Skip to content
జాతీయం › వార్తలు

ట్రంప్‌ కేంద్రకంగా అమెరికా మధ్యంతర ఎన్నికలు

Prajapaksham 14 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ట్రంప్‌ కేంద్రకంగా అమెరికా మధ్యంతర ఎన్నికలు

Modi

అశోక్ నీలకంఠన్ అయర్స్

అమెరికాలో నవంబర్‌ 3న జరగబోయే మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌పై నియంత్రణ కోసం జరుగుతున్న ఈ పోటీని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధ్యక్ష పదవిపై వ్యక్తిగత ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం)గా మారుస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై తన పేరే ఉన్నట్లుగా భావించి ఓటు వేయాలని ఆయన అమెరికన్‌లను కోరుతున్నారు.
రిపబ్లికన్‌లు దీనిపై చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఉభయ సభల నియంత్రణ ఆ పార్టీ చేతిలోనే ఉన్నప్పటికీ, డెమోక్రాట్లు ప్రతినిధుల సభ (హౌస్‌) కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. సెనేట్‌లో కూడా తమకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పోలింగ్‌ ప్రకారం, జాతీయ ప్రతినిధుల సభ ప్రాధాన్యతలో డెమోక్రాట్లకు ఆధిక్యం ఉందని, సెనేట్‌లోని పలు కీలక స్థానాల్లో గట్టి పోటీ ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ, తుది ఫలితం ఓటింగ్‌ శాతం, వ్యక్తిగత పోటీలపై ఆధారపడి ఉంటుంది.
పందెం ఏమిటో ట్రంప్‌కు తెలుసు. డెమోక్రాట్ల ఆధీనంలోని ప్రతినిధుల సభ లేదా డెమోక్రాట్ల నియంత్రణలో ఉన్న కాంగ్రెస్‌, ఆయన అధ్యక్ష పదవిలోని చివరి రెండేళ్లను నాటకీయంగా మార్చేస్తుంది. ఇది కాంగ్రెస్‌ నిఘాను పెంచడం ద్వారా ఆయన శాసనపరమైన అజెండాను ముందుకు తీసుకెళ్లడాన్ని
గణనీయంగా కష్టతరం చేస్తుంది.
ఆయన స్పందన అసాధారణంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన పోరాటాలు, ఓటింగ్‌ నియమాలను మార్చే ప్రయత్నాలు, ఓటర్ల జాబితాలపై ఫెడరల్‌ దర్యాప్తులు, ప్రభుత్వ నిధులతో ప్రకటనలు, ఎంపిక చేసిన అమెరికన్లకు ప్రత్యక్ష చెల్లింపులు, అన్నింటికన్నా నాటకీయంగా రిపబ్లికన్‌లు ఉభయ సభలను నిలబెట్టుకుంటే వయోజన అమెరికన్లకు ‘ట్రంప్‌ డివిడెండ్‌’ పేరిట $5,000 ఇస్తామన్న వాగ్దానం. ఈ $5,000 ప్రతిపాదన అన్నింటికంటే సాహసోపేతమైనది కావచ్చు. డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్‌ మధ్యంతర ఎన్నికల సమావేశం లో, రిపబ్లికన్‌లు ప్రతినిధుల సభ, సెనేట్‌ను గెలిస్తే ప్రతి వయోజన పౌరుడికి $5,000 అందుతాయని ట్రంప్‌ వాగ్దానం చేశారు. సుంకాల రాబడితో ఈ చెల్లింపులకు నిధులు సమకూర్చవచ్చని ఆయన సూచించారు. అయితే, ఈ లెక్కలు చాలా కఠినమైనవి. సుమారు 24 కోట్లమంది వయోజన పౌరులు ఉన్నందున, ఈ కార్యక్రమానికి దాదాపు $1.2 ట్రిలియన్ల ఖర్చవుతుంది. ఇది ప్రస్తుత సుంకాల వసూళ్ల కంటే చాలా ఎక్కువ. దీనికి కాంగ్రెస్‌ ఆమోదం కూడా అవసరం. ట్రంప్‌ దీనిని ప్రచార చెల్లింపుగా కాకుండా డివిడెండ్‌గా పేర్కొన్నారు. చట్టపరంగా ఈ వ్యత్యాసానికి ప్రాముఖ్యత ఉంది.
