Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Sugali Preeti Case: నా బిడ్డ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారు.. పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు ఫిర్యాదు..

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Sugali Preeti Case: నా బిడ్డ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారు.. పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు ఫిర్యాదు..

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు ఫిర్యాదు..

Sugali Preeti Case: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కుమార్తె మరణాన్ని పవన్ కల్యాణ్ పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని.. అధికారంలోకి వచ్చాక తమకు తీవ్ర నమ్మక ద్రోహం చేశారని ఆమె బహిరంగంగా ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌పై చీటింగ్, నమ్మకద్రోహం, నిందితులతో కుమ్మక్కవడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను చేసే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ ఫైలు పైనే ఉంటుందని ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పూర్తిగా మాట మార్చారని పార్వతీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు, డీఎన్‌ఏ లభించలేదంటూ నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చేలా పవన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. జనసేన పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి తనపై భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

కాగా 2017లో కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ స్కూల్ కరెస్పాండెంట్ కుమారులే తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై చంపేశారని నాటి నుంచి తల్లిదండ్రులు సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వీరికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించి, అండగా ఉంటానని నమ్మబలికారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ కీలకమైన ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగకపోగా, నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే మనస్తాపంతో పార్వతీ దేవి ఏకంగా డిప్యూటీ సీఎంపైనే చట్టపరమైన చర్యల కోసం పోలీసులను ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *