ప్రేమకు కొత్త భాష్యం
Eros
‘ఎరోస్ ది బిట్టర్‌స్వీట్: యాన్ ఎస్సే’ (1986)ను ఒక సాధారణంగా ప్రేమ కథ నుంచి ప్రేమలోని ఆనందం, బాధ, ఆకాంక్ష, దూరం, అసంపూర్ణత వంటి అనుభవాల వరకూ తీసుకెళుతుంది రచయిత్రి అన్నే కార్సన్. ఇది ప్రాచీన గ్రీకు సాహిత్యం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం ఆధారంగా పరిశీలించిన ఒక విశిష్టమైన మేధో రచన. ఇది ఆమె డాక్టరల్ థీసిస్ ఆధారంగా రూపొందింది. తరువాత ‘మోడ్రన్ లైబ్రరీ’ ఎంపిక చేసిన అత్యుత్తమ నాన్ఫిక్షన్ పుస్తకాల జాబితాలోనూ చోటు సంపాదించింది. కార్సన్ తన ఆలోచనలను ప్రాచీన గ్రీకు కవయిత్రి సాఫో దగ్గర నుంచి ప్రారంభిస్తుంది. సాఫో ప్రేమను గ్లుకుపిక్రోన్ అనే పదంతో అభివర్ణించింది. దాని అర్థం సుమారుగా తీపి-చేదు. అంటే ప్రేమ ఒకేసారి ఆనందాన్ని, బాధను కలిగిస్తుంది. మనం కోరుకున్న వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు కలిగే ఆనందంలోనే, అతను లేదా ఆమె మనకు పూర్తిగా అందుబాటులో లేరనే బాధ కూడా దాగి ఉంటుంది. ప్రేమ మనకు ఆనందాన్ని ఇస్తుందా, లేక మనకు దొరకనిదాన్ని కోరుకునే స్థితే ప్రేమా? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది కార్సన్. అందుకు తామె చ్చిన సమాధానం రెండో వ్యాఖ్యకు దగ్గరగా ఉంటుంది. సాధారణంగా ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంగా మనం భావిస్తాం. అందులో ప్రేమించే వ్యక్తి, ప్రేమించబడే వ్యక్తి ఉంటారు. కానీ, కార్సన్ దృష్టిలో ప్రేమకు మూడో కోణం కూడా ఉంది. అది ఆ ఇద్దరి మధ్య ఉన్న దూరం లేదా ఖాళీ. ఈ దూరమే కోరికను సజీవంగా ఉంచుతుంది. ఒక వ్యక్తి పూర్తిగా మనకు లభించి, కోరికకు ఎలాంటి అడ్డంకీ లేకుండా పోతే, మనం కోరుకున్న అందుకోవడం పూర్తవుతుంది. అప్పుడు కోరిక స్వభావమే మారుతుంది. అందుకే కార్సన్ దృష్టిలో ‘ఎరోస్’ అనేది స్వాధీనం చేసుకోవడం కంటే, అందుకోవడానికి నిరంతరం ముందుకు సాగడం. ‘లేకపోవడం’ లేదా ‘అందుబాటులో ఉండకపోవడం’ అనే విషయానికి కార్సన్ దృష్టిలో అత్యంత ప్రాధాన్యత ఉంది. అంటే లోటు లేదా అసంపూర్ణత. మనకు ఇప్పటికే పూర్తిగా లభించిన దానిని మనం సాధారణంగా అదే తీవ్రతతో కోరుకోము. కోరికకు ఇంధనం ఇంకా దొరకలేదు అనే స్థితి. అందుకే ‘ఎరోస్’ అనేది ఒక స్థిరమైన భావోద్వేగం కాదు. అది ఒక చలన స్థితి. మనసు ఒక దిశగా పరుగెత్తడం, ఎదుటివారిని చేరుకోవాలని ప్రయత్నించడం, అర్థం కానిదాన్ని అర్థం చేసుకోవాలని తపించడంఇవన్నీ ‘ఎరోస్’కు ఉన్న విస్తృత రూపాలే. భావనను కార్సన్ కేవలం ప్రేమకు మాత్రమే పరిమితం చేయలేదు. జ్ఞానం, సృజన, పఠనం వంటి మేధో ప్రక్రియలకు కూడా విస్తరింపచేస్తుంది. ఒక రచయిత అర్థాన్ని వెతుకుతాడు.. పాఠకుడు రచయిత ఆలోచనను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు… అక్కడ కూడా ఒక దూరం ఉంటుంది. అది ప్రేమకు, పఠనానికి మధ్య సంబంధం. ఇదే కార్సన్ చేసిన అత్యంత ఆసక్తికరమైన చారిత్రక పరిశీలన. ప్రాచీన గ్రీకులు ప్రేమను ఇంత లోతుగా ఆలోచించడం, అదే సమయంలో వారు విస్తృతమైన లిఖిత సంస్కృతివైపు అడుగులు వేయడం యాదృచ్ఛికం కాదని ఆమె సూచిస్తుంది. అందుకే ‘ఎరోస్ ది బిట్టర్‌స్వీట్: యాన్ ఎస్సే’ ఒక గొప్ప క్లాసిక్ రచనగా నిలుస్తుంది.