ఓటు వేయడానికి ప్రజలకు డబ్బు చెల్లించడం లేదా ఒకే తరహా ఓటింగ్‌కు ప్రేరేపించడం ఫెడరల్‌ చట్టం ప్రకారం నిషిద్ధం. అయితే, ట్రంప్‌ ప్రతిపాదనను ఓట్ల కొనుగోలుతో సమానంగా చూడలేమని పలు వార్తా సంస్థల అడిగిన ప్రశ్నకు న్యాయ పండితులు జవాబుగా చెబుతున్నారు. ఎందుకంటే, రిపబ్లికన్‌లకు, డెమోక్రాట్లకు ఓటు వేసినా లేదా అసలు ఓటు వేయకపోయినా, అర్హులైన వయోజనులందరికీ వాగ్దానం చేసిన చెల్లింపు అందుతుంది. అంతేకాకుండా, పన్నుల తగ్గింపు వంటి విస్తృత రాజకీయ వాగ్దానాలకు, ప్రత్యక్ష ఓటు కొనుగోలుకు మధ్య సుప్రీంకోర్టు కూడా తేడాను స్పష్టం చేసింది. అంతమాత్రాన ఆ ప్రతిపాదన సాధారణమైనది కాదు. అది దానిని రాజకీయంగా, చట్టపరంగా అసాధారణమైనదిగా చేస్తుంది. పోలింగ్‌ కేంద్రంలో ఒక ఓటరుకు $5,000 అందజేస్తున్నారా అన్న దానికంటే, అధ్యక్షుడు తన పార్టీ ఎన్నికల విజయానికి దేశవ్యాప్త ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్దేశపూర్వకంగా ముడిపెడుతున్నారా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. విమర్శకులు ఈ ప్రతిపాదనను లంచంగా అభివర్ణించగా, ట్రంప్‌, ఆయన మిత్రులు దీనిని తమ ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా లభించే డివిడెంట్‌ (ప్రయోజనంగా)అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్‌ దీనిని అమలు చేసే చట్టాన్ని వాస్తవంగా పరిశీలించేంత వరకు ఈ వాగ్దానం వివాదాస్పదంగానే మిగిలిపోతుంది.
ప్రభుత్వం ఇప్పటికే ఇతర మార్గాల్లో నిధులను మళ్లించింది. దాదాపు పది లక్షల మంది అమెరికన్‌లు అఫార్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ కింద $500 రిబేట్‌ చెక్కులను అందుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో, 2 కోట్ల మందికి పైగా మెడికేర్‌ లబ్ధిదారులకు సుమారు $90 చెల్లించే ప్రణాళికలను ట్రంప్‌ ప్రకటించారు. ఎన్నికలకు ఇంత దగ్గరగా ఈ చెల్లింపులు చేయడంపై విమర్శకులు ప్రశ్నించగా, ప్రభుత్వం వీటిని చట్టబద్ధమైన ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వాపసులుగా అభివర్ణిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల డబ్బులో సుమారు $2 కోట్ల డాలర్లను హోం ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటనల కోసం ఖర్చు చేసింది. ఇది ప్రాథమికంగా రాజకీయ ప్రచారమేనని విమర్శకులు వాదిస్తున్నారు. వైట్‌ హౌస్‌ ఈ ప్రకటనలను ప్రజా సేవా ప్రకటనలు (పబ్లిక్‌ -సర్వీస్‌ అనౌన్స్‌మెంట్స్‌) అని పిలుస్తోంది.
ఇక నియోజకవర్గాల పునర్విభజన విషయానికి వస్తే, నవంబర్‌ ఎన్నికలకు ముందు అదనపు హౌస్‌ సీట్లను ఆశిస్తూ, రిపబ్లికన్‌ల నియంత్రణలో ఉన్న రాష్ట్రా ల్లో కాంగ్రెస్‌ నియోజకవర్గాల పటా(మ్యాప్‌)లను పునర్విభజిస్తూ ట్రంప్‌ దశాబ్దం మధ్యలో ఒక అసాధారణ ప్రచారాన్ని ప్రారంభించారు. సాధారణంగా ప్రతి పదేళ్ల కు ఒకసారి జరిగే జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కానీ ఇప్పుడు టెక్సాస్‌, ఫ్లోరిడా, నార్త్‌ కరోలినా, ఒహాయో, టెన్నెస్సీ తో సహా తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త మ్యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త పటాలలో చాలా వరకు రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్నాయి, అయినప్పటికీ ఫలితం ఏకరీతిగా లేదు. పునర్విభజన జరిగిన కొన్ని జిల్లాల్లో తీవ్రమైన పోటీ కొనసాగుతోంది.
