మిద్దె తోటలు, పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి
The cultivation of terrace gardens and backyard gardens should be encouraged.
షేక్ బాబా (ప్రధాన కార్యదర్శి, ప్రజాసైన్స్ వేదిక)
మిద్దె తోటలు పెరటి తోట పెంపకంతో మంచి ఆరోగ్య ఆహార అలవాట్లకు శ్రీకారం చుడితే మెరుగైన సమాజాన్ని ఆశించవచ్చు. పండుగ పేరుతో వీధుల్లో, కూడళ్లలో దిష్టి బొమ్మల్లా ప్లాస్టిక్ బ్యానర్లు కట్టి, ప్లాస్ట్రో ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను తాగే నీటిలో కలిపి డిజెలు పెట్టి అసభ్యకర నృత్యాలు, వేషధారణకు రంగులు చల్లుకోవడం లాంటి అనాగరిక విధానాలకు స్వస్తి పలకాలి, ప్లాస్టిక్ వినియోగం సున్నా స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. శోభా యాత్రల పేరిట ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి ఎర్రటి ఎండలో అసలే పెట్రోల్ దొరకని రోజుల్లో కాలుష్యం వెదజల్లుతూ రోడ్డుకు అడ్డంగా డిమాండ్ లేని నాయకు ల బ్యానర్లు కట్టి ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే పనులు తగ్గించాలి. ప్రభుత్వం కాయగూరల విత్తనాలు, పండ్ల మొక్కలు, చెట్లు రాయితీ ధరకు ఇవ్వాలి. పిల్లలకు సీడ్ బాల్స్ తయారు చేయడం, మొక్కలు నాటడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం నేర్పాలి. గ్రీన్ ఛాలెంజ్, ఐస్ బకెట్ చాలెంజ్ లాంటివి సెలెబ్రిటీలచే నిర్వహిస్తున్న ప్రభు త్వం, పెరటి తోటలు పెంచడం మంచి ఆహార ఆరోగ్య అలవాట్లు ప్రోది చేస్తు మెరుగైన సమాజానికి దోహదపడుతున్న వారికోసం ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రచారం చేస్తే సమాజం బాగుపడుతుంది. మనం నిత్యం భుజించే వాటిలో ఆకుకూరలు కూరగాయలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరలు ద్వారానే. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే, పెద్దవారికి రోజుకు కనీసం 85గ్రా. పండ్లు, 300 గ్రా. కూరగాయలు అవసరం. కానీ, మన దేశంలో ప్రస్తుతం కాయగూరలు ఉత్పత్తి ప్రకారం చూస్తే , రోజూ సగటున ఒకరికి కేవలం 120 గ్రా. కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజలకు కూరగాయలు అందుబాటులో లేకుండా పోవడం, ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో కొనలేని పరిస్థితి. పెరటిలో, మిద్దెమీద తోటలు పెంచడంతో జీవన శైలిలో మార్పు లు గ్రహించవచ్చు. గృహిణులు, పిల్లలు వీటి సంరక్షణ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒకప్పుడు హార్టికల్చర్, అగ్రికల్చర్ శాఖల వారు కూరగాయల విత్తనాలు ఇచ్చారు. బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయ, మిరప, టమోటా, ఆకుకూరలలో పొనుగంటి ఆకు, పాలకూర, చుక్కకూర, కోయగూర, గోంగూర, సిరి ఆకు, కొత్తిమీర, పుదీన ఎలాంటి వాతావరణంలో అయినా వస్తాయి. దీనికి ఎకరాల భూమి అవసరం లేదు. కేవలం ఒకటి రెండు సెంట్ల స్థలంలో అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.