Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
Rahul Gandhi: సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి..అప్రూవర్‌గా మారాలి : రాహుల్‌గాంధీ
Rahul Gandhi Petition:మంగళవారం ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్లలోని లోపాలను సరిచేస్తే విచారణకు జాబితా చేస్తామని తెలిపింది.
Rahul Gandhi Petition: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. పిటిషన్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించిన లోపాలను ఇంకా సరిదిద్దకపోవడమే ఇందుకు కారణం. మొత్తం 14 లోపాలను రిజిస్ట్రీ గుర్తించినట్లు కోర్టు వెబ్సైట్లో పేర్కొంది. ఈ లోపాలను సవరించిన తర్వాత పిటిషన్లను విచారణకు జాబితా చేస్తామని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్లో రూ.220 ఫీజు తక్కువ
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించిన లోపాల్లో కోర్టుకు చెల్లించాల్సిన రుసుము రూ.220 తక్కువగా ఉండటం కూడా ఉంది. తొమ్మిది మంది పిటిషనర్లకు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాలు సమర్పించకపోవడాన్ని రిజిస్ట్రీ గుర్తించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తింపు కార్డు నకలులో ఫొటో స్పష్టంగా లేకపోవడాన్ని కూడా లోపంగా పేర్కొంది.
దీనితో పాటు పిటిషన్‌కు జత చేసిన కొన్ని పత్రాలు చదవడానికి వీలులేకపోవడం, పేజీల నంబరింగ్‌లో వ్యత్యాసాలు ఉండటం వంటి సమస్యలను గుర్తించింది. ఈ లోపాలను సరిచేసి అవసరమైన పత్రాలను సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది.
లోపాలు సరిచేస్తే విచారణకు జాబితా చేస్తాం
మంగళవారం ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్లలోని లోపాలను సరిచేస్తే విచారణకు జాబితా చేస్తామని తెలిపింది.
పిటిషనర్ల అంశాలను విచారించేందుకు కోర్టు సిద్ధంగా ఉందని, అయితే ముందుగా రిజిస్ట్రీ గుర్తించిన లోపాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ విచారణకు రావాలంటే అవసరమైన సాంకేతిక, పత్రపరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
పిటిషన్లో ప్రతిపక్ష నేతలెవరు?
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ పిటిషన్లో సహ పిటిషనర్లుగా ఉన్నారు.
అలాగే ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ నేత డి. రాజా, జేఎంఎం ఎంపీ మహువా మాఝీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, ముస్లిం లీగ్ నేత ఇ.టి. మహమ్మద్ బషీర్ తదితరులు కూడా పిటిషన్లో ఉన్నారు.
భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు.
SIR ప్రక్రియపై ప్రతిపక్షాల అభ్యంతరాలు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడంతో పాటు అవకతవకలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ప్రక్రియలో చోటుచేసుకున్న తొలగింపులు, మార్పులపై నిర్ణీత గడువులో స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం నోటీసు ఇవ్వకుండా, తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించకుండా ఏ ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఎన్నికలు జరగనున్న పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్లు చట్టం అనుమతించిన చివరి తేదీ వరకు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కూడా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం సమర్పణకు సీజేఐ నిరాకరణ
ఎన్నికల సంఘం వ్యవహారాలు, పలువురు విద్యార్థుల అరెస్టులు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గతంలో సీజేఐను అనుమతి కోరినట్లు కథనంలో పేర్కొన్నారు. అయితే, ఆ విధంగా వినతిపత్రం సమర్పించేందుకు జస్టిస్ సూర్యకాంత్ అనుమతించలేదని, న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేస్తే త్వరగా విచారణ చేపడతామని తెలిపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రిజిస్ట్రీ గుర్తించిన లోపాలు ఇంకా సవరించకపోవడంతో మంగళవారం విచారణకు రాలేదు. లోపాల సవరణ పూర్తయిన తర్వాత ఈ పిటిషన్ తదుపరి విచారణకు వచ్చే అవకాశం ఉంది.