Skip to content
జాతీయం › వార్తలు

Rahul Gandhi vs Amit Shah: మరో 30 ఏళ్ల పాటు మీకు అధికారం రాదు.. రాహుల్ గాంధీపై విరుచుకుపడిన అమిత్ షా..

jagan 22 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi vs Amit Shah: మరో 30 ఏళ్ల పాటు మీకు అధికారం రాదు.. రాహుల్ గాంధీపై విరుచుకుపడిన అమిత్ షా..

rahul gandhi vs amit shah

Rahul Gandhi vs Amit Shah: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్లడాన్ని తప్పుబట్టిన అమిత్ షా.. దేశ రాజకీయాల్లో రాబోయే మరో మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన కోసం రూ.8,941 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. తాను చేసే ప్రసంగం ఆయనకు వినబడదని, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎక్కడో విదేశాల్లో సేదదీరుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఎందుకు విదేశాలకు వెళ్లారనేది పూర్తిగా వ్యక్తిగత విషయమైనప్పటికీ, ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత తన మాటను గుర్తుపెసుకోవాలని, మరో 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ వంతు రాదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నాలుగు రోజుల అధికారిక/వ్యక్తిగత పర్యటన నిమిత్తం వియత్నాంలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం వెలువడింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ నియామకం , ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఇండియా కూటమి పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న కీలక సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఢిల్లీ వీధుల్లో నిరసనల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయిన రాహుల్, ఇప్పుడు ప్రశాంతంగా విహారయాత్ర కోసం విదేశాలకు చెక్కేశారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఆయన వియత్నాం వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న తాలూకు ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ.. రాహుల్ విదేశీ పర్యటనల వెనుక అసలు అజెండా ఏమిటని అధికారికంగా ప్రశ్నించింది.

ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పాలనను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, విదేశీ శక్తులకు చెందిన జార్జ్ సోరోస్ నుంచి తర్ఫీదు, క్లాసులు తీసుకోవడానికే రాహుల్ విదేశాలకు పరుగెత్తారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ నేత కేవలం విరామం కోసమే విదేశాలకు వెళ్తున్నారా? లేక దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే తమ అరాచక సహకారులను కలవడానికి వెళ్తున్నారా? అని మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ సూటిగా ప్రశ్నించారు.

ఇదే వేదికపై నుంచి విపక్షాలు చేస్తున్న ‘ఓట్ల దొంగతనం’ , ఈవీఎంల ఆరోపణలను అమిత్ షా గట్టిగా తిప్పికొట్టారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రతిపక్షాలు ప్రజాదరణ కోల్పోయి అధికారానికి దూరంగా ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలతో రాజకీయంగా ఏమీ సాధించలేరని హితవు పలికారు. చేతనైతే విపక్షాలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం కోసం సరైన ప్రణాళికలు తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పని చేయాలని అమిత్ షా సలహా ఇచ్చారు.