ఉద్యమంపై విదేశీ పేరుతో స్వదేశీ కుట్ర
Police atrocities on youth in Jharkhand
న్యాయమైన డిమాండ్‌తో శక్తులు, వ్యక్తులు, పార్టీలు పోరాడుతున్నప్పుడు ప్రజల మద్దతు లభించడం
అనివార్యం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మద్దతును చెదర గొట్టేందుకు కొన్ని శక్తులు లేని విషయాలను ప్రచారంలోకి తీసుకురావడం చేస్తుంటాయి. ఇప్పుడు దేశంలో అచ్చు అలా గే జరుగుతుంది. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత దేశంలో ఒక నూతన పరిణామం చోటు చేసుకున్నది. సామాజిక అవగాహన లేదని, వ్యక్తిగత వ్యవహారాలు తప్ప బయట జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోని స్థితిలో ఓ తరం ఉందని ప్రచారం జోరుగా సాగింది. దాన్నే జన్‌జీ అన్నారు. అనేకమంది మేధావులు ఈ జన్‌జీ తీరుపై తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు సామాజిక అవగాహన లేమిని ఎత్తిచూపారు. కొందరు కుహనా మేధావులు ఇలా ఉండటం దేశానికి శ్రేయస్కరం అని కూడా చెప్పారనుకోండి అది వేరే సంగతి. మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి రగులుతున్న వేళ జన్‌జీ ఉద్యమం ప్రారంభమైంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ దీని నేపథ్యంలోనే న్యాయమూర్తి బొద్దింకలు అంటూ చేసిన వ్యాఖ్యలు యువతలో గొప్ప ఆలోచనకు, పట్టుదలకు దారితీశాయి. సిజెపి పేరుతో ఆందోళనకు పిలుపు, యువత నుంచి విపరీతమైన స్పందన మనం చూశాం. చివరకు ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికల కమిషన్ ఓటు చోరీ వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలతోపాటు సిజెపి నేతృత్వంలో యువత ఆందోళనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా సానుకూల స్పందన లభించింది. ఏ తరం ఆలోచన దేశం గురించి సమాజం గురించి సాగడం లేదని ప్రచారం చేశారో లేదా కొందరు నొచ్చుకున్నారో ఆ తరం పట్టుదలతో ఉద్యమబాట పట్టింది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు తొలగింపు, ఫలితాలను ఈవిఎంల ద్వారా సానుకూలంగా మార్చడం మొదలైన వాటిపై జరుగుతున్న ఆందోళనలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఢిల్లీలో దశాబ్దాల నాటి నిబంధనలను మార్పు చేశారు. సాయుధ బలగాలు మోహరించడం, పోలీసులు హద్దులు దాటి ప్రవర్తించడాన్ని దేశ ప్రజలు గమనించారు. ఓటును తొలగించడం, ఫలితాన్ని తారుమారు చేయడమనే విషయాన్ని నేరంగా భావిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక చర్చ ఆరంభమైంది. ఇంత చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల లెక్కింపు సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఒక బూత్‌లో మొత్తం ఓట్ల కంటే పోలైన ఓట్లు 400 అదనంగా లెక్కించడం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటును కాపాడుకోవడం, ఫలితాలను తారుమారు చేయకుండా చూసుకోవడం అన్నది ప్రజాస్వామ్య పరిరక్షణగా భావిస్తూ జన్‌జీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా దిశ గా సాగుతుంది. దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. జ్ఞానేష్
కుమార్ రాజీనామా చేస్తే ప్రభుత్వం బలహీనపడుతుంది లేదా విపక్షాలకు తలవంచినట్లు అవుతుంది. లేదు ఈ ఉద్యమాలను ఇలాగే కొనసాగిస్తే మున్ముందు మరింత ప్రమాదం అన్న భావన అధికార పెద్దల్లో నెలకొంది.
