Skip to content
తెలంగాణ వార్తలు

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Prajapaksham 31 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Godavari Swells at Bhadrachalam

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ప్రమాదకర స్థాయికి చేరువ కావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఎగువ ప్రాంతాలైన విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇంద్రావతి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు అధికారికంగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డతో పాటు భద్రాచలం వద్ద వరద ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టాలు మరింత పెరిగే వీలుంది.

వరద ఉధృతి ప్రమాదకరంగా మారుతుండటంతో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ‘గోదావరి ఫ్లడ్ మాన్యువల్’ ప్రకారం వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే విధుల్లోకి చేరి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం సమీక్షించేందుకు వీలుగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, సబ్ కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, నది నీటిమట్టం గడిచిన రాత్రి నుంచి ఇప్పటివరకు ఏకంగా 14 అడుగులు పెరిగినప్పటికీ, భద్రాచలం స్నాన ఘట్టాల వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుణ్యస్నానాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వరద ప్రమాదాన్ని గ్రహించలేక ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దిగుతున్నారు. ఘాట్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, హెచ్చరికలు జారీ చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ లేదా గ్రామపంచాయతీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై భక్తులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న వేళ ఘాట్ల వద్ద తక్షణమే మైకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని కాపలా ఉంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.