ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు నిజమైన గుర్తింపు ,ఆర్థిక స్వాతంత్ర్యం: సీఎం రేవంత్ రెడ్డి
Can Anyone Remain in Power if They Mess With Women? – CM Revanth Reddy
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ,గౌరవం ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ ‘మహిళాశక్తి’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు (SHG) చెందిన మహిళల జీవనోపాధి కోసం 553 ఆర్టీసీ బస్సులను ఆయన అధికారికంగా పంపిణీ చేశారు.
ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు నిజమైన గుర్తింపు ,ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుందని నొక్కి చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 4,000 కోట్ల సున్నా వడ్డీ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందని, మహిళల ఆగ్రహానికి గురైనందుకే ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కోసం ఆర్టీసీకి రూ. 10,500 కోట్లు సకాలంలో చెల్లించిందని వివరించారు.
వ్యవసాయ రంగానికి ఆడబిడ్డలే ప్రాణవాయువు లాంటి వారని, ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడే గొప్ప సంస్కృతి మనదని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని, ఆమెను స్ఫూర్తిగా తీసుకునే తాము రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావడానికి వందల ఏళ్లు పట్టిందని, కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మహిళలకు సమానంగా ఓటు హక్కు కల్పించిన ఘనత జవహర్‌లాల్ నెహ్రూదేనని గుర్తుచేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రాజీవ్‌గాంధీ రిజర్వేషన్లు తీసుకువచ్చారని, 2013 లోనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును సోనియా గాంధీ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తన సుదీర్ఘ చరిత్రలో ఒక్కసారైనా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించిందా అని ప్రశ్నించారు. అలాగే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు క్యాబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఎన్నడూ కట్టుకోలేదని, కానీ తమ ప్రభుత్వం నాణ్యతతో అందించిన చీరలను ధరించే మహిళలు ఈ రోజు ఈ సభకు భారీగా తరలివచ్చారని అన్నారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే ఆడపిల్లల డ్రాప్‌అవుట్స్ (బడి మానేసే వారి సంఖ్య) గణనీయంగా తగ్గాయని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు పోటీగా పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. మహిళా సంఘాల కార్యకలాపాల కోసం హైటెక్ సిటీ పక్కనే రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ‘మహిళా శక్తి భవనాలను’ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మహిళల చేతుల్లోనే ఉందన్న ఆయన, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు తాము విశ్రమించబోమని, ప్రజల ఆశీర్వాదంతో 2034 వరకు ఈ ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.