గుర్తు పెట్టుకో మోదీ.. ఇది చావుకు భయపడే జనరేషన్ కాదు..నీ ఉడుత ఊపులకు జెన్ Z..భయపడదు…ధర్నా చౌక్‌లో కేటీఆర్ గర్జన…
ktr-speech-at-dharna-chowk-gen-z-protest-pm-modi
ప్రధాని మోదీ.. నువ్వు కొరివితో తల గోక్కున్నావ్..తరం మారుతోంది, స్వరం మారుతోంది.. నవతరం వరస మారుతోంది అంటూ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ఏర్పాటు చేసిన విద్యార్థుల నిరసన దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యువకులు తలచుకుంటే.. నేపాల్‌లో ప్రభుత్వం దించేశారు, శ్రీలంకలో ఉన్నోళ్లకు ఉరికించి ఉరికించి దేశం అవతలకు పంపించారు. ఎవరితో పెట్టుకోకూడదో.. వాళ్లతోనే నువ్వు పెట్టుకున్నావ్ మోదీ అని కేటీఆర్ హెచ్చరించారు.
విద్యార్థులు, యువకులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఒకడేమో టెర్రరిస్టులని, ఇంకొకడేమో ఖలిస్తానీయులని, మరొకడు అర్బన్ నక్సలైట్ అని, ఇంకా దేశద్రోహులని, పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తోందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో మనిషన్నవాడు ఉండుంటే ఈ పాటికే విద్యార్థుల సమస్యను పరిష్కరించేవాడని, తాను మోదీపై పోరాడుతుంటే కేడీగాడైన రేవంత్ రెడ్డి మధ్యలో కులుకుతున్నాడని, ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తే ఈ నల్లమల పిల్లి కొడంగల్‌లో దాక్కుందని, ఆ కొడంగల్‌లోనూ రాహుల్ గాంధీకి దెబ్బలు తగిలాయని బాధపడ్డాడే తప్ప విద్యార్థుల గురించి మాట్లాడలేదని, నీక్కూడా కూతురు ఉంది… మనవడు ఉన్నాడు, నీ పిల్లల్ని ఢిల్లీలో కొట్టినట్లు కొడితే నువ్వు ఊరికే ఉంటావా రేవంత్ అంటూ ప్రశ్నించారు.
నన్ను జంతర్‌మంతర్‌కి వెళ్లొచ్చు కదా, అని చాలా మంది వచ్చి చెప్పగా తాము జంతర్‌మంతర్ పోయి తమ జెండా పట్టుకొని వారి ఎజెండాను హైజాక్ చేయడం కరెక్ట్ కాదని వాళ్లకు చెప్పానని, యువత కరెక్ట్‌గానే పోరాడుతోందని, అవసరమైతే పక్కనుంది సహాయం చేస్తామని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులపై కేసులైతే లీగల్‌గా కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మాట్లాడారు.
ఇదిలా ఉంటే… NEET UG పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీలో చలో పార్లమెంటు నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జికి వ్యతిరేకంగా హైదరాబాద్‌వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నేడు వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు శుక్రవారం నగరంలో వరుస ఆందోళనలు నిర్వహించారు. విద్యార్థులు ప్రధానంగా పారదర్శకమైన విచారణ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NTA రద్దు, బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నారాయణగూడ క్రాస్ రోడ్స్ వద్ద ప్రారంభమై వై-జంక్షన్ వద్ద ముగిసిన ఈ ర్యాలీలో SFI, AISF, NSUI, PDSU, AIFDS, AIPSU, AISB సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఈ నిరసన కారణంగా రద్దీగా ఉండే నారాయణగూడ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంతేకాకుండా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు నేడు జంటనగారల్లో అనేక విద్యాసంస్థలు మూసివేశారు.
ఢిల్లీలో జరిగిన ఘటనలపై పారదర్శక విచారణ జరపాలని కోరడంతో పాటు, పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కూడా వారు కోరారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని, ప్రతిపాదిత ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025’ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.