అదుపు తప్పిన ధరలు
commodities
ఇరాన్‌తో అమెరికా యుద్ధం, పర్యవసానంగా ఆయిలు సరఫరాకు తీవ్రమైన అంతరాయం, గోరుచుట్టుపై రోకటిపోటులా వాతావరణంపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం, ఈ పరిస్థితిని అవకాశంగా ఉపయోగించుకుంటున్న వ్యాపారుల అధిక లాభాపేక్ష కలగలిసి రవాణా ఖర్చులు, నిత్య జీవితావసర సరుకుల ధరల పెరుగుదలకు దారితీసి సామాన్య ప్రజల బతుకులతో చెలగాట మాడుతున్నాయి. ఇప్పుడే ఇలా వుంటే, రానున్న 10 మాసాల్లో బతుకులెలా వుంటాయోనని జనాలు కలవరం చెందుతున్నారు. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, ఆహారం, ఇంధన ద్రవ్యోల్బణం అత్యధికంగా 5.5 శాతానికి చేరింది. ఇది ఆకస్మికం కాదు. కొన్ని నెలలుగా పెరుగుతూ అక్కడికి చేరింది. అక్కడ ఆగుతుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుత స్థాయి రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన అత్యధిక ద్రవ్యోల్బణం స్థాయి. అంటే రెండు సంవత్సరాలుగా ధరలను ఎంతో కొంత అదుపులో పెడుతూ ద్రవ్యోల్బణం స్థాయిని తగ్గించిన ప్రయత్నాలు ఇప్పుడు పనిచేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 5.5శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అయినప్పటికీ అవి చిల్లర మార్కెట్లో ధరల పెరుగుదలను పూర్తిగా ప్రతిబింబించవు ప్రజల జీవితానుభవం చెప్పేమాట!
ద్రవ్యోల్బణాన్ని వినిమయ ధరల సూచీ(సిపిఐ)తో కొలుస్తారు. ఆగస్టులో 4.8 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.5 శాతంగా నమోదు అయింది. 2024 అక్టోబర్ నాటినుంచి ఇదే అత్యధికం. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి 6 శాతంగా రిజర్వుబ్యాంక్ నిర్దేశించుకుంది. అయితే సెప్టెంబర్ ద్రవ్యోల్బణ సూచీ 5.54 శాతాన్ని చేరటంతో 6శాతం పరిమితిని మించటానికి ఎంతో సమయం పట్టక పోవచ్చు. ట్రంప్ పశ్చిమాసియా యుద్ధ విధానం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా బహు తక్కువగా ఆయిలు ట్యాంకర్లు వెలుపలికి వస్తున్నాయి. అంతేగాక ఇరాన్ ఆయిలు రేవులను ట్రంప్ తమ ఓడలతో దిగ్బంధించటం కొనసాగు తున్నది. సౌదీ అరేబియా ఆయిలు వసతులకు ఎమెన్ హౌతీలు ముప్పుగా పరిణమించారు. రష్యా నుంచి ఆయిలు దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే చట్టంపై సంతకం చేసిన ట్రంప్, అమెరికాలోనే డీజిల్ ధరలు మండుతున్నందున మూడు నెలలపాటు రష్యా నుంచి లక్షల బ్యారల్స్ దిగుమతికి ఫుతిన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ దిగుమతి నిరాటంకంగా జరిగేందుకు ఉక్రేన్ ఇంధన వసతులపై పరస్పర దాడులకు విరామం సాధించారు. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుదలేకాని తగ్గుదల ఉండదు. రెండోవైపున, డాలర్‌తో పతనమవుతున్న రూపాయి విలువ. మన ఆయిలు మార్కెట్ కంపెనీలు ఎన్నాళ్లు నష్టాలు భరిస్తాయి? రిటైల్ ధర పెంపుదల అనివార్యం. కాబట్టి దాని సర్వవ్యాప్త ప్రభావం అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది.
రెండోవైపున, ఎల్‌నినో ప్రభావంతో మన దేశంలో వర్షాలు హెచ్చుతగ్గులుగా కురిసినందున వేసంగి పంట దిగుబడులు తగ్గాయి. రబీ పరిమిత ప్రాంతాల్లోనే సాధ్యం. కాబట్టి బియ్యం, అపరాలు, నూనెలు, ఉల్లిగడ్డల ధరలు ఇప్పటికే పెరిగాయి.
ఈ పెరుగుదల అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం సూచీలో తప్పక ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోని విస్తారమైన ప్రాంతాలు అనావృష్టి కోరల్లో ఉన్నాయి. తెలంగాణలో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి అప్పుడే పావుమూట రూ.1800 నుంచి రూ.2500ల దాకా పెరిగింది. పప్పులు, కాయధాన్యాలు, నూనెలు, పండ్లు, పాలు, ఆకుకూరలు ధరలన్నీ అప్పుడే పెరిగాయి రానున్న మాసాల్లో నిస్సందేహంగా మరింత పెరుగుతాయి. వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరార్థం జలాశయాల్లో నీటిని కాపాడుతున్నందున, వరి, పత్తి వంటి పైర్లు వేయవద్దని, ప్రత్యామ్నాయ మెట్టపంటలు వేసుకోమని ప్రభుత్వం రైతులకు హితబోధ చేస్తున్నది. కరెంటు కష్టాలూ తప్పవు. కాబట్టి పంటల విస్తీర్ణం తగ్గుదల, దిగుబడుల తగ్గుదల వగైరా కారణాలవల్ల ఆహారోత్పత్తులకు వ్యాపారులు కొరత సృష్టిస్తారు. అందువల్ల ధరలు కనీసం నియంత్రణలో ఉండాలంటే అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో తాత్సారం కనిపిస్తున్నది. ద్రవ్యోల్బణం నియంత్రణకు రిజర్వుబ్యాంక్ మరో ఒకటి రెండుసార్లు వడ్డీరేట్లు పెంచనూవచ్చు. వ్యాపార రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే అవి మళ్లీ వస్తువుల ధరల పెరుగుదలకే దారితీస్తాయి. కాబట్టి రానున్న సంవత్సరకాలం రిజర్వు బ్యాంక్‌కు, ప్రభుత్వాలకు గడసాము తప్పదు. ఇందులో వాటి కృషి సఫలమైతేనే సామాన్య ప్రజలకు కొంత ఊరట.