వివాదాల మధ్య వివాదాస్పద బిల్లులు
SIR Protest
-సుంకవల్లి సత్తిరాజు,
దేశ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఒక వైపు సిజెపి, మరో వైపు ఇండీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తూ, నిరసనలతో దేశ రాజధానిలోను, ఇతర రాష్ట్రాల్లోను తమ ఆందోళనలను ఉధృతం చేస్తుండగా మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇంతకు ముందే జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి, కాక్రోచ్ లు నిర్వహించిన ఉద్యమానికి స్పందించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి, సోనమ్ వాంగ్ చుక్ చేత నిరాహార దీక్ష విరమింప చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలపై మరోసారి ఒత్తిడి పెంచి, ఇప్పుడు సిఇసి జ్ఞానేష్ కుమార్ చేత రాజీనామా చేయించాలని వైరి పక్షాలు పట్టుబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం లో బొద్దింకల ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం సిఇసి విషయంలో తలెత్తిన నిరసన జ్వాలలను పట్టించుకోవడం లేదు. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సిజెపి, ప్రతిపక్షాల ఆందోళనలను అణచి వేయడానికే ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడం గమనార్హం. ప్రత్యర్ధుల ఆందోళనలకు లొంగిపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా తాము వారు చేసిన ఆరోపణలను అంగీకరించినట్టే అవుతుందని భావించి ఉండవచ్చు. అందుకే ఈ నిరసనలను పట్టించుకోకుండా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దృష్టి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల్లో దురభిప్రాయం కలిగించడానికా? అనే అంశాలను పక్కన బెడితే డీ లిమిటేషన్ బిల్లును, మహిళల రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టి, తాము అనుకున్న లక్ష్యం సాధించడానికే సన్నద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై వ్యతిరేక గళం వినిపించిన స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ నుండి చీలిన పలువురు ఎంపిలు, ఇతర పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లులను గట్టెక్కించడంలో సహకరిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, పార్లమెంటు లోను, కేంద్రంలోను దక్షిణాది రాష్ట్రాల ప్రాభవం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయనే వాదన సత్య దూరం కాదు. అయితే లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల చట్టసభల సీట్లను 50శాతం పెంచి పునర్విభజన చేపట్టడం కొంతలో కొంత ఉపశమనం కలిగించే చర్య అయినప్పటికీ, ఇది పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించే చర్య మాత్రం కాబోదు. ప్రతిపక్షాలు సూచించిన విధంగా డీ లిమిటేషన్ బిల్లు పక్కన బెట్టి, ఇప్పుడున్న 543 స్థానాల్లోనే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి కేంద్రం అంగీకరించదు. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు సీట్ల విషయం లో అధికంగా లబ్ధి పొందుతాయి. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాది ప్రాబల్యం పెరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, తీవ్ర వివక్షతకు గురయ్యే అవకాశాలున్నాయి.
అయితే గతంలో ప్రవేశ పెట్టిన బిల్లులోని అంశాలను మారుస్తారా? లేక యథాతథంగా బిల్లును ప్రవేశ పెడతారా? కాంగ్రెస్ కోరినట్టు ప్రతిపక్షాలతో సంప్రదిస్తారా? అనే విషయాలపై సందిగ్ధత తొలగితే కాని, ఈ అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రాదు. డీ లిమిటేషన్ హేతుబద్ధంగా జరగాలి. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విబేధాలు తలెత్తకూడదు. డీ లిమిటేషన్‌పై లోతైన మేథోమధనం జరగాలి. తీవ్రమైన కసరత్తు జరగాలి. అందరికీ ఆమోదయోగ్యం పద్దతిలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలి.