Adangal, Pahani: అడంగల్, పహాణీ అంటే ఏమిటి? రైతులకు ఇది ఎందుకు అవసరం?
అడంగల్, పహాణీ అంటే ఏమిటి? రైతులకు ఇది ఎందుకు అవసరం?
సాధారణంగా భూముల కొనుగోలు లేదా అమ్మకాలు జరుగుతున్నప్పుడు అందరూ అడంగల్ పహాని అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నిజానికి అడంగల్ అంటే ఏంటి.. పహాని అంటే ఏంటి…. ఇలాంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను అడంగల్ అని పిలుస్తారు. దీనినే తెలంగాణలో పహాని అని పిలుస్తారు. దీనిని విలేజ్ ఎకౌంట్ నెంబర్ 2 అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్ట సర్వే నెంబర్ కలిగిన భూమి ఎవరి ఆధీనంలో ఉంది అక్కడ ఏం జరుగుతుంది అనే పూర్తి సమాచారాన్ని ఇచ్చే పత్రాన్ని అడంగల్ లేదా పహాని పత్రం అని పిలుస్తారు.
అడంగల్ లేదా పహాని లో ఏమేం వివరాలు ఉంటాయి
సాధారణంగా భూమికి సంబంధించిన అసలైన పట్టాదారుడు ఎవరు ప్రస్తుతం భూమి ఎవరు అనుభవిస్తున్నారు వంటి వివరాలు ఉంటాయి దీంతోపాటు ఆ సర్వే నెంబర్లు మొత్తం ఎంత భూమి ఉంది అందులో మెట్ట భూమి ఉందా లేదా మాగాణి ఉందా… లాంటి వివరాలను తెలియజేస్తారు. అలాగే ఆ భూమిలో ఏ తరహా పంటలు పండిస్తున్నారు. దీంతోపాటు పంట సాగుకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది. మట్టి ఏ రకం వాటి వివరాలు కూడా ఉంటాయి. ఈ పట్టణంలో భూమికి సంబంధించిన సమాచారం ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తారు.
అడంగల్ లేదా పహాణి దేనికి అవసరం
సాధారణంగా సదరు భూమి తామే స్వయంగా సాగు చేస్తున్నట్లు చట్టబద్ధంగా నిరూపించడానికి ఈ పత్రం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలను పొందాలంటే ఆ భూమిలో ఏ పంట వేశారో తెలియజేసేందుకు అడంగల్ లేదా పహాణి కాపీని జత చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువుల సబ్సిడీ రైతు భరోసా వంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందాలంటే కూడా అడంగల్ లేదా పహాణి రికార్డులో రైతు పేరు నమోదయి ఉండాలి. ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టపరిహారం లేదా బీమా పొందేందుకు కూడా అడంగల్ లేదా పహాణి అనేది తప్పనిసరి. అలాగే భూములను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు అడంగల్ లేదా పహాని కాపీని చూసి కొనుగోలు చేస్తారు. తెలంగాణలో భూభారతి యాప్ ద్వారా ఈ అడంగల్ లేదా పహాని వివరాలను పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ ద్వారా ఈ వివరాలను పొందే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అడంగల్ లేదా పహాని అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి యాజమాన్య హక్కు అనుకుంటే పొరపాటే. మీ వద్ద పహాని లేదా అడంగల్ పట్టా ఉంది అంటే ఆ భూమి మీది అని అర్థం కాదు. ఆ భూమికి యజమానిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే పట్టాదార్ పాస్ బుక్కు, వన్ బి, అలాగే రిజిస్ట్రేషన్ పత్రాలు అనేవి అత్యవసరం. అడంగల్ లేదా పహాని అనేది ఆ భూమి మీ స్వాధీనంలో ఉండి మీరు అందులో ఏం సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఉపయోగించే ఒక ప్రాథమిక ఆధారం మాత్రమే అని గుర్తించాలి.
పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..?