Skip to content
ఎడిట్ పేజి వార్తలు

బ్రిటన్‌కు కొత్త ప్రధాని

Prajapaksham 21 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
బ్రిటన్‌కు కొత్త ప్రధాని

Andy Burnham becomes 7th British prime minister in a decade

లేబర్‌ పార్టీ నాయకునిగా గతవారం ఎన్నుకోబడిన యాండీ బర్న్‌హామ్‌ యునైటెడ్‌ కింగ్‌డం(యుకె) నూతన ప్రధానమంత్రిగా సోమవారం పదవీ ప్రమాణం స్వీకరించారు. ఈయన గత నాలుగేళ్లలో ఐదవ ప్రధానమంత్రి. 2024 జులైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌పార్టీకి 600లకు 412 సీట్లలో అఖండవిజయం సాధించి పార్టీని 14ఏళ్ల అరణ్యవాసం నుంచి అధికార అందలమెక్కించిన నాయకుడు కీర్‌ స్టార్మర్‌ రెండేళ్లలోనే మరోనాయకునికి అధికారం బదిలీ చేయటం లేబర్‌ పార్టీలో రాజకీయ కల్లోలానికి నిదర్శనం. గత దశాబ్దకాలంలో అసాధారణంగా అరడజను ప్రధానమంత్రులు మారటం డేవిడ్‌ కామరూన్‌, థెరిసా మే, బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రుస్‌, రిషి సునాక్‌ (కన్సర్వేటివ్‌ పార్టీ), కీర్‌ స్టార్మర్‌(లేబర్‌ పార్టీ) యుకెలోని ఆర్థిక, రాజకీయ అస్థిరతకు ప్రబల నిదర్శనం. సాధారణంగా కామన్స్‌ సభకు సార్వత్రిక ఎన్నికల తదుపరి అధికార బదిలీ జరగటం ప్రజాస్వామిక దేశాల్లో సర్వసాధారణం. కాని యుకెలో పార్టీల్లో అంతర్గత అలజడులు, తిరుగుబాట్లతో ప్రధానులు మారుతుండటం గమనార్హం. సంవత్సరాల తరబడి రాజకీయ అస్థిరత కారణంగా లేబర్‌ పార్టీకి ఓటర్లు పట్టంగట్టగా, దాని నాయకుడు స్టార్మర్‌కు కన్సర్వేటివ్‌ల నుంచి మందగమనంలోని ఆర్థిక వ్యవస్థ, పెచ్చుపెరిగిన ప్రభుత్వ అప్పు, భారంగా తయారైన ప్రజా సర్వీసులు, జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎస్‌), పెరిగిన వలసలు, గృహాలకొరత, ఎదుగుబొదుగులేని జీవన ప్రమాణాలు వారసత్వంగా లభించాయి. పదేళ్లకుపైగా కన్సర్వేటివ్‌ ప్రభుత్వాలనుంచి సంక్రమించిన వ్యవస్థాగత సమస్యలూ ఉన్నాయి. పర్యవసానంగా, త్వరితగతిన మార్పు తెస్తామన్న హామీని స్టార్మర్‌ ప్రభుత్వం నెరవేర్చలేక పోయింది. అనేక స్థానిక ఎన్నికల్లో వరుసగా వైఫల్యాలు, లేబర్‌ పార్టీ ఎంపిల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజామోద రేటింగ్స్‌లో క్షీణింపు, పార్టీలో అంతర్గత ఉద్రిక్తతలు ఇవన్నీ ఒకదానికొకటితోడై స్టార్మర్‌ అథారిటీని క్రమంగా బలహీన
పరిచాయి. నాయకత్వ మార్పుకై ఒత్తిడి తీవ్రతరం కావటం ఆయన రాజీనామాకు దారితీసింది.
లేబర్‌ పార్టీ నాయకత్వ మార్పు అతివేగంగా జరిగిన తీరే ఆ పార్టీలో భవిష్యత్‌ ఎన్నికల గూర్చి ఏర్పడ్డ భయసందేహాలను ప్రతిబింబిస్తోంది. కొత్త ప్రధాని బర్న్‌హామ్‌ జాతీయ రాజకీయాలకు కొత్తవాడేమీకాదు. వాయవ్య ఇంగ్లండ్‌లోని లీఘ్‌ నుంచి లేబర్‌ ఎంపిగా ఉన్న బర్న్‌హామ్‌ టోనీబ్లేయర్‌, గార్డన్‌ బ్రౌన్‌ ప్రభుత్వాల్లో కార్యదర్శిగా (మనభాషలో మంత్రి)గా పనిచేశారు. రెండుసార్లు లేబర్‌ నాయకత్వం కోసం విఫలయత్నం చేశాడు. 2017లో పార్లమెంటును విడిచిపెట్టి, కొత్తగా ఏర్పాటైన గ్రేటర్‌ మాంచెస్టర్‌ మేయర్‌ పదవికి పోటీచేసి సఫలమైనాడు. స్థానిక సంస్థలకు అధికారాల పంపిణీ, మెరుగైన ప్రజారవాణా, అందుబాటు ధరలో గృహవసతి, బలమైన స్థానిక ప్రభుత్వం వగైరా విధానాలను ఛాంపియన్‌ చేస్తూ బలమైన ప్రాంతీయ నాయకునిగా గుర్తింపు పొందారు.
కోవిడ్‌ సమయంలో ఉత్తర ఇంగ్లండ్‌కు నిధుల కోసం బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంతో బహిరంగంగా ఘర్షణపడి దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. లేబర్‌ పార్టీకి భావి నాయకుడన్న భావం కలిగించాడు. లేబర్‌పార్టీలో స్టార్మర్‌ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతున్న దశలో పార్లమెంటుకు వచ్చిన ఉపఎన్నికలో పోటీకి ఆయన కోరిన వెంటనే పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చింది. కాబోయే ప్రధాని బర్న్‌హామ్‌ అనే భావన ప్రచారంలోకి వచ్చింది. అందుకు తగినట్లు ఆయన దాదాపు పదేళ్ల తర్వాత పార్లమెంటులో ప్రవేశించాడు. నాయకత్వ మార్పు వెంటనే ఖరారైంది. స్టార్మర్‌ రాజీనామా చేయటానికి అంగీకరించాడు.
గతవారం లేబర్‌ ఎంపిల సమావేశం బర్న్‌హామ్‌ను నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సోమవారం ప్రమాణ స్వీకారం జరిగి పోయింది. జనాదరణ పెంచుకుంటున్న పచ్చిమితవాది నిగెల్‌ ఫరాగ్‌ పార్టీ ‘రిఫామ్‌ యుకె’ని ప్రతిఘటిస్తూ కార్మికవర్గం ఓటర్లకు పార్టీని చేరువ చేయగలిగిన వ్యక్తి బర్న్‌హామ్‌యేనని సీనియర్‌ మంత్రు లు, ట్రేడ్‌ యూనియనిస్టులు, ఎంపిలు శీఘ్రంగా ఆయన వెనుక చేరటం వల్లనే ఈ పరిణామాలు ఇంతవేగంగా జరిగాయి. బర్న్‌హామ్‌ ను కింగ్‌ ఆఫ్‌ ద నార్త్‌ అని పిలుస్తున్నారు. ఉత్తర ప్రాంతం నుంచి బ్రిటన్‌ అత్యున్నత అధికార స్థానానికి వచ్చిన నాయకులు అరుదు.
బర్న్‌హామ్‌ మీద లేబర్‌ పార్టీయే కాదు, మధ్యతరగతులు, శ్రామిక ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్నారు. అయితే ఫలితాలు సాధించటం మాటలు చెప్పినంత సులభం కాదు. ప్రభుత్వాన్ని మితవాదంవైపు నెట్టేందుకు ఇంట ఒత్తిళ్లు, రక్షణ వ్యయం పెంచి యూరప్‌లో బలమైన సైనిక శక్తిగా యుకెను తయారు చేయాలన్న ఒత్తిళ్లు, రెండోవైపున ఆర్థిక ఇబ్బందులు, ప్రజల అవసరాలు తీర్చటం, సేవలు మెరుగుపరచటం మధ్యనున్న వైరుధ్యం సామాన్యమైనది కాదు. రాజకీయ భౌగోళిక అస్థిరతలు, బలహీనమైన వృద్ధిగమనం, పెచ్చుపెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో కూడిన జి7 ఆర్థిక వ్యవస్థలో భాగంగా యుకెను నడిపించటం గ్రేటర్‌ మాంచెస్టర్‌ను పాలించినంత సులభం కాదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే 10 డౌనింగ్‌ వీధిలోకి యాండీ బర్న్‌హామ్‌ ప్రవేశించటం రొటీన్‌ నాయకత్వ మార్పు కాదు. లేబర్‌ పార్టీ భవితవ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం.

ట్యాగ్‌లు: Andy Burnham British prime minister