ధన్‌ఖఢ్‌పై ఆర్‌ఎస్‌ఎస్ ఆకస్మిక ప్రేమ
Jagdeep Dhankhar
దసరా రోజున నాగ్‌పూర్‌లో స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ళు పూర్తి చేసుకుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విజయదశమి ఉత్సవ్ పేరుతో ఆవిర్భావోత్సవాలు జరిగాయి. ఏడాది పాటు జరుపుకున్న శతవార్షికోత్సవాలకు ముగింపు పలికారు. అయితే, ఈసారి నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగ్గా 15 నెలల క్రితం ఆయన ఆకస్మికంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తీవ్ర దుమారం రేపింది. ఆరోగ్యకారణాలతో రాజీనామా చేసినప్పటి నుంచి ప్రధాని మోదీ ఒత్తిడి మేరకే ఆయన ఆ పని చేశారని ప్రచారం జరిగింది. ధన్‌ఖఢ్ రాజీనామాకు కారణాలు చెప్పాలని ఇండియా కూటమి పెద్ద ఎత్తున ప్రశ్నించినా, మౌనమే సమాధానమైంది. ఆ తరువాత ఆయన కూడా
క్రియాశీలకంగా కనిపించలేదు.
ఉపరాష్ట్రపతి పదవీ విరమణ అనంతరం రాజధాని ఢిల్లీలో ఇచ్చే అధికారిక భవనాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం ఆయనకు కేటాయించలేదని వార్తలు వచ్చాయి. చివరకు బిజెపి నాయకులకు సైతం కారణాలు తెలియనప్పటికీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో ధన్‌ఖఢ్‌ను కలవకుండా దూరంగానే ఉన్నారు.
ఒకరిద్దరు విపక్ష పార్టీ ప్రముఖులే ఆయనను కలిసారు. ఒక విధంగా ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన కూడా సామాజిక కార్యక్రమాలలో
కనిపించటం మానేశారు. అయితే, ఇటీవల ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక కుట్ర సిద్ధాంతాన్ని కొన్ని మీడియా సమావేశాలు ముందుకు తీసుకువచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలని ధన్‌ఖడ్, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీని పురమాయించారని అందులో భాగంగా ప్రచారంలో పెట్టాయి. ఈ మేరకు వారిరువురు కేంద్ర ప్రభుత్వం అధికారంలో నిలిచేందుకు కీలకంగా ఉన్న టిడిపి, జెడి(యు), ఎల్‌జెపి తదితర పార్టీలను కట్టు తప్పించే ప్రయత్నం చేశారని ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఆయా పార్టీ ముఖ్యనేతలే ప్రధాని దృష్టికి తీసుకెళ్ళడంతో ధన్‌ఖఢ్ చేత ప్రధాని మోదీనే బలవంతంగా రాజీనామా చేయించారంటూ కథనాలను వండివార్చారు. తాజాగా పేపర్ లీకేజీపై పోరాటం, సిఇసి వ్యతిరేక ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టణ మధ్యతరగతి వర్గాలు మాట్లాడటం జరుగుతోంది. దీనిని తిప్పికొట్టేందుకు ఈ ఉద్యమాల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అదే కోవలో ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక కూడా కుట్ర కోణాన్ని
తీసుకొచ్చారు.
ఇది జరిగిన కొద్ది రోజులకే ఆర్‌ఎస్‌ఎస్ దసరా ఉత్సవాలకు అనూహ్యంగా ధన్‌ఖఢ్ అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సరసన కూర్చున్నారు. ఆ ఫోటోను ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు ఆకస్మికంగా ఆర్‌ఎస్‌ఎస్ ఇంత ప్రేమను కురిపించిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక అసలు కారణం నిజానికి జగదీప్ ధన్‌ఖఢ్ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టుడే. పశ్చిమబెంగాల్‌లో బిజెపి అధికారంలోకి రావాలనే వారి కాంక్షను నెరవేర్చడంలో అక్కడ గవర్నర్‌గా పనిచేసిన ధన్‌ఖడ్ పాత్ర కూడా ఉంది. అందుకే ఆయనకు ప్రమోషన్‌గా ఉపరాష్ట్రపతి పదవీ దక్కింది. ఆ హోదాలో రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉండడంతో అధికార పార్టీకి అనుకూలంగా దానిని ఉపయోగించారు కూడా. ప్రతిపక్ష ఎంపిలపై దురుసు వ్యాఖ్యలు చేయడం, పదేపదే దబాయించటంతో 2024 చివరలో ఆయనపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఇచ్చాయి. అంతగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా, ఆ తరువాత ఏమైందో ఏమో గాని ఆరునెలల్లో ఉపరాష్ట్రపతికి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ కంటే ఎక్కువగా ప్రోటోకాల్ ఆశించడమే అందుకు కారణమనే వాదన కూడా ఉంది. అందుకే రాజీనామా తరువాత కనీసం ఆయనకు ప్రభుత్వ బంగళా ఇవ్వలేదనే వాళ్ళూ ఉన్నారు.
ఇన్ని జరిగినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను ఆహ్వానించటానికి ప్రధాన కారణం త్వరలో జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలే కారణమనే అభిప్రాయం నెలకొంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో వరుసగా మూడవసారి బిజెపి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆర్‌ఎస్‌ఎస్ పట్టుదలతో ఉంది. ఎందుకంటే లోక్‌సభలో అత్యధిక స్థానాలు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మోదీ అధికారంలో వచ్చిన మూడుసార్లలో, రెండు మార్లు అత్యధిక స్థానాల ను కాషాయ పార్టీ గెలుచుకుంది.
2024లో మాత్రం బిజెపి కూటమి 36 ఎంపి స్థానాలలో గెలువగా, ఎస్‌పి నేతృత్వంలోని ఇండియా కూటమి 43 చోట్ల విజయం సాధించింది. ఇందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం కూడా ఒక కారణమే. అందులో జాట్‌లు ఎక్కువ మందే పాల్గొన్నారు. ఆ ప్రభావం వారు అధికంగా ఉండే పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపికి ఎంపి సీట్లు తగ్గడంపై పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్‌డిఏకు సీట్లు తగ్గడంతో, ఇండియా కూటమిని 234 సీట్లతో అధికారం చేపట్టేందుకు సమీపంగా వచ్చింది. అంతకుముందు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్‌ను మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తీరు కూడా ఆయన ప్రాతినిధ్యం
వహిస్తున్న జాట్ వర్గాల మనసులో ఉంది. అదే మాదిరిగా అదే వర్గానికి చెందిన ధన్‌ఖఢ్‌ను రాజీనామా చేయించిన విషయం కూడా వారు మరిచిపోలేదు. యుపిలో హ్యాట్రిక్ కోసం నష్ట నివారణ చర్యలో భాగంగానే ఆయనకు తిరిగి ప్రాధాన్యత కల్పిస్తూ తమ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి ఉత్సవాలకు ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానించింది. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక కుట్ర సిద్ధాంతాలు పటాపంచలయ్యాయి.