Skip to content
జాతీయం వార్తలు

Illicit Relationships: వివాహితుల అక్రమ సంబంధాలకు గోప్యత హక్కు వర్తించదు.. ప్రైవసీ పేరుతో సమర్థించలేమని తెలిపిన సుప్రీంకోర్టు..

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Illicit Relationships: వివాహితుల అక్రమ సంబంధాలకు గోప్యత హక్కు వర్తించదు.. ప్రైవసీ పేరుతో సమర్థించలేమని తెలిపిన సుప్రీంకోర్టు..

వివాహితుల అక్రమ సంబంధాలకు గోప్యత హక్కు వర్తించదు

Illicit Relationships: పైళ్లైన దంపతుల విడాకుల మంజూరుకు వ్యభిచారం (వివాహేతర సంబంధం) ఒక స్పష్టమైన, బలమైన కారణంగా హిందూ వివాహ చట్టం గుర్తిస్తుందన్న దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) పూర్తిగా సమర్థించింది. వివాహ బంధంలో ఉంటూనే వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకు గోప్యతా హక్కు (Right to Privacy) ప్రాతిపదికన న్యాయస్థానం అండగా నిలవడం ఏమాత్రం ప్రజాప్రయోజనం కాదని జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

భర్త అక్రమ సంబంధాన్ని నిరూపించడానికి అతను మరొక మహిళతో కలిసి హోటల్‌లో గడిపిన ఆధారాలు, ఫోన్‌ కాల్‌ రికార్డుల సమాచారం తదితరాలను సేకరించేందుకు భార్య న్యాయస్థానం సహాయాన్ని కోరవచ్చన్న దిల్లీ హైకోర్టు నిర్ణయంతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ విషయంలో భర్త లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అతను దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

అక్రమ సంబంధం నెరుపుతున్న వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యత హక్కు ద్వారా ఎలాంటి రక్షణ లభించదని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది సంపూర్ణమైనది (Absolute) కాదని.. దానికి చట్టపరమైన, సహేతుకమైన పరిమితులు ఉంటాయని పేర్కొంది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు గాను.. 2021 ఏప్రిల్‌ 29 నుంచి మే 1 వరకు అతను బసచేసిన ఒక హోటల్‌ గది రిజర్వేషన్, బిల్లు చెల్లింపుల వివరాలను తెప్పించాలని కోరుతూ భార్య కుటుంబ న్యాయస్థానాన్ని (ఫ్యామిలీ కోర్టు) ఆశ్రయించారు. భార్య అభ్యర్థనను మన్నిస్తూ ఆ వివరాలను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందించాలన్న కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను భర్త హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే, భర్తపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారించుకుని, కేసును పారదర్శకంగా పరిష్కరించడానికే కుటుంబ న్యాయస్థానం ఆ ఆధారాలను కోరిందని హైకోర్టు పేర్కొనగా.. తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థిస్తూ భర్తకు గట్టి షాక్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *