Skip to content
ప్రపంచం వార్తలు

ఇరాన్ యుద్ధం నుంచి బయటపడదాం.. ట్రంప్‌కు సెంట్కామ్ అధిపతి డాన్ కెయిన్ సలహా

Prajapaksham 09 Aug 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
ఇరాన్ యుద్ధం నుంచి బయటపడదాం.. ట్రంప్‌కు సెంట్కామ్ అధిపతి డాన్ కెయిన్ సలహా

ఇరాన్ యుద్ధం నుంచి బయటపడదాం.. ట్రంప్‌కు సెంట్కామ్ అధిపతి డాన్ కెయిన్ సలహా

వ్యూహం బెడిసి కొడుతుందని హెచ్చరికలు

కేవలం గగనతల దాడులతో ఇరాన్‌ను గెలవలేం..

పశ్చిమాసియా యుద్ధం నుండి వీలైనంత త్వరగా బయటపడకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని, ప్రమాదంలో పడతామని అమెరికా సెంట్కామ్ సర్వసైన్యాధిపతి డాన్ కెయిన్ (జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్) దేశాధ్యక్షుడు ట్రంప్‌కు రహస్యంగా ఒక సలహా ఇచ్చారని సిఎన్ఎన్ ఒక కథనం ప్రచురించింది. సిఎన్ఎన్‌తోపాటు ఇతర ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించాయి. ముగ్గురు అమెరికా అధికారులను మీడియా ఉటంకించింది.

గగనతల దాడులతోనే ఇరాన్‌ను అదుపుచేసి పాదాక్రాంతం చేసుకోవాలని మొదటినుండీ ట్రంప్ భావిస్తున్నారు. భూతల దాడులు చేస్తే ఇరాన్ అనుసరించే పర్షియన్ తరహా వ్యూహాల వల్ల అమెరికా సైనికులు గణనీయ స్థాయిలో మరణించే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు. ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని, అవసరానికి మించినన్ని నిల్వలు ఉన్నాయని ట్రంప్ గంభీర ప్రకటనల ద్వారా ఇరాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ గగనతల దాడుల వల్ల ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని కొద్దిరోజుల క్రితం డాన్ కెయిన్ మొదటిసారి బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా రక్షణమంత్రి పెట్ హెగ్సెత్ కూడా బాహాటంగా ఇదే విషయాన్ని చెప్పారు. కీలకమైన ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయని, ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయని హెగ్సెత్ తనదైన భాషలో బయటకు చెప్పారు.

దీనిపై ట్రంప్ మింగలేక కక్కలేక హెగ్సెత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆయనతో తగాదా పెంచుకోలేక హెగ్సెత్‌తో తనకు విభేదాలు లేవని, ఆయన గొప్ప వ్యక్తి అని సమర్థించారు. కానీ వాస్తవాన్ని జీర్ణించుకుని వెనక్కు తగ్గేందుకు ట్రంప్ ఇష్టపడటం లేదు.

ఈ దశలో సిఎన్ఎన్ కథనం సంచలనం సృష్టించింది. డాన్ కెయిన్ ఒంటరిగా ఈ అభిప్రాయం ప్రకటించలేదు. సిఐఎ డైరెక్టర్ రాడ్ క్లిఫ్, విదేశాంగమంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌తో, ఇతర కీలక క్యాబినెట్ అధికారులతో కూడా ఆయన చర్చించారు. ట్రంప్‌తో ఏకీభవించే కీలక సలహాదారులతో కూడా డాన్ కెయిన్ సమావేశాలు జరిపారు.

సైనిక ప్రత్యామ్నాయాలను, పరిమితులను, లోపాలను ఆయన సమీక్షించారు. సైన్యాన్ని కాపాడుకోవడానికి ట్రంప్ అనుసరించే ఎత్తుగడ యుద్ధంలో సరిపోదని ఆయన చెప్పారు. కొద్దివారాలుగా డాన్ కెయిన్ చాలా రహస్య మార్గాలలో ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తున్నారు. యుద్ధం నుండి బయటపడే మార్గాలను అన్వేషించాలని ట్రంప్‌కు చెబుతున్నారు.

రెండవ ప్రపంచయుద్ధం తరహాలో అతిభారీ దాడులు ఇరాన్‌పై చేస్తామని ఇటీవల అనేకసార్లు ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఇరాన్ ఈ విషయంలో అణుబాంబు ప్రయోగం చేస్తారన్న ఆలోచనలు చేస్తూ, ప్రతివ్యూహాలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగడుతోంది. కానీ దాడులను పెంచితే అమెరికా వ్యూహం వికటిస్తుందని డాన్ కెయిన్ ట్రంప్‌కు హెచ్చరిక చేశారని సిఎన్ఎన్ పేర్కొంది.

యుద్ధం నుండి ఎలా బయటపడాలనే విషయంపై ట్రంప్‌కు ఒక అవగాహనగానీ, ఒక ప్రణాళికగానీ లేదని ఇరాన్ పాలకులు ఇప్పటికే ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని ట్రంప్ స్వయంగా రుజువు చేసుకుంటున్నారు. 14,000 లక్ష్యాలపై దాడులు చేసి ఇరాన్‌ను రాతియుగంలోకి నెట్టేశామని ట్రంప్ పదే పదే చెప్పారు.

అయినాగానీ ఇరాన్ యుద్ధ దాడులు చేసేందుకు నేటికీ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది తప్ప వెనక్కు తగ్గడం లేదు. తాము ప్రతిఘటన వ్యూహం అనుసరిస్తున్నాం తప్ప యుద్ధం చేయడం లేదని ఇరాన్ ప్రకటించింది. ఈ దశలో ట్రంప్ ఎటూకాని చౌరస్తాలో నిలబడిపోయారు.

అయితే ట్రంప్ కూడా ఇరాన్‌ను నూటికి నూరు శాతం బెదిరించి లొంగదీసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఇరాన్ అందుకు సిద్ధంగా లేదని ఆచరణలోగానీ ట్రంప్‌కు అర్థం కాలేదు. మొజాబా ఖమేనీకి ఇరాన్‌ను పాలించే అర్హత లేదని, ఆయన దేశ నాయకుడిగా పనికిరాడని, అన్ని వ్యవహారాలను చక్కబెట్టగల సామర్థ్యం లేదని మొదట్లో విమర్శించిన ట్రంప్, ఆ తర్వాత మొజాబా ఖమేనీని మెచ్చుకున్నారు. వీలైతే ఆయనను కలుసుకోవాలని కోరుకుంటున్నానని ప్రకటించారు.

ఇరాన్ లోతు ఎంతో యుద్ధంలో దిగితేగానీ ట్రంప్‌కు అర్థం కాలేదు. ఇదే విషయాన్ని డాన్ కెయిన్ తనదైన భాషలో చెప్పారు. అమెరికన్ ప్రజలు ట్రంప్‌ను మొదటినుండీ ఈ యుద్ధం మంచిది కాదని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజల్లో ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణం ఇదే.

యుద్ధం మూడు వారాల్లో ముగిసిపోతుందని ట్రంప్ మొదట ప్రకటించారు. కానీ ఆ పరిమితి దాటిపోయిందని, ఐదు నెలలు గడిచిందని డాన్ కెయిన్ చెబుతున్నారు. అయితే కెయిన్ ప్రతినిధి జోసెఫ్ హోల్డ్ ఈ కథనాలను కొట్టిపారేశారు. జాతీయ ప్రయోజనాలకు ఏది ఉత్తమమో ఆ నిర్ణయమే ఆయన తీసుకుంటారన్నారు.

ట్యాగ్‌లు: Iran Iran War News Trump