ఈ దశలోనే బిజెపి దాని అనుబంధ సంస్థలు ఓ ప్రచారాన్ని ముందుకు తెచ్చాయి. జన్‌జీ ఉద్యమం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆర్థిక సాయం అందిస్తున్నాయని ప్రచారం చేశా యి. దీనిని ప్రజలు పట్టించుకోలేదు. ఆ తర్వాత తటస్థ వ్యక్తులు, సంస్థలతో బిజెపి ప్రచారం చేయించింది. ఈ ప్రకటనలను ప్రజలు చాలా తేలికగా తీసిపారేశారు. ఆ ప్రయోగం విఫలమైన తర్వాత మోదీ సర్కార్ ఇప్పుడు మీడియాను ఎంచుకుంది. మీడియా ద్వారా జన్‌జీ లేదా ఢిల్లీ ఆందోళన వెనుక విదేశీ శక్తులు ఉన్నట్లు, దేశాన్ని అస్థిరపర్చడానికి జరుగుతున్న కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తప్పును తప్పు గా చూసే ప్రయత్నం చేయకుండా తప్పును ఒప్పుగా చిత్రీకరించే మీడియా సంస్థల సంఖ్య పెరిగింది. ప్రతి ఘటనను మసిబూసి మారేడుకాయ చేయడంలో సిద్ద హస్తులుగా మారిన సంస్థలు ఇప్పుడు జన్‌జీ లేదా జ్ఞానేష్‌కుమార్ రాజీనామా ఆందోళన వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉన్నట్లు గొంతు చించుకుంటున్నాయి. యజమాని చెప్పినట్లుగా నడుచుకునే ఉద్యోగుల్లా లేదా పెంపుడు జంతువుల్లా కొన్ని మీడియా సంస్థ లు అధికారానికి దాసోహం అంటున్నాయి. అధికార పార్టీ చెప్పినట్లుగా ప్రజా ఉద్యమాలపైన విషం చిమ్ముతున్నాయి. ప్రజాస్వామ్యానికి పునాదిగా చెప్పుకునే ఓటు తొలగింపు, ఫలితాల తారుమారుపై మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించకపోగా వ్యవహరించే వారిని తప్పుబడుతున్నాయి. వాస్తవానికి ఈ దేశం ఒక సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుంది. సంపద కొందరి చేతుల్లో పోగుబడి ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు మూతపడి ప్రైవేటు సంస్థలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్నా యి. ఉపాధి, ఉద్యోగ రంగాలు వట్టిపోయి నిరుద్యోగం పెరిగి దేశంలో యువశక్తి నిర్వీర్యమవుతుంది. దేశ జనాభాలో సగానికి పైగా ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. పారిశ్రామిక రంగం మొత్తం కేంద్రీకృతమై కార్పొరేట్ శక్తుల హస్తగతమవుతున్నది. ఆర్థిక వ్యవస్థ పతనావస్థవైపు పరుగులు పెడుతుంది. ఈ పరిస్థితుల్లో మీడియా సంస్థలు జాతిని జాగృతం చేయడంతో పాటు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను సన్నద్దం చేయాల్సి ఉంది. కానీ ఎవరు ప్రశ్నిస్తున్నారో, ఎవరు తమ హక్కుల కోసం పోరాడుతున్నారో, ఎవరు ప్రజలను జాగృతం చేస్తున్నారో వారిని తప్పుగా చూపే ప్రయ త్నం చేస్తున్నారు. విదేశీ శక్తుల పేరున స్వదేశీ శక్తులు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. రెండున్నర దశాబ్దాల తర్వాత ఓ తరం దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై నిలదీస్తున్న సమయంలో కొందరి వైఖరి ముఖ్యంగా మీడియా సంస్థల వైఖరి ఆక్షేపణీయమైంది. ఇటువంటి సంస్థలు తప్పు డు ప్రచారాలు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయలేవన్న విషయాన్ని మరోసారి రుజువు చేయాల్సిన బాధ్యత జన్‌జీ పైన, ప్రస్తుతం పోరాడుతున్న రాజకీయ పక్షాలపైన ఉంది.
-ఏనుగు వెంకటేశ్వరరావు, ఖమ్మం