Super El Niño Warning: సూపర్ ఎల్‌నినో హెచ్చరిక.. భూమికి పొంచి ఉన్న మరో ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు
Super El Niño Warning: 2027 Could Rewrite Earth's Heat Records
Super El Niño Warning: వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీతమైన మార్పులు ఇప్పటికే ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న సూపర్ ఎల్ నినో ప్రభావం రాబోయే రోజుల్లో మానవాళిని మరింత కలవరపెట్టే సంకేతాలను అందిస్తోంది. ఇప్పటికే భూగోళం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో, తీవ్రమైన వేడిగాలులతో, అకాల కరువులతో పాటుగా అకస్మాత్తుగా విరుచుకుపడే తుఫాన్లు, వరదలతో అతలాకుతలమవుతోంది.
ఇలాంటి సంక్లిష్ట సమయంలో పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో చోటుచేసుకుంటున్న భౌగోళిక విపరిణామాలు రాబోయే కొన్నేళ్లలో వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం.. ఈ మహాసముద్రంలో ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితుల తీవ్రత రాబోయే సంవత్సరాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
సముద్రాలలో దాగిన అపారమైన వేడి ఒక్కసారిగా భూ వాతావరణంపై ప్రభావం చూపదు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోనూ, లోపలి పొరల్లోనూ రూపుదిద్దుకునే ఈ అదనపు వేడి క్రమంగా వాతావరణంలోకి విడుదల కావడానికి సమయం పడుతుంది. ఈ కారణంగానే ఎల్ నినో ప్రభావం పసిఫిక్‌లో ప్రారంభమైన వెంటనే కాకుండా.. ఆ తర్వాతి సంవత్సరంలో దాని తీవ్రత అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఎల్ నినో బలపడటం వల్ల ప్రవేశించబోయే కాలంలో ఉష్ణోగ్రతలు నిలకడగా పెరుగుతూ వస్తాయి. ఈ క్రమంలో ముందుగా వచ్చే సంవత్సరం ప్రపంచంలోనే రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆ తర్వాత రాబోయే సంవత్సరం మాత్రం మానవ చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచిపోయే ప్రమాదముంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల విడుదలైన గ్రీన్హౌస్ వాయువులు ఇప్పటికే భూమి చుట్టూ వేడిని బంధిస్తుండగా.. దానికి ఎల్ నినో జతకూడటం వల్ల ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయికి చేరుకుంటాయి.
గతంలో 1997-98 కాలంలో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా అపార నష్టం వాటిల్లింది. అనేక దేశాలు తీవ్రమైన కరువు కాటకాలను, వరద భీభత్సాలను ఎదుర్కొన్నాయి. అయితే నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత ముప్పు మరింత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇంధనాల వినియోగం, బొగ్గు వినియోగం, కార్బన్ ఉద్గారాల వల్ల భూమి ఇప్పటికే తీవ్రంగా వేడెక్కిపోయింది. సహజసిద్ధంగా వచ్చే ఎల్ నినో ప్రక్రియకు మానవ తప్పిదాల వల్ల పెరిగిన గ్లోబల్ వార్మింగ్ తోడవ్వడం వల్ల ఈసారి వచ్చే భీభత్సం ఊహకందని రీతిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.
దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, ఊహించని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా దేశాలలో వర్షాలు తీవ్రంగా తగ్గిపోయి ఎండలు, కరువు పరిస్థితులు దాడి చేస్తాయి. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వినాశకరమైన తుఫాన్లు ఉద్భవించి.. తమ సాధారణ మార్గాలను మార్చుకుంటూ తీర ప్రాంతాలపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.
భారతదేశంపైనా ఈ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో బలమైన ఎల్ నినో ఏర్పడిన సమయాల్లో భారతదేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయిన ఆధారాలు ఉన్నాయి. రుతుపవనాల గమనాన్ని హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు వంటి ఇతర స్థానిక అంశాలు కూడా ప్రభావితం చేసినప్పటికీ.. ఎల్ నినో ఉధృతి పెరిగితే మాత్రం తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు, తాగునీటి ఎద్దడి, వ్యవసాయ సంక్షోభం ఎదురయ్యే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము.
మొత్తంగా చూస్తే ఎల్ నినో అనేది సహజమైన ప్రకృతి మార్పే అయినప్పటికీ.. దానికి మానవ తప్పిదాలు తోడవ్వడం వల్ల అది రాకాసి రూపం దాల్చుతోంది. భూగోళం వేడెక్కే వేగం తగ్గకపోవడం రాబోయే కాలంలో పర్యావరణ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారనుంది. మారుతున్న ఈ ప్రతికూల పరిస్థితులు భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే మహా ముప్పుకు ఒక ముందస్తు హెచ్చరికగా భావించి.. ఇప్పటికైనా గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.