Skip to content
తెలంగాణ వార్తలు

ఈ నెల 16 నుంచి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ముహూర్తం

Prajapaksham 03 Aug 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
ఈ నెల 16 నుంచి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ముహూర్తం

pensions

25 వేలకుపైగా కొత్త దరఖాస్తులు.. కేటాయించే యూనిట్లు ఎన్నో?
1,44,773 మంది ప్రస్తుతం లబ్ధిదారులు
పెండింగ్‌లో 3,320 దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదల కళ్లలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించడమే కాకుండా, ఈ మేరకు నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో జిల్లా పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన, దరఖాస్తుల క్రోడీకరణ పనుల్లో వేగం పెంచింది.

అయితే, జిల్లాలో కొన్నేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో దరఖాస్తుదారుల సంఖ్య కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేయబోయే కోటా ఎంత? అందులో తమకు అవకాశం దక్కుతుందో లేదో అనే తీవ్ర ఉత్కంఠ, ఆందోళన ప్రతి ఒక్క ఆశావహుడిలో నెలకొంది. జిల్లా అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం నిర్మల్ జిల్లా పరిధిలో మొత్తం 1,44,773 మంది సామాజిక భద్రత (చేయూత/ఆసరా) పింఛన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

వివిధ కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికుల పింఛన్లు 61,933 మందికి, వితంతు పింఛన్లు 35,664 మందికి, వృద్ధాప్య పింఛన్లు 33,890 మందికి అందుతున్నాయి. వీరితో పాటు దివ్యాంగుల పింఛన్లు 9,822 మందికి, ఒంటరి మహిళల పింఛన్లు 2,093 మందికి, గీత కార్మికుల పింఛన్లు 266 మందికి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. అదనంగా ఫైలేరియా బాధితులు 221 మందికి, డయాలసిస్ రోగులు 110 మందికి కూడా ప్రతి నెలా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.

323 అక్రమ పింఛన్ల తొలగింపు.. 26 వేలకు పైగా దరఖాస్తులు
ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత లబ్ధిదారులకు తోడు, కొత్త పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా అర్జీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. 2019 నుంచి ఆసరా ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్త దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన సభల్లో వచ్చిన 26 వేలకుపైగా దరఖాస్తులతో పాటు, అధికారుల పరిశీలన పూర్తై సిఫార్సు చేసిన 3,320 దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు మంత్రి యాప్ ద్వారా లైవ్ అథెంటికేషన్ నిర్వహించి జిల్లాలో అక్రమంగా పింఛన్ పొందుతున్న 323 మంది అనర్హులను అధికారులు జాబితా నుంచి తొలగించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల సంయుక్త ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టి వడపోత ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

యూనిట్లు తక్కువ.. అర్హులు ఎక్కువ!
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సుమారు 2 లక్షల చేయూత పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. అలాగే లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారిని తొలగించి, ఆ స్థానాల్లో కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ 2 లక్షల పింఛన్లలో జిల్లా వారీగా ఎంత కోటా కేటాయించారనే వివరాలు, ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే జిల్లాకు వచ్చే యూనిట్లు చాలా పరిమితంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి కోటా కేటాయింపులు, అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాతే జిల్లాలో ఎంతమందికి కొత్తగా పింఛన్ భాగ్యం దక్కుతుందనే విషయంపై స్పష్టత రానుంది.