Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బీజేపీ చెల్లని కాసు అవుతోందా..? బీఆర్ఎస్ తో దోస్తీ తప్పదా..?

Prajapaksham 29 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో బీజేపీ చెల్లని కాసు అవుతోందా..? బీఆర్ఎస్ తో దోస్తీ తప్పదా..?

తెలంగాణలో బీజేపీ చెల్లని కాసు అవుతోందా..? బీఆర్ఎస్ తో దోస్తీ తప్పదా..?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు పీఠాన్ని దక్కించుకోవాలని కమలదళం ఆశలు పెట్టుకుంది. అయితే, మారిన సమీకరణాలు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ వ్యూహాలు తలకిందులవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పార్లమెంట్ విజయాల నుంచి డిపాజిట్ దక్కని స్థితికి…

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది సీట్లతో బీజేపీ చక్కటి ఓటు శాతం సాధించినప్పటికీ కూడా, గడచిన రెండున్నర సంవత్సరాలుగా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ఎదగడం లేదు అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అలాగే పార్టీలో 8 మంది ఎంపీలు తలా ఒక దారి అన్న రీతిన వర్గపోరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు కూడా పార్టీ ఇమేజ్ ని పెద్ద ఎత్తున డ్యామేజీ చేసిందని చెప్పవచ్చు.

ఎదుగుదలకు వరుస బ్రేకులు…

దీనికి తోడు ప్రస్తుతం ‘జెన్ జీ’ ఉద్యమం కూడా బీజేపీ ఎదుగుదలను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, పెట్రోల్లో ఇథనాల్ కలపడం వంటి అంశాలపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2028లో అధికారంలోకి రావాలని బీజేపీ కంటున్న కలలకు బ్రేక్ పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నాయకత్వ లోపం – క్యాడర్‌లో నిరాశ:

బీజేపీ రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ప్రయాణం కొనసాగుతోంది. కొత్త ఇన్చార్జ్ అజయ్ సింగ్ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చదువుకున్నవాడు, విద్యాధికుడు అయినప్పటికీ… ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో క్యాడర్ కూడా తీవ్ర నిరాశలో ఉంది అని చెప్పవచ్చు.

బీఆర్ఎస్‌తో పొత్తు తప్పదా..?

అయితే బీజేపీ ముందు మరో ఆప్షన్ కూడా కనిపిస్తోందని, అదే బీఆర్ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లడం అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత రాష్ట్ర సమితి కూడా బీజేపీతో జత కడుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది అని చెప్పవచ్చు.

ఏది ఏమైనా, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పక్కనపెట్టి కేవలం గాలివాటం రాజకీయాలను నమ్ముకుంటే బీజేపీకి తెలంగాణలో మిగిలేది భంగపాటే. అంతర్గత వర్గపోరుకు స్వస్తి చెప్పి, పటిష్టమైన నాయకత్వంతో ప్రజల్లోకి వెళ్తేనే కమలదళం నిలదొక్కుకోగలదు. లేదంటే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రాపకం కోరక తప్పని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ట్యాగ్‌లు: BJP BRS Telangana