క్షణాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు.. వణికిపోయిన వెనెజువెలా.. కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు..
Powerful Earthquake Hits Venezuela, Buildings Sway in Capital
వెనెజువెలా, జపాన్ దేశాలను కొన్ని గంటల వ్యవధిలోనే శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో క్షణాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కరాకస్‌లోని బహుళ అంతస్తుల భవనాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో, ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. వెనెజువెలాలో సంభవించిన తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా, ఆ వెంటనే వచ్చిన రెండో భూకంపం అంతకంటే ఎక్కువ తీవ్రతతో 7.5గా నమోదైంది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో ఈ తొలి భూకంప కేంద్రాన్ని (ఎపిసెంటర్) గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ జంట భూకంపాల ధాటికి రాజధాని కరాకస్‌లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సముద్ర ఉప్పెన లేదా సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు ప్రాథమిక హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, వెనెజువెలాను వణికించిన కొద్దిసేపటికే అటు ఆసియా ఖండంలోని జపాన్ను కూడా బలమైన భూకంపం తాకింది. జపాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. హొన్షు ఐలాండ్‌లోని ఐవాటె ప్రిఫెక్చర్ సమీపంలో, భూగర్భంలో దాదాపు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం నుంచి వందల కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.
ముందుజాగ్రత్త చర్యగా జపాన్ అధికారులు ప్రసిద్ధ షింకాసెన్ బుల్లెట్ ట్రైన్ సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేశారు. అయితే, జపాన్‌లో ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అక్కడ జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఖండాల్లో వెంటవెంటనే సంభవించిన ఈ భారీ భూకంపాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.