ఆరోగ్యానికి యోగాభ్యాసనం
Practicing Yoga for Better Health and Balanced Living
యోగాసనాలు, ప్రాణాయామము, సూర్య నమస్కారములు మనలను దృఢంగా, ఆరోగ్యంగా, మేధోవంతులుగా చేస్తాయి. యోగాసనాలను సాధన చేసే వ్యక్తులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారనడంలో సందేహం లేదు. ‘చిత్తవృత్తులను నిరోధించి మనసును శాంతంగా ఉంచేందుకు యోగశాస్త్రాన్ని, అర్థవంతమైన భావ ప్రకటనకు వ్యాకరణాన్ని, శరీరంలోని రోగాలను నయం చేయడానికి వైద్య శాస్త్రాన్ని ప్రపంచ మానవాళికి బహుమతిగా అందించినటువంటి, ప్రాచీన మహార్షులలో ప్రసిద్ధి పొందిన పతంజలి మహర్షి గొప్ప యోగ గురువు గా చెప్పుకోవాలి. ‘యోగము’ అనగా సంస్కృతం లో ఐక్యత లేక విలీనం అని అర్థం. యోగాభ్యాసం యొక్క లక్ష్యం శరీరానికి, మనస్సుకు, శ్వాసకు సమతుల్యం సాధించడం. దీని అంతిమ లక్ష్యం, ఆత్మసాక్షాత్కారం పొందడమే. యోగ శాస్త్రం 5 వేల ఏండ్లకన్నా పురాతనమైనదని పండితుల అభిప్రాయం. యోగ శాస్త్రం ఆరోగ్యకరమైన జీవనానికి చాలా ఉపయోగపడుతుందనీ, ఇది చాలా అభివృద్ధి చెందిందనీ, శాస్త్రీయమైనదనీ చాలామంది యోగశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ శాస్త్రం శతాబ్దాల తరబడి అధ్యయనం చేయబడి పరిపూర్ణత్వాన్ని పొందినది.
యోగ శాస్త్ర విధానాలు – పద్ధతులు
యోగ శాస్త్రం ఆవిర్భవించినప్పటి నుండి, గత కొన్ని శతాబ్దాలుగా వివిధ రకాలైన యోగభ్యాసా లు, పద్ధతులు ప్రపంచంలో వృద్ధి చెందాయి. అష్టాంగ యోగము, హఠయోగము, కుండలినీ యోగము, రాజయోగము, కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, తంత్ర యోగము, మంత్ర యోగము వీటిలో కొన్ని విధానాలు. వీటి లో ప్రతి ఒక్కదానికి ఒక ప్రయోజనం ఉన్నదని యోగాభ్యాస అధ్యాపకులు చెపుతున్నారు.
మన శరీరంలోని శక్తిని తెలివైన పద్ధతిలో నియంత్రించడమే యోగాభ్యాసం యొక్క ఉపయోగాలను పూర్తిగా పొందడంలోని రహస్యం. మన మనసును నియంత్రించడం ద్వారా మన ప్రవర్తన ను సాధించాల్సి ఉంటుంది. ఇది మన ప్రవర్తనలోను, సామాజిక పరిచయాలలోనూ, ఇంద్రియ సంబంధిత అనుభవాలలోనూ, తెలివితేటలలో నూ, సానుకూల దృక్పథంలోను మార్పులు తీసుకొస్తుంది.
ప్రస్తుత కాలంలో యోగాభ్యాసము ప్రపంచం నలుమూల ప్రసిద్ధి పొందింది. అనారోగ్యం వలన, ఉద్రిక్తత వల న, ఒత్తిడి వలన వచ్చే సమస్యలను అధిగమించడానికి, దానికి కావలసిన శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి పనికి వచ్చే పద్ధతులు మనకు యోగ శాస్త్రంలో లభిస్తాయి. యోగాభ్యాసం చేసే మహర్షులు..యోగాసనాలపై లోతు గా విశ్లేషించిన వాళ్లు చెప్పుతున్న దాన్నిబట్టి
- శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసే 200 పైచిలుకు ఆసనాలు, భంగిమలు, శ్వాసక్రియలు హఠయోగంలో పేర్కొనబడినవని, యోగశాస్త్రం ప్రకా రం మానవ జీవితానికి ముఖ్యమైన శక్తి లేక ప్రాణం శ్వాస కాబట్టి ఈ శ్వాస క్రియను నియంత్రించే ప్రక్రియైన ప్రాణాయామంను హఠయోగం లో ఎక్కువగా వాడుతారని వివరించుతున్నారు.
- యోగాసనాలు ఒక రకమైన వ్యాయామం కింద తరచూ భావించబడుతున్నాయి. యోగాసనాలు వ్యాయామం కాదు. అవి అవగాహన, విశ్రాంతి, ఏకాగ్రత, ప్రేరణ, ధ్యానం మొదలైన వాటిని నేర్చుకోవడానికి మన శరీరాన్ని తయారు చేసే పద్ధతులు. కనుక శరీరం, మనస్సు రెండింటినీ మేళవించి యోగసాధన చేయాలని వివరించుతున్నారు.
- పతంజలి మహర్షి వ్రాసిన ‘యోగ సూత్రాల’లో వివరించిన మాదిరిగా యోగ శాస్త్రం మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం ప్రాథమిక సూత్రాలు, ఆచరణలతో కూడిన 8 భాగాలుగా విభజించబడింది. మొదటి నాలుగు అంగా లు శరీరాన్ని, మనసును ఒకే త్రాటిపైకి తెచ్చేందుకు కావలసిన మానసిక, శారీరక అభ్యాసాలతో కూడిన బాహ్య ప్రక్షాళన గురించి విశదీకరిస్తాయి. మిగిలిన నాలుగు అంగా లు ధ్యానం యొక్క వివిధ దశలను విపులీకరిస్తాయి. ‘అంతర్జాతీయ యోగా దినం’ ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమితి 2014 అక్టోబర్ 14న 177 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి.
యోగా ప్రాచీన కళ ః 5000 సంవత్సరాల నుండి వస్తున్న యోగాకళను ప్రపంచానికి చికాగో నగరంలో 1893లో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశం నుండి పాల్గొన్న స్వామి వివేకానందుడు పరిచయం చేశాడు. అప్పటి నుండి ప్రపంచ దేశాలు యోగాభ్యాసాన్ని పాటిస్తూ, లక్షల మంది ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. 2015లో ప్రారంభమైన యోగా దినోత్సవాల ద్వారా ప్రపంచ ప్రజలు యోగాను పాటించి లాభం పొందుతున్నారు. భారతీయ సంస్కృతిలో యోగాను భాగం చేసిన ఘనత ‘యోగా ఆధునిక పితామహుడు’ ‘పతంజలి’కే దక్కింది. పతంజలి రూపొందించిన యోగ శాస్త్రం 196 యోగ సూత్రా ల ద్వారా మానవాళి ఆరోగ్యం సంరక్షణలో ఎంతగానో దోహదపడుతుంది. అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ప్రజలలో యోగా పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యకర సమాజ స్థాపన, మానసిక ప్రశాంతత, శారీరక మానసిక వికాసాని కి ఊతమివ్వడం, స్వయం నియంత్రణతో సాఫీగా సాగడం లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. రచయిత- ఉజ్జిని రత్నాకర్ రావు