే విడ్డూరపు చర్యకు పాల్పడటం ఏమిటని కొందరు విమర్శించారు. కాసేపు దాని మంచి చెడ్డలను పక్కన పెడదాం. తన రాష్ట్రంలో ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడిన పరిస్థితులను కల్పించిన తన పాలన తీరు తెన్నులపై ఆ తల్లి ఉదంతం మీద మోదీ ఎందుకు స్పందించలేదన్నది అసలు సమస్య.

సామూహిక వైఫల్యం అని న్యాయమూర్తి వ్యాఖ్య ప్రకారం దానిలో నరేంద్ర మోదీ భాగం కాదా? ప్రధాని లేదా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బీజేపీ నేతలెవరూ ఏ మాత్రం స్పందించలేదు.

సూరత్ ప్రాంతానికి చెందిన లఖీ సోలంకి ఇద్దరు బిడ్డల తల్లి, ఏడు నెలల గర్భంతో ఉంది. ఆమె భర్త సముద్రాల మీద పనిచేసేందుకంటూ ఆరు నెలల క్రితం ఆమెకు ఎలాంటి ఆదరువు చూపకుండా వెళ్లిపోయాడు. అతడు తిరిగి వస్తాడో రాడో తెలియదు. కడుపుతో ఉన్న ఆమెకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు కూడా లేవు.

మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఇలాంటి స్థితిలో వివాహ బంధం లేకుండా మైత్రీ ఖరారు ఒప్పందంతో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్న క్రమంలో ఆకలికి తాళలేక బిడ్డ ఈషా ఏడ్పులను తట్టుకోలేక 2026 మార్చి 19న చేయి చేసుకుంది. ఈ ఉదంతం న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లుగా దిక్కులేని కుటుంబాలు, వ్యక్తులు, వారి దారిద్ర్యం, ఆకలి పట్ల సమాజం, ప్రభుత్వ బాధ్యత ఏమిటనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది.

ఏ ఇథియోపియానో, మరో ఆఫ్రికన్ దేశంలో ఈ ఉదంతం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దేశం మొత్తం మీద సంపదలు కలిగిన ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. విలువలు, వలువలు ఉన్నాయని చెప్పుకొనే సంఘపరివార్‌కు ఎంతో పట్టున్న ప్రాంతం.

లఖీ సోలంకి ఉదంతాన్ని ఒక వ్యక్తి విషాదంగా చూడటానికి లేదు. దుర్భర దారిద్రం లో నివసిస్తున్న వారి రక్షణకు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం అని కోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ చెప్పే రెండింజన్ల పాలనలో ఉన్న గుజరాత్ ప్రభుత్వానికి ఈ వ్యాఖ్య చెంపపెట్టు.

తల్లి కొట్టిన దెబ్బలకే రెండేళ్ల కూతురు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో చెప్పినందున ఇది చాలా తీవ్రమైన నేరమంటూ పోలీసులు లఖీకి బెయిల్ ఇవ్వరాదని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమె స్వయంగా అపస్మారక స్థితిలో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని కోర్టు చెప్పింది. తన కుమార్తె ఆకలిని తీర్చలేక వత్తిడికి లోనై బాధ్యతారహితంగా వ్యవహరించిందని కూడా వ్యాఖ్యానించింది. ఆ కుటుంబం దీర్ఘకాలం పాటు దారిద్ర్యం, ఆకలికి లోనైందని పేర్కొంది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి సుతార్ ఆకలి, దారిద్ర్యం, న్యాయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు అనేక సాహిత్య, తత్వశాస్త్ర, మత గ్రంథాలు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. వివిధ మత గ్రంథాలు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలనే నీతి బోధనలను కూడా ప్రస్తావించారు.

తినే ముందు ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే పాపాల నుంచి విముక్తి అవుతారని భగవద్గీత, “ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని ఇవ్వు” అన్న బైబిల్‌లోని ఏసుక్రీస్తు మాటలు, పొరుగువారు ఆకలితో ఉండగా కడుపునిండా తిని పడుకుంటే అలాంటి వారు నిజమైన విశ్వాసులు కాదన్న ఇస్లామిక్ బోధనలను ఉటంకించారు.

