Technical Glitch: ప్రధాని మోదీ ఫేస్బుక్ వీడియో బ్లాక్.. టెక్నికల్ గ్లిచ్ అంటూ మెటా క్షమాపణ.. విచారణ వేటలో కేంద్రం..
PM Modi Facebook video
Technical Glitch: కేంద్ర ప్రభుత్వానికి.. ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటా సంస్థ (Meta) అధికారికంగా క్షమాపణలు చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వీడియోను ఫేస్బుక్ వేదిక నుంచి హఠాత్తుగా తొలగించిన ఘటనపై మెటా ప్రతినిధులు స్పందిస్తూ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
కేవలం సాంకేతిక కారణాల వల్లే ఆ వీడియో తొలగించబడిందని, తొందరపాటుతో జరిగిన ఈ పొరపాటును గుర్తించిన వెంటనే సదరు వీడియోను తిరిగి రిస్టోర్ చేశామని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే దేశ ప్రధాని వీడియోనే సామాజిక మాధ్యమం నుంచి అకస్మాత్తుగా మాయం కావడం పట్ల భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి మెటా సంస్థ ఇచ్చిన వివరణపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీడియో తొలగింపునకు దారితీసిన వరుస క్రమ పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో ఏవైనా అంతర్గత లోపాలు ఉన్నాయా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై స్పష్టత కోసం మెటా సంస్థ ప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులకు త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా సమన్లు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ వివాదానికి మూలం జూలై 23న జరిగింది. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ అని పేర్కొంటూ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను ఉద్దేశించి, దేశంలో సంచలనం సృష్టిస్తున్న పేపర్ లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోనుందని వెల్లడిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఆ వీడియో అప్లోడ్ అయిన కాసేపటికే సామాజిక మాధ్యమం నుంచి కనిపించకుండా పోయింది.
చట్టపరమైన విజ్ఞప్తి (Legal Request) వల్లే ఈ వీడియోను తాత్కాలికంగా నిలిపివేసినట్లు (Withheld) ఒక నోటీసు దర్శనమిచ్చింది. తొలగించడానికి ముందే ఈ వీడియో లక్షలాది వ్యూవ్స్ సాధించగా.. ఆ తర్వాత మెటా సంస్థ దీనిని పునరుద్ధరించింది. అయినప్పటికీ ఈ అంశంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో మెటా క్షమాపణలు చెప్పక తప్పలేదు.