Skip to content
తెలంగాణ వార్తలు

క్షుద్ర పూజలకు బలయ్యేదెవరు.. మూఢనమ్మకాల మధ్య వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు..

Prajapaksham 06 Aug 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
క్షుద్ర పూజలకు బలయ్యేదెవరు.. మూఢనమ్మకాల మధ్య వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు..

Harish rao vs Mahesh Kumar Goud

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజలు అంశం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం క్షుద్ర పూజలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై హరీశ్ రావు స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు

రాజకీయాల్లో నాయకుల మధ్య విధానపరమైన విమర్శలు, సైద్ధాంతిక విభేదాలు ఉండటం సర్వసాధారణం. అయితే కాలక్రమేణా ఆ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, బూతు పురాణాలకు దారితీయగా.. తాజాగా తెలంగాణ రాజకీయాలు ఏకంగా క్షుద్ర పూజల ప్రస్తావన చుట్టూ తిరుగుతూ తీవ్ర స్థాయిలో దిగజారడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, మళ్లీ అధికారంలోకి రావడం కోసం హరీష్ రావు తాంత్రిక, క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేటీఆర్, హరీష్ రావులు నిత్యం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

హరీష్ రావు అరుంధతి సినిమాలోని పశుపతి పాత్ర తరహాలో విచిత్ర శక్తుల కోసం క్రూరమైన క్షుద్ర పూజలు చేస్తున్నారని మహేష్ గౌడ్ పోల్చారు. కర్ణాటకలోని షిమోగా సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికా దేవి ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లి హరీష్ రావు రహస్యంగా ఈ పూజలు నిర్వహించారని.. దీనికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన సవాల్ విసిరారు.

కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హరీష్ రావు కర్ణాటకలోని పవిత్రమైన మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు చేస్తే.. దానిని క్షుద్ర పూజలంటూ దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆదిగురు శంకరాచార్యులు నడయాడిన పవిత్రమైన శివమొగ్గ ప్రాంతాన్ని, మూకాంబికా దేవిని దర్శించుకుంటే క్షుద్ర పూజలుగా చిత్రీకరించడం భక్తుల నమ్మకాలను తీవ్రంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నాసిరకం కథనాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నాయకులు కూడా మూకాంబికా ఆలయాన్ని సందర్శించారని, మరి వారంతా కూడా క్షుద్ర పూజలే చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రాబల్యాన్ని తగ్గించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందంటూ శ్రవణ్ ఎదురుదాడికి దిగారు.
ప్రజాసమస్యలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై చర్చలు జరగాల్సిన రాజకీయ వేదికలపై.. ఇలాంటి మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల ఆరోపణలు ప్రధానాంశాలుగా మారడంపై రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నాయకులు వ్యక్తిగత దూషణలు దాటి సమాజానికి ప్రమాదకరమైన మూఢనమ్మకాల వైపు విమర్శలను తీసుకెళ్లడం ఆమోదయోగ్యం కాదని.. ఇది సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.