కొంతమంది ఆకలితో ఇబ్బంది పడుతుంటే అది కేవలం సామాజిక వైఫల్యం మాత్రమే కాదు, నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యం కూడా అవుతుందని జస్టిస్ సుతార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్నట్లుగా పసితనంలో పిల్లల సంరక్షణ, విద్య రాజ్యం బాధ్యత అని కూడా న్యాయమూర్తి చెప్పారు. అవి పిల్లల ప్రాథమిక హక్కులన్నారు. పౌష్టికాహారం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం రాజ్యాంగ బాధ్యత అని, వాటిని నెరవేర్చటంలో వైఫల్యం చెందినట్లు లఖీ సోలంకి కేసు వెల్లడించిందన్నారు. ఆకలిగొన్న వ్యక్తి ముందుగా రొట్టెను కోరతాడు తప్ప తత్వాన్ని కాదనే మాటతో న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వును ముగించారు.

ఈ కేసు రెండింజన్ల పాలన, గుజరాత్ ఆదర్శ రాష్ట్రం అనే ప్రచార బండారాన్ని బట్టబయలు చేసింది. బీజేపీ ఏలుబడిలో నెలకొన్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం.

ప్రతి ఏటా దేశాల ఆకలి సూచికలను ప్రకటిస్తున్నారు. మన దేశానికి ఇస్తున్న సూచికలను మేం అంగీకరించం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. పోనీ, స్వంత సూచికలను వెల్లడిస్తున్నదా? అదీ లేదు. ప్రపంచ ఆకలి సూచిక 2022లో మన దేశం 121 దేశాలలో 107వ స్థానంలో ఉంది. మనకంటే ఎగువన నైజీరియా 103వ, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉన్నాయి.

ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న తరుణంలో ఈ సూచిక వెలువడింది. తరువాత 2025లో 123 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో 2000 సంవత్సరంలో నూటికి మన మార్కులు 38.1, తరువాత 2008లో 34.6, నరేంద్ర మోదీ అధికారానికి వచ్చిన తరువాత 2016లో 29.3, పదకొండు సంవత్సరాల పాలన తరువాత 2025లో 25.8 పాయింట్లు వచ్చాయి.

ప్రపంచ సూచికల ప్రకారం 10 పాయింట్లలోపు ఉన్న దేశాల్లో తక్కువ ఆకలి, 10 నుంచి 20 పాయింట్ల మధ్య ఉంటే కాస్త మెరుగు, 20 నుంచి 35 పాయింట్ల మధ్య ఉంటే తీవ్రం, 35 నుంచి 50 మధ్య ఉంటే ఆందోళనకరం, అంతకు మించి ఉంటే మరింత ఆందోళనకర జాబితాలుగా దేశాలను వర్గీకరించారు. పన్నెండేళ్ల స్వర్ణయుగ పాలన తరువాత మన దేశం మూడవ తరగతిలో అంటే తీవ్ర ఆకలి ఉన్న దేశంగా ఉంది.

హరిత విప్లవం తరువాత విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. అయితే జనం కడుపునిండా మూడుపూటలా తింటే ఎగుమతికి అవకాశం ఉండదు. అలాంటి స్థితి లేని కారణంగానే మన దేశంలో “కనిపించని ఆకలి” ఉందని అనేక మంది వర్ణిస్తున్నారు.

ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, పోషకాహార లేమిని అంగీకరిస్తూ పోషణ్ అభియాన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అయినప్పటికీ మన దేశం 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాలకు గాను 102వ స్థానంలో ఉంది. మనకంటే మరో 21 దేశాలు ఇంకా దారిద్ర్యంలో ఉన్నాయి.

దున్నబోతే దూడల్లో, మేయబోతే ఎద్దుల్లో అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉంది. రాజకీయంగా మాకు తిరుగులేదు అని చెప్పుకొనేందుకు మెజారిటీ రాష్ట్రాలలో తాము లేదా మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం అని బీజేపీ చెప్పుకుంటుంది. మరి దాని పాలిత రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో అధోగతిలో ఎందుకు ఉన్నట్లు? పన్నెండేళ్ల మోదీ స్వర్ణయుగ పాలన తరువాత దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చూద్దాం.

జనాభాయే మనకు పెద్ద పెట్టుబడి అని నేతలు కబుర్లు చెబుతారు. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పారు. మన మనుషులు ఎలా ఉన్నారు?

ఉన్న సమాచారం, అంచనాల ప్రకారం పైన చెప్పిన ఉచిత ధాన్యం, పోషణ్ కార్యక్రమం అమలు తరువాత కూడా దేశంలో 12 శాతం మంది అంటే 17.2 కోట్ల మందికి పోషకాహారం లేదు. భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లల్లో ఐదేళ్ల లోపు వారిలో 35 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు. అంటే వారికి పోషకాహారం లేదు. ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 18.7 శాతం మంది ఉన్నారు.

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మనది ఒకటి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా, మరోవైపు అధిక బరువు, ఊబకాయం సమస్య కూడా పెరుగుతున్నది. ఆకలి జబ్బు కొందరికైతే, అధిక తిండి మరో జబ్బు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం పిల్లల్లో 67.1 శాతం మంది, తరుణ వయస్సులో ఉన్న బాలికల్లో 59.1 శాతం మంది రక్తహీనతతో ఉన్నారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో ఉన్నారు. ఇది కనిపించని ఆకలికి ఒక సూచిక అని చెప్పవచ్చు.

ప్రపంచ ఆహార మరియు పోషకాహార ప్రపంచ స్థితి నివేదిక 2025 ప్రకారం మన దేశంలో 40.4 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు. అరవై శాతం మంది పట్టణ జనాభాకు ప్రొటీన్ల లోపం ఉంది.

రెండు భారతాల దృశ్యం కనిపిస్తున్నది. ఒకటి పోషకాహారం లేని వారు, రెండు ఊబకాయం, అవసరానికి మించి బరువు పెరిగిన వారు. ఒక విచిత్రమైన స్థితి నెలకొంది. మొత్తం మరణాల్లో అంటువ్యాధులు కాని గుండె, మధుమేహం, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తున్నవారు 63.65 శాతం మంది ఉన్నట్లు అంచనా.

పైన చెప్పుకున్న లఖీ సోలంకి ఉదంతం ఏమి చెబుతోంది? ఆమెకు సంక్షేమ పథకాలు అంది ఉంటే ఇంట్లో ఆహార సమస్య వచ్చి ఉండేది కాదు. బిడ్డను చేతులారా పోగొట్టుకొనేది కాదు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రాల ఆకలి సూచికలను కూడా తయారు చేశారు. దేశాల సూచికల మాదిరిగానే వంద మార్కులకు వచ్చిన మార్కులను బట్టి వాటి వర్గీకరణను కూడా అదే మాదిరిగా చేశారు.

దేశ జాతీయ సగటు మార్కులు 29. తీవ్ర ఆందోళనకరంగా ఆకలి ఉన్న రాష్ట్రాలు అంటే 35 కంటే ఎక్కువ మార్కులు ఉన్నవాటిలో బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఇవి బీజేపీ లేదా వారి మిత్రుడైన నితీష్ కుమార్ ఏలుబడిలో ఉన్నవే అని వేరే చెప్పనవసరం లేదు.

దేశ సగటు 29 కంటే ఎక్కువ ఆకలి ఉన్న రాష్ట్రాలను ఆందోళనకర వర్గీకరణలో చేర్చారు. అవి గుజరాత్, ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిశా, మధ్యప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్.

ఒక మాదిరి అంటే 16 కంటే తక్కువ మార్కులు వచ్చిన రాష్ట్రాల్లో సిక్కిం, పుదుచ్చేరి, కేరళ వంటివి ఉన్నాయి. తక్కువ ఆకలి ఉన్నది, పన్నెండు కంటే తక్కువ మార్కులు వచ్చినది ఒక్క చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతమే.

ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ లేదా మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తామంటే నమ్మేదెలా!

ట్యాగ్‌లు: BJP Indian Politics political news