సముద్రంలో కలిసిపోతున్న కోస్తా నగరాలు.. సముద్ర మట్టం కంటే వేగంగా కుంగిపోతున్నట్లు శాస్త్రవేత్తల హెచ్చరిక..
Costal Area
ప్రపంచంలోని అనేక తీర నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని తాజా శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం, వేగవంతమైన పట్టణీకరణ, నేల కుంగుదల (Land Subsidence), అలాగే వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగుతోంది.ఇది తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పును తెచ్చిపెడుతోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో వరదలు, తీర ప్రాంతాల కోత, మౌలిక సదుపాయాల నష్టాన్ని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సినిమాల్లో కనిపించేలా సముద్రం నగరాలను మింగేసే పరిస్థితులు భవిష్యత్తులో నిజమయ్యే ప్రమాదం ఉందని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడమే కాకుండా.. తీర ప్రాంతాల్లో భూమి క్రమంగా కుంగిపోవడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు కొత్త ముప్పుగా మారిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ రెండు అంశాలు కలిసి తీర నగరాలను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.
జర్మనీలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ (TUM), అమెరికాలోని టులేన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రతిష్ఠాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సగటున ఏడాదికి 6 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు అధికమని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడంతో పాటు నేల కూడా క్రమంగా దిగజారడం వల్ల వరదలు, తీర కోత, మౌలిక వసతులకు నష్టం వంటి ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయని అధ్యయనం హెచ్చరించింది.
తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేయడం, చమురు, సహజవాయువు వెలికితీత, నదీ డెల్టాల్లోని మెత్తటి నేల కుంగిపోవడం, భారీ భవనాల నిర్మాణం వంటి మానవ కార్యకలాపాలే ప్రధాన కారణాలని పరిశోధకులు పేర్కొన్నారు. అదనంగా భూకంప ఫలకాల కదలికలు, మంచు యుగం అనంతరం భూపొరలో జరుగుతున్న సహజ మార్పులు కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయని వివరించారు.
అధ్యయనం ప్రకారం థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, ఈజిప్ట్, చైనా, ఇండోనేషియా వంటి దేశాల తీర ప్రాంతాల్లో ఏడాదికి 7 నుంచి 10 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల నమోదవుతోంది. అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ వంటి దేశాల్లో ఈ పెరుగుదల 4 నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య ఉంది.
ఇండోనేషియా రాజధాని జకార్తా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదంలో ఉన్న తీర నగరంగా అధ్యయనం పేర్కొంది. అక్కడ సగటున ఏడాదికి 13.7 మిల్లీమీటర్ల మేర నేల కుంగిపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 42 మిల్లీమీటర్ల వరకు నమోదవుతోంది. అలాగే చైనాలోని టియాంజిన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, నైజీరియాలోని లాగోస్, ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నగరాలు కూడా అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్నాయి.
అయితే అన్ని తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి క్రమంగా పైకి లేస్తుండటంతో అక్కడ సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు.
భూగర్భ జలాల అధిక వినియోగాన్ని నియంత్రించడం, తీర ప్రాంతాల్లో శాస్త్రీయ పట్టణ ప్రణాళికలు అమలు చేయడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం ద్వారా ఈ ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని పరిశోధకులు సూచించారు. ఒకప్పుడు ఏడాదికి 10 సెంటీమీటర్లకుపైగా నేల కుంగిపోయిన టోక్యోలో ప్రభుత్వ చర్యలతో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని గుర్తుచేశారు. ఇలాంటి దీర్ఘకాలిక చర్యలను ప్రపంచ దేశాలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
- TRAI New Rules: డేటా అవసరం లేని వారికి గుడ్‌న్యూస్.. కేవలం కాల్స్, SMS కోసం తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు..
- Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..