మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Fire (rep Image)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
మృతులను చంద్రమ్మ (50), లక్ష్మణ్ (17), ప్రణతి (14)లుగా పోలీసులు గుర్తించారు. గాంధీనగర్‌లోని ఒక ఇంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా మంటలు దట్టంగా వ్యాపించాయి. లోపల ఉన్నవారు ప్రాణభయంతో కేకలు వేయడంతో, గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
అయితే, స్థానికులు మంటలను అదుపు చేసే లోపే, ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్ తీవ్రమైన వేడికి గురై భారీ శబ్దంతో పేలిపోయింది. సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగి, ఇల్లంతా అగ్నిగుండంగా మారింది. ఈ ధాటికి లోపల ఉన్న చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతిలు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో తక్షణమే అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, సిబ్బంది జాగ్రత్తగా లోపలికి వెళ్లి పూర్తిగా కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను బయటకు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా విగతజీవులుగా మారడంతో స్థానికంగా తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.