Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

వైద్య రంగంలో నిశ్శబ్ద విప్లవం ‘అనస్థీషియా’

Prajapaksham 16 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
వైద్య రంగంలో నిశ్శబ్ద విప్లవం ‘అనస్థీషియా’

World Anesthesia Day

సుధాకర్‌ ఎవి,

మానవ వైద్యచరిత్రలో శస్త్రచికిత్సను ఒక భయంకరమైన నరకయాతన నుండి సురక్షితమైన ప్రక్రియగా మార్చిన మహోన్నత ఆవిష్కరణ ‘అనస్థీషియా’ (నిర్మగ్నత/మత్తు మందు). 1846 అక్టోబర్‌ 16 న అమెరికాలోని బోస్టన్‌ నగరంలో విలియం థామస్‌ గ్రీన్‌ మోర్టన్‌ అనే డెంటిస్ట్‌ ప్రదర్శించిన ‘డై ఈథైల్‌ ఈథర్‌’ విజయవంతమైన ప్రయోగం శస్త్రచికిత్సల రూపురేఖలనే మార్చివేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 16న ‘ప్రపంచ అనస్థీషియా దినోత్సవం‘ నిర్వహిస్తారు. ఆధునిక వైద్యంలో నొప్పి లేని చికిత్సను సాధ్యం చేసి, కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న అనస్థీషియాలజిస్టుల సేవలను స్మరించుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అనస్థీషియా ఆవిష్కరణకు ముందు శస్త్రచికిత్స అంటే రోగికి వర్ణించలేని శారీరక, మానసిక చిత్రహింస. శస్త్రచికిత్స సమయంలో నొప్పిని తట్టుకోలేక రోగులు స్పృహ తప్పిపోవడం, షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా జరిగేది. ఆధునిక అనస్థీషియా రాకతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం నొప్పిని నివారించడమే కాకుండా, శస్త్రచికిత్సలు చేసే సమయంలో వైద్యులకు తగిన సమయాన్ని, రోగి శరీరంలో స్థిరమైన ఉష్ణోగ్రత, రక్తపోటు, ఆక్సిజన్‌ స్థాయిలను నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ఫలితంగా సంక్లిష్టమైన గుండె, మెదడు మరియు అవయవ మార్పిడి
శస్త్రచికిత్సలు సాధ్యమయ్యాయి.
చాలామంది భావించేట్లుగా అనస్థీషియాలజిస్ట్‌ బాధ్యత కేవలం శస్త్రచికిత్సకు ముందు మత్తు మందు ఇవ్వడం ముగిసిపోదు. ఆపరేషన్‌ థియేటర్‌లో రోగి ప్రాణాలకు రక్షణ కల్పించే తెరవెనుక కథానాయకుడు ‘అనస్థీషియా’ వైద్యుడే. ఆపరేషన్‌ ప్రారంభానికి ముందు రోగి ఆరోగ్యాన్ని అంచనా వేయడం, శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ గుండె స్పందనలు, రక్తం ప్రసరణ, శ్వాసక్రియలను క్షణక్షణం పర్యవేక్షించడం మరియు శస్త్రచికిత్స అనంతరం రోగి స్పృహలోకి వచ్చే వరకు అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం వీరి విధి. ఐసియు, అత్యవసర సంరక్షణ మరియు తీవ్రమైన నొప్పి నిర్వహణ లో కూడా వీరి పాత్ర కీలకం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సరైన అనస్థీషియా సేవలు అందుబాటులో లేకపోవడం నేటికీ ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నైపుణ్యం కలిగిన అనస్థీషియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. దీనితో పాటు అనస్థీషియా పట్ల రోగుల్లో ఉన్న అనవసరమైన భయాలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. సురక్షితమైన శస్త్రచికిత్స అనేది ప్రతి మానవుడి ప్రాథమిక ఆరోగ్య హక్కుగా మారినప్పుడే అందరికీ నాణ్యమైన వైద్యం అందుతుంది. వైద్యశాస్త్ర చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణలలో ఒకటైన అనస్థీషియా, మానవాళిని నొప్పి అనే బంధనం నుండి విముక్తి చేసింది. మానసిక ధైర్యాన్ని, శారీరక ఉపశమనాన్ని ఇస్తూ ప్రతిరోజూ లక్షలాది శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో సహాయపడుతున్న అనస్థీషియాలజిస్టుల కృషి అమోఘమైనది. ఈ ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా సురక్షితమైన వైద్య సేవ ల విస్తరణకు పునరంకితం అవుతూ, రోగి ప్రాణ రక్షణలో రాత్రింబవళ్లు శ్రమించే అనస్థీషియా నిపుణులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం మన అందరి బాధ్యత.
(అక్టోబర్‌ 16 ప్రపంచ అనస్థీషియా దినోత్సవం)