డెమోక్రాట్లు తమ నియంత్రణలో ఉన్న రాష్ట్రాల్లో నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన ప్రయత్నాలపై ప్రతిస్పందించారు. ఓటింగ్‌ నిబంధనలపై పోరాటం కూడా అంతే తీవ్రంగా ఉంది. ట్రంప్‌ ప్రభు త్వం పౌరసత్వం, ఓటరు గుర్తింపునకు సంబంధించి కొత్త నిబంధనలను విధించడానికి ప్రయత్నించింది, మెయిల్‌ బ్యాలెట్లపై మరింత ఫెడరల్‌ నియంత్రణను కోరింది. పౌరసత్వ నిబంధనలలోని అంశాలతో సహా కీలకమైన నిబంధనలను న్యాయస్థానాలు నిరోధించాయి లేదా పరిమితం చేశాయి. మరోవైపు, ఈ ఎన్నికల కోసం పోస్టల్‌ సర్వీస్‌ ద్వారా కొత్త మెయిల్‌-బ్యాలెట్‌ నిబంధనలను విధించకుండా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడ్డుకుంది.
సెప్టెంబర్‌ చివరిలో నిర్వహించిన ఒక ఏపీ-నార్క్‌ (AP-NORC) పోల్‌లో, జీవన వ్యయాన్ని ట్రంప్‌ నిర్వహించిన తీరును కేవలం 17% మంది అమెరికన్‌లు మాత్రమే ఆమోదించగా, ఆయన ఆర్థిక నిర్వహణను 26% మంది ఆమోదించారు. ట్రంప్‌ విధానాలు నిరంతర ద్రవ్యోల్బణానికి దోహదపడ్డాయని సుమారు 65% మంది చెప్పారు.
నిరుద్యోగం సుమారు 4.2% వద్దే ఉందని, అయితే నియామకాలు మందగించాయని, ద్రవ్యోల్బణం కారణం గా వేతనాల పెరుగుదల క్షీణించిందని, వాస్తవ వినియోగ ఆదాయ వృద్ధి బలహీనంగా ఉందని రాయిటర్స్‌ సోమవారం నివేదించింది.
యువ అమెరికన్ల విషయానికొస్తే, ఈ సమీకరణం మరింత సంక్లిష్టంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, సాంకేతికత, ట్రంప్‌ విస్తృత రాజకీయ సందేశంపై ప్రత్యక్ష విజ్ఞప్తుల ద్వారా యువ ఓటర్లను రిపబ్లికన్‌ కూటమిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ యేల్‌ యూత్‌ పోల్‌, 35 ఏళ్లలోపు ఓటర్ల లో ట్రంప్‌పై గణనీయమైన వ్యతిరేకతను అంచనా వేసింది. వసంతకాలపు సర్వేలో 18- ఏళ్ల వయస్సు వారిలో 68%, 23- ఏళ్ల వయస్సు వారిలో 72% మంది ఈ
వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
కాబట్టి $5,000 డాలర్ల వాగ్దానం అనేది, సిద్ధాంతం కంటే ఆర్థిక ఆందోళనకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రాజకీయ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. అందుకే నవంబర్‌ ఎన్నికలు ట్రంప్‌ కంటే కూడా మరింత మౌలిక అంశంపై రిఫరెండంగా మారవచ్చు. ప్రభుత్వం వాగ్దానాలు తమ సొంత జీవితాలలో మెరుగుదలలుగా పరిణమిస్తున్నాయని ఓటర్లు విశ్వసిస్తున్నారా లేదా అనేది ఆ రిఫరెండం తేలుస్తుంది. ఈ ఎన్నికలను ట్రంప్‌ స్పష్టంగా వ్యక్తిగత పోటీ తరహాలోకి మార్చేశారు. రిపబ్లికన్‌ ఓటర్లు కాంగ్రెస్‌ ఎన్నికలను మరో అధ్యక్ష ఎన్నికల పోటీగా పరిగణించాలనేదే ఆయన సందేశం. మరోవైపు, డెమోక్రాట్లు ఇదే పరిస్థితిని ఆయనకు వ్యతిరేకంగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను, ఓటర్లు పరిపాలనను నియంత్రించగల సాధనంగా వారు చిత్రీకరిస్తున్నారు.
చివరిగా అడిగే ప్రశ్న చాలా పాతకాలం నాటిదిగా అనిపించవచ్చు. రాజకీయ ఆర్భాటం జీవన వ్యయాన్ని అధిగమించగలదా? నవంబర్‌ 3న అమెరికన్‌లు టెలివిజన్‌ ప్రకటనలు, అధ్యక్ష ఎన్నికల ర్యాలీలు లేదా ప్రచార వాగ్దానాలతో కాకుండా, బ్యాలెట్‌ పత్రాలతో సమాధానం ఇస్తారు. ట్రంప్‌ పదవీకాలంలోని చివరి రెండేళ్లు కాంగ్రెస్‌ సహకారంతో మొదలవుతాయా, లేక వైట్‌ హౌస్‌పై పెరుగుతున్న శక్తివంతమైన నియంత్రణ గా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుందా అనేది ఆ ఫలితమే నిర్ణయిస్తుంది.