Skip to content
Uncategorized వార్తలు

TGSRTC Recruitment 2026: టీజీఎస్‌ఆర్టీసీలో భారీ ఉద్యోగ నియామకాలు.. రాత పరీక్ష లేకుండా 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Prajapaksham 09 Jul 2026 1 నిమిషాల పఠనం Uncategorized
TGSRTC Recruitment 2026: టీజీఎస్‌ఆర్టీసీలో భారీ ఉద్యోగ నియామకాలు.. రాత పరీక్ష లేకుండా 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

TGSRTC Recruitment 2026: టీజీఎస్‌ఆర్టీసీలో భారీ నియామకాలు.. రాత పరీక్ష లేకుండా 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

TGSRTC Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్తను అందించింది. పరీక్ష లేకుండానే 1,500 పర్మినెంట్ కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీని పరీక్ష లేకుండానే కొన్ని అర్హతల ద్వారా భర్తీ చేయనుంది.

ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టబోతోంది. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటేే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పర్మినెంట్ (శాశ్వత) ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం ఇదే మొదటిసారి.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఊరటనిచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ కండక్టర్ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ సంస్థ నిర్వహించడం లేదు. ఉద్యోగాల కోసం కేవలం టెన్త్ క్లాస్ (SSC) లో సాధించిన మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను సిద్ధం చేసి నేరుగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఎలాంటి పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా.. కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే సువర్ణావకాశం కావడంతో నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ఆర్టీసీలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ కావడంతో కండక్టర్ల ఖాళీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే బస్సులను నడిపించాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా 1,500 మంది ప్రభుత్వ కండక్టర్ ఉద్యోగుల భర్తీకి అనుమతి రావడంతో అటు సంస్థకు స్థిరత్వం చేకూరడంతో పాటు ఆర్టీసీ సేవల రూపురేఖలు మారనున్నాయి.

అయితే అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఒక చిన్న సాంకేతిక సమస్య ఎదురైంది. గతంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జీపీఏ (GPA) గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మళ్లీ ఇటీవల పాత మార్కుల విధానాన్ని కొనసాగిస్తోంది. దీనివల్ల అప్లై చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి కేవలం గ్రేడింగ్ మాత్రమే సర్టిఫికేట్లలో ఉన్నాయి.

దీంతో జీపీఏ గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి.. ఇరు విధానాల అభ్యర్థులను సమానంగా ఎలా అంచనా వేయాలనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు లేఖ రాశారు. బోర్డు నుంచి ఈ మార్గదర్శకాలు (Guidelines) అందిన వెంటనే కండక్టర్ ఉద్యోగాల అధికారిక నోటిఫికేషన్ లింక్ లైవ్ లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *