Skip to content
జాతీయం › వార్తలు

Thiruparankundram Deepam Row: వీడియో ఇదిగో.. తిరుప్పరంకుండ్రం దీపత్తూన్ వద్ద వెలిగిన కార్తీక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపోత్సవం..

jagan 28 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Thiruparankundram Deepam Row: వీడియో ఇదిగో.. తిరుప్పరంకుండ్రం దీపత్తూన్ వద్ద వెలిగిన కార్తీక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపోత్సవం..

Thiruparankundram Deepathoon

Thiruparankundram Deepam Row: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభం (దీపత్తూన్) పై శనివారం సాయంత్రం కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన స్పష్టమైన ఆదేశాల మేరకు, భారీ భద్రత నడుమ ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. కొండపై ఉన్న మండపం వద్ద అప్పటికే వెలుగుతున్న దీపం నుంచి పవిత్ర జ్యోతిని రాతి స్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఈ ప్రాచీన స్తంభంపై మహాదీపాన్ని వెలిగించేందుకు సుమారు 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల వత్తి, 5 కిలోల కర్పూరాన్ని ఉపయోగించారు.

రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్, జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సీఆర్‌పీఎఫ్ బలగాల కట్టుదిట్టమైన పహారా నడుమ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొండ దిగువన భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. అంతేకాకుండా, కొండపై ఉన్న సికందర్ దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రకటించి కఠిన ఆంక్షలు విధించారు.

అసలు వివాదం నేపథ్యం ఏమిటి?

ఏటా తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆలయానికి సరిగ్గా పైన ఉండే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంపై కార్తీక మహాదీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, అదే కొండపై సికందర్ దర్గాకు సమీపంలో ఉన్న పురాతన రాతి స్తంభంపై కూడా దీపం వెలిగించాలనే డిమాండ్‌పై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.

గతేడాది మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ, అధికారులు దానిని అమలు చేయలేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది నవంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఎట్టకేలకు అమలు

కార్తీక పౌర్ణమి నాడు కేవలం ఆలయ మండపంపైనే దీపాన్ని వెలిగించి, రాతి స్తంభంపై వెలిగించకపోవడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, తమ ఆదేశాలను కావాలనే ఉల్లంఘించారని తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ వ్యవహారాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ, శనివారం నాటికి రాతి స్తంభంపై తప్పనిసరిగా దీపం వెలిగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతో, కొండపై కార్తీక దీపారాధన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయింది.

ట్యాగ్‌లు: Supreme Court