Pay More or Get Less: మరోసారి పెరగనున్న కిరాణా ఖర్చులు.. బిస్కెట్ల నుంచి టీ వరకు ధరలు బాదుడుకు రెడీ..కారణమేమిటంటే..
Pay More or Get Less: FMCG Companies Prepare Another Price Hike
Pay More or Get Less: భారతీయ సామాన్య వినియోగదారులపై మరోసారి పన్నులు, ధరల భారం పడనుంది. రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్లు, ఇతర నిత్యావసర వస్తువుల (FMCG) ధరలను పెంచేందుకు దిగ్గజ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ఘర్షణలు, యుద్ధ వాతావరణం కారణంగా క్రూడ్ ఆయిల్, పామాయిల్, పంచదార వంటి ప్రధాన ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. పెరిగిన ఉత్పత్తుల వ్యయాన్ని భర్తీ చేసుకుంటూ.. తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ ధరల సవరణను అమలు చేయనున్నాయి.
ఇప్పటికే జూన్ త్రైమాసికంలో దాదాపు అన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం నుంచి 5 శాతం వరకు పెంచాయి. అయినప్పటికీ పెరిగిన ముడిసరుకుల వ్యయం పూర్తిగా భర్తీ కాలేదని.. రాబోయే రోజుల్లో ధరలను మళ్లీ సమీక్షించక తప్పడం లేదని సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు నేరుగా ధరలు పెంచకుండా ‘ష్రింక్‌ఫ్లేషన్’ (Shrinkflation) అనే సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. అంటే వినియోగదారులకు తెలిసిన ప్యాకెట్ ధరను (రూ.5 లేదా రూ.10) అలాగే ఉంచి.. లోపల ఉండే సరుకు పరిమాణాన్ని (బరువును) తగ్గించడమే ఈ విధానం.
ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ప్రస్తుత త్రైమాసికంలో 1.5 శాతం నుంచి 2 శాతం వరకు ధరల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా రూ.5, రూ.10 ప్యాకెట్ల బరువును తగ్గించే ఆలోచనలో ఉంది. ప్రముఖ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ కూడా రాబోయే త్రైమాసికంలో 2 శాతం నుంచి 5 శాతం ద్రవ్యోల్బణ ఒత్తిడిని అంచనా వేస్తూ.. వివిధ కేటగిరీలలో ధరలను పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డాబర్, గోద్రెజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ వంటి ఇతర సంస్థలు కూడా ముడి వ్యయం తగ్గకపోతే ధరలు పెంచక తప్పదని స్పష్టం చేశాయి.
ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సామాన్యుడు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు దేశంలో మద్యం వినియోగదారులు ప్రీమియం బ్రాండ్లపై విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండటం ఆర్థిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూన్ త్రైమాసికంలో యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి ప్రధాన మద్యం తయారీ కంపెనీల ప్రీమియం పోర్ట్‌ఫోలియో అమ్మకాల్లో రెండంకెల స్థాయిలో భారీ వృద్ధి నమోదైంది.
రాడికో ఖైతాన్ కంపెనీ ప్రీమియం విభాగం విక్రయాల్లో ఏకంగా 35.8 శాతం వృద్ధిని సాధించడంతో.. ఆ సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో 76 శాతం పెరిగింది. అదేవిధంగా, యునైటెడ్ స్పిరిట్స్ నికర లాభం 51.6 శాతం పెరగడానికి కూడా ఈ ఖరీదైన, నాణ్యమైన మద్యం ఉత్పత్తుల విక్రయాలే కారణమని తెలిసింది.
గమ్మత్తైన విషయమేమిటంటే.. ఇదే సమయంలో సాధారణ, చౌకబారు మద్యం బ్రాండ్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఒకవైపు నిత్యావసరాలపై పొదుపు పాటిస్తున్నప్పటికీ.. వినోదం, మద్యం విషయంలో మాత్రం వినియోగదారులు నాణ్యమైన, ప్రీమియం ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారని ఈ విచిత్రమైన ఆర్థిక ట్రెండ్ స్పష్టం చేస్తోంది.
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..