భ్రమలు గొలుపుతున్న కోచింగ్ సెంటర్లు
Coaching centers creating false impressions
ఆళవందార్ వేణు మాధవ్
విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం. సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి విద్యే మూలాధారం. కానీ ఇటీవలి కాలంలో విద్యారంగం క్రమంగా వ్యాపారరంగంగా మారిపోతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటి, నీట్, జెఇఇ, సివిల్స్, బ్యాంకింగ్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందించే కోచింగ్ సెంటర్లు తమ ప్రచారంతో విద్యను వ్యాపార వస్తువుగా మార్చుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలు వెలువడగానే దినపత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో రంగురంగుల ప్రకటనలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రకటనలు విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా, అనవసరమైన మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అసమానతలను కూడా పెంచుతున్నాయి. అందువల్ల కోచింగ్ సెంటర్ల ప్రకటనలను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ సమంజసమైనదే.
ప్రస్తుతం ఒక విద్యార్థి విజయం సాధిస్తే, ఆ విద్యార్థి ఫోటోను పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనగా ప్రచురించడం, టివిల్లో పదేపదే ప్రసారం చేయడం సాధారణమైపోయింది. ‘ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మా సంస్థదే’, ‘టాప్-10లో మా విద్యార్థులే’, ‘వంద శాతం విజయమే మా లక్ష్యం’ వంటి ఆకర్షణీయమైన నినాదాలతో తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్నారు. అయితే ఈ ప్రకటనల్లో చూపిస్తున్న ప్రతి విజయం నిజంగా ఆ సంస్థ శిక్షణ ఫలితమేనా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండదు. కొందరు విద్యార్థులు కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే రాసినా, వారిని కూడా తమ విద్యార్థులుగా ప్రచారం చేయడం జరుగుతోంది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య. ఈ ప్రకటనల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్న వారు మధ్యతరగతి, పేద కుటుంబాలే. తమ పిల్లలు కూడా టాపర్లు కావాలనే ఆశతో తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థి విజయం వెనుక అతని కృషి, కుటుంబ సహకారం, పాఠశాల విద్య, వ్యక్తిగత ప్రతిభ వంటి అనేక అంశాలు ఉంటాయి. కానీ కోచింగ్ సెంటర్లు మొత్తం విజయాన్ని తమకే ఆపాదించుకుంటాయి. దీంతో తల్లిదండ్రులు తప్పనిసరిగా ఖరీదైన కోచింగ్ అవసరమనే భ్రమలో పడుతున్నారు. కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ నాణ్యమైన బోధనలో ఉండాలి కానీ ప్రకటనల ఆర్భాటంలో కాదు. లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేయడం కన్నా, ఆ నిధులను మెరుగైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ బోధన, విద్యార్థుల సంక్షేమం కోసం వినియోగిస్తే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుం ది.
దినపత్రికలు, టెలివిజన్ ఛానళ్లు కూడా ఈ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నప్పటికీ, సామాజిక బాధ్యతను మరవకూడదు. ప్రభుత్వం, విద్యాశాఖ, వినియోగదారుల పరిరక్షణ సంస్థలు, ప్రకటనల నియంత్రణ సంస్థలు కలిసి కఠిన నిబంధనలు రూపొందించాలి. తప్పుడు విజయాల ప్రచారం, ర్యాంకుల దుర్వినియోగం, విద్యార్థుల ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించడం వంటి చర్యలపై భారీ జరిమానాలు విధించాలి. అవసరమైతే దినపత్రికలు, టెలివిజన్, రేడియో, డిజిటల్ మాధ్యమాల్లో కోచింగ్ సెంటర్ల ఎంట్రన్స్ పరీక్షల ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి. విద్యార్థుల విజయాల గురించి సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వ అధికారిక పోర్టల్ లేదా విద్యా సంస్థల వెబ్సైట్లలో మాత్రమే పరిమితం చేయాలి. విద్యార్థుల కలలను మార్కెటింగ్ సాధనంగా మార్చడం సమాజానికి మంచిది కాదు. విద్యారంగంలో నైతిక విలువలు, పారదర్శకత, సమాన అవకాశాలను కాపాడేందుకు కోచింగ్ సెంటర్లు ఇస్తున్న దినపత్రిక లు, టెలివిజన్ ప్రకటనలను రద్దు చేయడం లేదా కఠినంగా నియంత్రించడం అత్యవసరం. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల నమ్మకం, సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన విద్యా సంస్కరణకు నాంది అవుతుంది.