Telangana Weather Update Today: తెలంగాణలోని ఈ జిల్లాలో నేడు భారీ వర్షాలు..వెదర్ అప్ డేట్స్ మీ కోసం…
Telangana Weather: తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేడు (జూలై 24) వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగా రెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదుకానుండగా, గాలిలో తేమ శాతం 63% నుండి 65% వరకు ఉండే వీలుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య వర్ష సూచన కాస్త ఎక్కువగా ఉంది.
నేడు పడమర దిశ నుండి గంటకు 16 నుండి 25 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో, విద్యుత్ స్తంభాలు లేదా పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు సాయంత్రం వేళ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎల్ నినో ప్రభావం తగ్గడంతో వర్షపాతంలో ఏర్పడిన లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని, త్వరలోనే వర్షాకాలం తిరిగి పుంజుకుంటుందని తెలుస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రమబద్ధమైన వర్షాలు కురిసి, తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం లభించడమే కాకుండా, తాగు మరియు సాగునీటి ఎద్దడి తప్పుతుందని భావిస్తున్నారు.
ఈ మార్పు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనివ్వనుంది. ఎల్ నినో తగ్గడం వల్ల రుతుపవనాలు మరింత క్రియాశీలంగా మారి, వర్షపాతం సాధారణ స్థాయికి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రాబోయే వారాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే సూచనలు ఉండటంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరిగి, అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటి అవసరాలకు తగినంత నీరు లభిస్తుందని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.