Skip to content
ప్రపంచం వార్తలు

Emmanuel Macron Safe: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌‌కు తప్పిన ప్రమాదం.. బాంబు పేలుళ్ల మధ్య సిరియా అధ్యక్షుడుతో భేటీ..

Prajapaksham 08 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Emmanuel Macron Safe: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌‌కు తప్పిన ప్రమాదం.. బాంబు పేలుళ్ల మధ్య సిరియా అధ్యక్షుడుతో భేటీ..

Emmanuel Macron Safe: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తప్పిన పెను ప్రమాదం.. బాంబు పేలుళ్ల మధ్య సిరియా అధ్యక్షుడుతో భేటీ..

Emmanuel Macron Safe: సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఘోర ప్రమాదం తప్పింది. రాజధాని డమస్కస్‌లో ఆయన బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలో వరుసగా రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది గాయపడగా.. వారిలో నలుగురు స్థానిక పోలీసులు ఉన్నట్లు సిరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అయితే ఈ ప్రమాదం నుండి మాక్రాన్ సురక్షితంగా బయటపడ్డారు.

రాయిటర్స్, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మాక్రాన్ తన ప్రతినిధుల బృందంతో కలిసి డమస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం ఆయన హోటల్ నుండి కాన్వాయ్‌లో అధ్యక్ష భవనానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ పేలుళ్లు జరిగాయి. ఒక బాంబును రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీలో, మరొకదానిని పార్క్ చేసిన కారులో అమర్చినట్లు సిరియా భద్రతా వర్గాలు గుర్తించాయి. పేలుడు ధాటికి సంఘటనా స్థలంలో వాహనాలు తగలబడి దట్టమైన పొగలు అలుముకున్నాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంత రహదారులను మూసివేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్లు జరిగిన సమయంలో మాక్రాన్ తన కాన్వాయ్‌లో వేరే మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఆయనకు ఆ శబ్దం కూడా వినబడలేదు.

ఈ ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ మాక్రాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు. గతంలో బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత.. ఒక యూరోపియన్ యూనియన్ దేశాధినేత సిరియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా ఇరు దేశాలు తిరిగి రాయబారులను నియమించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. గతంలో సిరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయడానికి పాశ్చాత్య దేశాలను ఒప్పించడంలో మాక్రాన్ కీలక పాత్ర పోషించారు.

అల్-షరా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దేశంలో భద్రతాపరమైన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ తాజా దాడులు నిరూపిస్తున్నాయి. ఈ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. తాము ప్రమాదాల పట్ల అప్రమత్తంగానే ఉన్నామని, సిరియా ప్రజల సార్వభౌమత్వ, సురక్షిత ఆకాంక్షలను ఏ శక్తులు అణచివేయలేవని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా అధికారికంగా బాధ్యత వహించలేదు. దీనిపై సిరియా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *