హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా.. పేద యువతులే టార్గెట్.. కార్పొరేట్ ఆసుపత్రులకు సరఫరా..
హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా.. పేద యువతులే టార్గెట్.. కార్పొరేట్ ఆసుపత్రులకు సరఫరా..
Illegal Human Egg Trade: నగరంలో అక్రమ అండాల సేకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ముఠా సభ్యులు యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఉద్యోగాలు, మంచి జీతాలు, వసతి కల్పిస్తామంటూ ఇతర రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, వారి నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలు సేకరించి, వాటిని సంతాన సాఫల్య కేంద్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మధ్యవర్తులు, ఏజెంట్లతో పాటు కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడంతో పాటు 20 ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లే అడ్డాగా అక్రమ దందా
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఈ అక్రమ అండాల సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పేరుతో వసతి గృహాన్ని నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పేద యువతులను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన మహిళలకు డబ్బు ఆశ చూపించి అండాలు సేకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక్కో అండానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన అండాలను మధ్యవర్తుల ద్వారా ఫెర్టిలిటీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో సరూర్‌నగర్‌లోని హాస్టల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. దుర్గాప్రసాద్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. అక్కడ ఉన్న యువతులను రక్షించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని రక్షణ గృహాలకు పంపించారు. మహిళలను వేర్వేరు ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఒక్కో అండానికి రూ.3 లక్షల వరకు వసూలు?
యువతులకు కొంత మొత్తం చెల్లించి వారి నుంచి అండాలు సేకరిస్తున్న ముఠా సభ్యులు, వాటిని ఫెర్టిలిటీ కేంద్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో అండానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. ఈ వ్యవహారంలో కొన్ని ఏఆర్టీ కేంద్రాల లావాదేవీలను పరిశీలించగా, ఒక కేంద్రం నిర్వాహకుడికి ఏడాదిలో సుమారు రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు విచారణలో బయటపడింది.
ఆరు నుంచి తొమ్మిది రాష్ట్రాలకు విస్తరించిన నెట్‌వర్క్
ఈ అక్రమ వ్యాపారం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదని పోలీసుల విచారణలో తేలింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన పేద మహిళలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శర్మ ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా యువతులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుర్గాప్రసాద్ వంటి స్థానిక ఏజెంట్లు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లోనూ ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అపార్ట్‌మెంట్లు, మహిళల వసతి గృహాలను అడ్డాగా చేసుకుని యువతుల నుంచి అండాలు సేకరిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
ఆధార్ కార్డులు ఫోర్జరీ.. గుర్తింపు వివరాల్లోనూ మార్పులు?
ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం మహిళల గుర్తింపు పత్రాలకు సంబంధించినది. అండాల దాతల వివరాల నమోదులో అక్రమాలు జరిగాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కొందరు యువతుల ఆధార్ వివరాలను మార్చడం, అవివాహిత మహిళలను వివాహితులుగా చూపించడం, పిల్లల వివరాల్లో మార్పులు చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఒకరి గుర్తింపును మరొకరికి ఉపయోగించినట్లు కూడా అనుమానిస్తున్నారు.
అండాల దాతల వయస్సు, వివాహ స్థితి, పిల్లల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, రక్తవర్గం, రాతపూర్వక సమ్మతి వంటి అంశాలను నిబంధనల ప్రకారం నమోదు చేశారా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే ఇచ్చారా? అనుమతించిన వైద్య విధానాలను పాటించారా? అనే అంశాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
20 ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు
అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో సుమారు 20 ఫెర్టిలిటీ, ఏఆర్టీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీటిలో నోవా, బటర్‌ఫ్లై, ఇందిరా, నర్మదా, బిర్లా, ఆన్వి, కామశివ, తులసి రెడ్డి, మమత, సద్గురు, ఫాతిమా, ఆరాధ్య తదితర కేంద్రాల పేర్లు ఉన్నాయి.
ఈ కేంద్రాల్లో అండాల సేకరణకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించారా? దాతల వివరాలను ప్రభుత్వ రిజిస్ట్రీలో నమోదు చేశారా? మధ్యవర్తుల ద్వారా అండాలను సేకరించారా? అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత కేంద్రాలపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
మహిళా కమిషన్ విచారణలోనూ విస్తుపోయే విషయాలు
ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దృష్టి సారించింది. చైర్‌పర్సన్ నేరెళ్ల శారద నేతృత్వంలో జరిగిన విచారణలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు, మంచి జీతాలు, వసతి కల్పిస్తామంటూ యువతులను ఆకర్షించినట్లు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.30 వేల వరకు డబ్బు ఆశ చూపించి అండాల సేకరణకు ఒప్పించినట్లు విచారణలో వెల్లడైంది.
ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది మహిళలు ఈ ముఠా బారినపడినట్లు కమిషన్ విచారణలో గుర్తించినట్లు సమాచారం. వారిలో అధిక శాతం పెళ్లికాని యువతులే ఉన్నట్లు వెల్లడైంది. మహిళల గుర్తింపు పత్రాల్లో మార్పులు చేసినట్లు వచ్చిన ఆరోపణలపైనా కమిషన్ దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న హుస్సేన్‌ను గుర్తించి పట్టుకోవాలని పోలీసులకు సూచించినట్లు సమాచారం. శారద, నర్మదా, ఒయాసిస్, ఇందిరా తదితర ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసి రికార్డులను పరిశీలించినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.
అసలు అండాల సేకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
వైద్య పరిభాషలో అండాల సేకరణను ఓసైట్ రిట్రీవల్ లేదా ఎగ్ కలెక్షన్ అంటారు. సాధారణంగా ఇది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సలో భాగంగా నిర్వహించే వైద్య ప్రక్రియ. మహిళ అండాశయాల్లో ఒకేసారి ఎక్కువ అండాలు పరిపక్వం చెందేందుకు వైద్యుల పర్యవేక్షణలో హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. సాధారణంగా 8 నుంచి 12 రోజుల పాటు ఈ చికిత్స కొనసాగుతుంది. అండాలు పరిపక్వం చెందిన తర్వాత వాటి సేకరణకు ముందు ప్రత్యేకమైన ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తారు.
అనంతరం వైద్యులు అల్ట్రాసౌండ్ సహాయంతో అండాశయాలను పరిశీలించి, ప్రత్యేకమైన సూది ద్వారా అండాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా స్వల్ప మత్తు మందు ఉపయోగిస్తారు. సేకరించిన అండాలను ఐవీఎఫ్ ల్యాబ్‌కు తరలించి, అక్కడ ఎంబ్రియాలజిస్టులు వాటిని పరీక్షించి భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వైద్యుల పర్యవేక్షణలో, దాతకు పూర్తి సమాచారం అందించి, ఆమె స్వచ్ఛంద సమ్మతితోనే జరగాలి. బలవంతంగా లేదా తప్పుడు వివరాలతో అండాలు సేకరించడం తీవ్రమైన నేరం.
పదేపదే అండాల సేకరణతో ఆరోగ్య సమస్యలు
అండాల సేకరణ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల కొందరు మహిళల్లో అండాశయాలు అధికంగా స్పందించే పరిస్థితి (Ovarian Hyperstimulation Syndrome) ఏర్పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, ఉబ్బరం, వికారం వంటి సమస్యలతో పాటు తీవ్రమైన సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించకుండా, వైద్య పర్యవేక్షణ లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రమాదకరం. ముఖ్యంగా పదేపదే అండాలు సేకరించడం వల్ల కలిగే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అండాల దాతల ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
గతంలోనూ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం వివాదం
హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంతానం కోసం చికిత్సకు వచ్చిన దంపతులను సరోగసీ పేరుతో మోసం చేయడం, శిశువులను అక్రమంగా సమకూర్చి తల్లిదండ్రులకు అప్పగించడం వంటి ఆరోపణలపై గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో తొమ్మిది కేసులు నమోదు కాగా, 25 మందిని అరెస్టు చేసినట్లు అప్పట్లో వెల్లడించారు. అనంతరం దర్యాప్తును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు. 2026 ఫిబ్రవరిలో ఈ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం
ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు 158 ఫెర్టిలిటీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో అనధికారికంగా ఎన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయన్నది కూడా పరిశీలించాల్సిన అంశం. మరోవైపు సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్సను ఆశ్రయిస్తున్న దంపతుల నుంచి కొన్ని కేంద్రాలు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతున్న సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఐయూఐ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టం-2021 ప్రకారం అండాల దాతల సమ్మతి, వైద్య భద్రత, సేకరణ ప్రక్రియ, రికార్డుల నిర్వహణకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులు తప్పనిసరిగా నమోదు చేసుకుని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు కేంద్రాల రిజిస్ట్రేషన్లు, అనుమతులు, వైద్య సిబ్బంది అర్హతలు, దాతల వివరాలు, సమ్మతి పత్రాలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ నెల 6న వైద్యాధికారులు ఢిల్లీకి వెళ్లి జాతీయ ఏఆర్టీ, సరోగసీ రిజిస్ట్రీని సందర్శించి రాష్ట్రంలోని కేంద్రాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం. మరోవైపు మధ్యవర్తుల మాయమాటలకు, ఆర్థిక ప్రలోభాలకు లోనుకావద్దని వైద్యారోగ్య శాఖ మహిళలకు సూచించింది. అక్రమ అండాల సేకరణపై కఠినంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లా కేంద్రాల్లోనూ ఫెర్టిలిటీ కేంద్రాలు విస్తరిస్తున్న నేపథ్యంలో వాటి కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ రద్దు, చట్టపరమైన చర్యల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. పోలీసుల దర్యాప్తులో అసలు సూత్రధారులు ఎవరు? కార్పొరేట్ ఫెర్టిలిటీ కేంద్రాలకు ఈ ముఠాతో ఉన్న సంబంధాలేమిటి? బాధిత మహిళల సంఖ్య ఎంత? అన్న విషయాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది.