Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..సముద్రం అల్లకల్లోలం.. ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. జూరాలకు భారీ ప్రవాహం
Weather Alert: High Alert for Coastal Areas as Depression Intensifies Over Bay of Bengal
Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి ఒడిశాలోని పారాదీప్ నుంచి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో భారీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని తెలిపారు. జులై 29 వరకు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు వేటను నిలిపివేయాలని సూచించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు.
ఇక ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతుండటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా.. ఆ నీరు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. ఆదివారం రాత్రి నాటికి జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. సోమవారం ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం జూరాల జలాశయంలో 5.897 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి ఇదే స్థాయిలో వరద కొనసాగితే త్వరలోనే శ్రీశైలం జలాశయానికి కూడా ప్రవాహం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతే ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నాగేశ్వర్రావు తెలిపారు.
మరోవైపు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీఎల్ఐ) పథకం ద్వారా సోమవారం నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఇన్చార్జి ఈఈ లోకిలాల్ వెల్లడించారు. రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపే ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో మత్స్యకారులు, స్థానిక ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు దాదాపు 90 శాతం మేర విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.