El Niño Alert: బలపడుతున్న ఎల్ నినో.. పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి..తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
Godzilla El Niño Threat
El Niño Alert: పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రపంచ వాతావరణ వ్యవస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. క్రమంగా బలపడుతున్న ఎల్ నినో (El Nino) ప్రభావం కారణంగా, భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో నీటి ఉష్ణోగ్రతలు చరిత్రలోనే తొలిసారిగా 30 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి.
అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) విడుదల చేసిన సమాచారాన్ని ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ వెల్లడించిన కథనం ప్రకారం, అక్టోబర్ 22న ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. అందుబాటులో ఉన్న ఆధునిక సముద్ర శాస్త్ర రికార్డుల ప్రకారం ఈ నియో 3.4 (Nino 3.4) ప్రాంతంలో ఉష్ణోగ్రత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ఉష్ణమండల ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కే ఒక సహజసిద్ధమైన వాతావరణ పరిణామం. సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల సముద్రంపై వీచే గాలులు, మేఘాల కదలికలు , ప్రపంచ వర్షపాత నమూనాల్లో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. ఈ ప్రభావం కేవలం పసిఫిక్ పరిసర ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని పలు ఖండాల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఊహించని రీతిలో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరుగుతుంది.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనాల ప్రకారం.. 2026 అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్య కాలంలో ఈ ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. వచ్చే డిసెంబర్ నాటికి ఇది తన గరిష్ఠ స్థాయికి (Peak) చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎల్ నినో తీవ్రతను లెక్కించేందుకు ఉపయోగించే ‘నినో 3.4’ సూచీ ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.6 డిగ్రీలు, ఆగస్టులో 2.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
కాగా, అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసం సాధారణం కంటే ఏకంగా 3.7 డిగ్రీల సెల్సియస్ అదనానికి చేరవచ్చని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. ఇది గతంలో నమోదైన అత్యధిక రికార్డులను సైతం అధిగమిస్తుంది. అయితే ఈ గణాంకాలు సముద్రపు కేవల ఉష్ణోగ్రతను కాకుండా, దీర్ఘకాలిక సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉందో తెలిపే వ్యత్యాసాన్ని మాత్రమే సూచిస్తాయి.
ఈ అసాధారణ వాతావరణ పరిణామాల ప్రభావం భారత వర్షపాతంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. 2026 సంవత్సరంలో భారత్‌లో నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసింది. ప్రసుతం అక్టోబర్-డిసెంబర్ కాలంలో కూడా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఎల్ నినో ఒక్కటే భారతీయ వాతావరణాన్ని పూర్తిగా శాసించదని, ప్రాంతీయంగా ఇతర సముద్ర వ్యవస్థల ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సముద్రాలు ఇప్పటికే మానవ కారక వాతావరణ మార్పుల వల్ల వేడెక్కుతున్న తరుణంలో, ప్రచండమైన ఎల్ నినో తోడవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. ఈ ఎల్ నినో ప్రతికూల ప్రభావం 2027 ఆరంభం వరకు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ప్రాంతాలను బట్టి దీని తీవ్రత, వర్షపాతంలో మార్పులు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల రాబోయే నెలల్లో పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, ఉపరితల గాలుల దిశలు , వర్షపాత అంచనాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిరంతరం నిశితంగా పరిశీలిస్తోంది.