Dussehra Controversy: ఢిల్లీలో 30 అడుగుల బొద్దింక దిష్టి బొమ్మ దహనంపై వేడిక్కిన రాజకీయం.. ఆప్- బీజేపీల మధ్య మాటల యుధ్దం.. మధ్యలో సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే పంచ్..
Dussehra Controversy
Dussehra Controversy: దేశ రాజధాని ఢిల్లీలోని పీతాంపుర నేతాజీ సుభాష్ ప్లేస్ గ్రౌండ్‌లో ‘శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకలు తీవ్ర రాజకీయ దుమారానికి వేదికగా మారాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా సంప్రదాయబద్ధంగా దహనం చేసే రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు అనూహ్యంగా ఏకంగా 30 అడుగుల ఎత్తున్న భారీ ‘బొద్దింక’ దిష్టిబొమ్మను కూడా దహనం చేయడం తీవ్ర కలకలం రేపింది. పురాణ రాక్షస రూపాల మధ్య ఈ విచిత్ర రూపం కలవడం స్థానికులతో పాటు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ పరిణామంపై ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. రామ్‌లీలా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడటం వేల ఏళ్ల సనాతన హిందూ సంప్రదాయాలను, భక్తుల మతాచారాలను తీవ్రంగా అపహాస్యం చేయడమేనని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి రామ్‌లీలా కమిటీ నిర్వాహకులతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్, మంత్రి కపిల్ మిశ్రాలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీస్ కమిషనర్‌లకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ వివాదంపై రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ దేవర్హా వివరణ ఇస్తూ.. ఇది ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ’ ప్రచారంలో భాగమేనని చెప్పారు. బొద్దింకల ద్వారా వ్యాపించే ఆస్తమా, అలర్జీలు వంటి రోగాలపై, అపరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఆ దిష్టిబొమ్మను దహనం చేశామని, దీనికి ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేత కపిల్ మిశ్రా మాత్రం ఆప్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. తాము దహనం చేసింది కేవలం ఒక బొద్దింక దిష్టిబొమ్మనే అయినప్పటికీ, దేశంలోని ‘రాజకీయ చెదపురుగులు’ ఎందుకు అంతలా బాధపడుతున్నాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులను అంతమొందించే క్రిమిసంహారక మందు ఉందన్నారు.
ఈ ఘటన ఓటర్ల జాబితాల సవరణపై నిరసనలు తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)ని ఉద్దేశించి చేసిందేనన్న ప్రచారం విస్తరించడంతో వివాదం మరింత రాజుకుంది. దీనిపై సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. తమ పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వ్యంగ్యంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమ ఎదుగుదలను చూసి అధికార పార్టీ ఎంతగా భయపడుతోందో ఈ ఘటన నిరూపిస్తోందని సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ వ్యాఖ్యానించారు. పరిశుభ్రత అవగాహన పేరిట బీజేపీ వివరణ ఇస్తున్నప్పటికీ.. ఇది తమపై చేసిన పరోక్ష రాజకీయ దాడేనని సీజేపీ బలంగా ఆరోపిస్తోంది.