భరతజాతి గుండె సవ్వడి.. మన జాతీయ జెండా
The heartbeat of the Indian nation... our national flag.
22 జులై జాతీయ జెండా అమోదించిన దినోత్సవం శుభ సందర్భంగా..
భారత జాతీయ జెండా రెపరెపలే 146 కోట్ల భారతీయుల గుండె లబ్ డబ్లు. దేశ ఔన్నత్యం, ఐక్యత, దేశ భక్తి, త్యాగం, జాతి గౌరవం, ఆకాంక్షలు, న్యాయం, సార్వభౌమాధికారం, శాంతి, సౌభాగ్యం, స్వేచ్ఛా స్వాతంత్య్ర పోరాటాలకు ఏకైక చిరునామాగా త్రివర్ణ పతాకం నిలుస్తున్నది. మచిలీపట్నానికి చెందిన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య రూపొందించిన ప్రస్తుత త్రివర్ణ జాతీయ పతాకాన్ని 22 జులై 1947న మన భారత రాజ్యాంగ సభ ఆమోదించడం, 15 ఆగష్టు 1947న భారత ప్రభుత్వం అధికారికంగా ఎగుర వేస్తూ అంగీకరించడం మన స్వతంత్ర భారత ఘన చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది. ప్రతి ఏట జులై 22న దేశవ్యాప్తంగా భారతీయులు జాతీయ పతాక ఆమోద దినోత్సవం లేదా జాతీయ పతాక దినోత్సవం (నేషనల్ ఫ్లాగ్ డే ఆర్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే) రూపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.
త్రివర్ణ పతాకంలో దాగిన నిగూఢ అనంత అర్థాలు:
చేనేత వస్త్రంతో మాత్రమే రూపొందించబడుతున్న మన జాతీయ జెండా 2:3 నిష్పత్తితో దీర్ఘ చతురస్రాకారంలో మూడు రంగులతో, మధ్యలో నావీ -బ్లూ రంగు అశోక చక్రం అమర్చబడి అందంగా ఉంటుంది. జాతీయ పతాకంలోని పై భాగంలో కాషాయ రంగు, మధ్యలో తెలుపు వర్ణం, క్రింది భాగాన ఆకుపచ్చ రంగు సమాన భాగాలుగా అమర్చబడి ఉంటాయి. మధ్యలో ఉన్న తెలుపు వర్ణం కేంద్రంగా నావీ-బ్లూ రంగు కలిగిన అశోక ధర్మ చక్రం అమర్చబడి ఉంటుంది. పై భాగాన ఉన్న కాషాయ రంగు దేశ శక్తి సామర్థ్యాల కు, త్యాగ స్పూర్తి, ధైర్యాలకు ప్రతీకగా నిలుస్తున్నది. మధ్యలో ఉన్న శ్వేత వర్ణం శాంతి, స్వచ్ఛత, సత్యాలను సూచిస్తున్నది. క్రింది భాగాన ఉన్న హరిత వర్ణం సమృద్ధి, హరిత సంపద, శుభప్రదం, సమగ్రాభివృద్ధిలను ప్రకటిస్తున్నది. మధ్య తెలుపు వర్ణం కేంద్రంగా సత్య ధర్మాలకు ప్రతీకగా అశోక ధర్మ చక్రం అమర్చబడి ఉన్నది. అశోక చక్రం ప్రగతి రథాలకు చిరునామాగా, చక్రంలోని 24 చువ్వలు స్వేచ్ఛ భారత స్ఫూర్తి, 24 గంటలు నిరంతర ప్రగతి పరుగులను ప్రకటిస్తున్నది. చక్రంలోని సారనాథ్ సింహం ధైర్య, గంభీర, న్యాయ, సుస్థిరతను సూచిస్తున్నది.
భారత జాతీయ పతాక చరిత్ర : 1907లో కాషాయం, పసుపు, ఆకుపచ్చ వర్ణాలతో కూడిన జెండాను బెర్లిన్ కమిటీ రూపొందించడం జరిగింది. అనంతరం అన్నీబిసెంట్, బాల గంగాధర తిలక్లతో కూడిన దేశ భక్తు లు ఐదు ఎరుపు చారలు, నాలుగు ఆకుపచ్చ చారలు, ఏడు నక్షత్రాలు, ఎడమ పై భాగాన యూనియన్ జాక్ సంతకంతో కూడిన పతాకాన్ని ఎగురవేయడం జరిగింది.1931లో వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం మధ్యలో చరకా చేర్చబడింది. దేశ స్వాతంత్య్రానికి కొద్దిరోజుల ముందు నేటి మన జాతీయ పతాకానికి తుది రూపం ఇస్తూ త్రివర్ణ పతాకం మధ్య భాగంలో చరకాకు బదులు గా అశోక ధర్మ చక్రం చేర్చబడింది. ఈ జాతీయ జెండాను 22 జులై 1947న భారత రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించడం ఒక అపూర్వ ఘట్టంగా దేశ స్వాతంత్య్ర చరిత్రలో నిలిచిపోయింది. మన జాతీయ జెండాను ఉదయం ఎగుర వేసి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు వరకు ఉంచుకోవచ్చని, మతపరమైన సందర్భాల్లో వాడకూడదని, నేలకు గాని నీటికి గాని తగలకుండా చూసుకోవాలని, జాతీయ జెండా కన్న ఎత్తులో మరో జెండా ఉండకూడదనే నియమనిబంధనలు కూడా చేర్చబడినవి. జెండా ఎగురవేసిన వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించడం ఒక అలవాటుగా మారింది.