IRCTC New Website: రైలు టికెట్ బుకింగ్ మరింత సులభం.. అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లకు ఇక గుడ్‌బై..
IRCTC New Website: రైలు టికెట్ బుకింగ్ మరింత సులభం.. అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లకు ఇక గుడ్‌బై..
IRCTC New Website: సాధారణంగా రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులకు అనవసర క్యాప్చాలు (Captchas), పదేపదే వచ్చే పాప్‌అప్‌లు (Pop-ups) చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. వీటి వల్ల టికెట్ బుకింగ్ ప్రాసెస్ చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి టికెట్ బుక్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు.. అయితే ఈ ఇబ్బందులకు త్వరలోనే పుల్ స్టాప్ పెట్టనుంది ఐఆర్సీటీసీ.
ప్రతి క్లాస్‌లో సీట్ల లభ్యత తెలుసుకోవడానికి ఇకపై పేజీలు మార్చాల్సిన ఇబ్బందులకు త్వరలోనే తెరపడనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సులభతరమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక కొత్త బీటా వెర్షన్ (Beta Version) ను ప్రయోగాత్మకంగా తీసుకురానున్నట్లు.. మరికొన్ని నెలల్లో దీనిని పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు.
కొన్ని వారాల క్రితం రాజస్థాన్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) కి చెందిన విద్యార్థులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఉన్నతాధికారులు సదరు విద్యార్థులతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై.. కొత్తగా రూపొందించిన బీటా వెర్షన్‌ను ప్రదర్శించారు. ఈ కొత్త వెబ్‌సైట్‌ను భారతీయ రైల్వేలలోని ప్రధాన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్‌తో నేరుగా అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త బీటా వెర్షన్‌లో తీసుకువచ్చిన కీలక మార్పులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
నో క్యాప్చా, నో పాప్‌అప్స్: ప్రయాణికుల సమయాన్ని వృథా చేసే అనవసర క్యాప్చాలు.. చికాకు పెట్టే పాప్‌అప్‌లు, వెబ్‌సైట్ వేగాన్ని తగ్గించే భారీ గ్రాఫిక్స్‌ను రానున్న కొత్త వెర్షన్‌లో పూర్తిగా తొలగించారు. దీనివల్ల వెబ్‌సైట్ అత్యంత వేగంగా లోడ్ అవుతుంది.టికెట్ కూడా త్వరగా బుకింగ్ అవుతంది.
ఒకే స్క్రీన్‌పై అన్ని వివరాలు: ఏ క్లాస్‌లో సీట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రతి క్లాస్‌ను విడివిడిగా తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా.. ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల (Sleeper, 3AC, 2AC మొదలైనవి) సీట్ల లభ్యత కనిపించేలా డిజైన్ చేశారు.
బుకింగ్ స్టెప్స్ తగ్గింపు: టికెట్ బుకింగ్ పూర్తి చేయడానికి అవసరమైన దశల (Steps) సంఖ్యను చాలా వరకు తగ్గించారు.
వివరాల ఆటో-సేవ్: తరచూ ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే (Save Passenger Details) అవకాశం కల్పించారు. దీనివల్ల ప్రతిసారీ పేర్లు, వయసు వంటి వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్‌లకు కీలకమైన బ్యాకెండ్ ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్ ను కూడా పూర్తిగా నూతన సాంకేతికతతో ఆధునికీకరిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థను త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రైల్‌వన్ (RailOne) యాప్‌ను ఇప్పటికే 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు డౌన్‌లోడ్ చేసుకున్నారని.. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన అన్ని ప్రధాన డిజిటల్ సేవలు ఈ సింగిల్ యాప్‌లోనే లభిస్తున్నాయని అధికారులు గుర్తుచేశారు.