Skip to content
ప్రపంచం › వార్తలు

Kim Jong-un Death Rumours: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ ఫొటోలు విడుదల చేసిన నార్త్ కొరియా ప్రభుత్వం..

jagan 21 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Kim Jong-un Death Rumours: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ ఫొటోలు విడుదల చేసిన నార్త్ కొరియా ప్రభుత్వం..

Kim Jong-un Death Rumours

Kim Jong-un Death Rumours: ఉత్తర కొరియా నిరంకుశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం , ఆయన మనుగడపై అంతర్జాతీయ వేదికలపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. కిమ్ జోంగ్ ఉన్ తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) గురై కోమాలోకి వెళ్లారని, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారంటూ సోషల్ మీడియాలో దావానలంలా వార్తలు వ్యాపించాయి. ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఉత్తర కొరియా బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తన చేతుల్లోకి తీసుకున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ వదంతులు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడంతో.. వీటికి చెక్ పెడుతూ ఉత్తర కొరియా అధికారిక మీడియా ఆయన తాజా చిత్రాలను విడుదల చేసింది.

ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక ‘రోడాంగ్ సిన్మున్’ ప్రచురించిన చిత్రాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల దేశంలో జరిగిన ఒక వస్త్రాలు , పాదరక్షల ప్రదర్శనను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మహిళా ఉద్యోగి చేతిలోని చిన్న గులాబీ రంగు బూటును ఆయన ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ఫొటోలకు చిక్కారు. అలాగే అధికారులతో మాట్లాడుతూ చేతులను చాపి వివరిస్తున్న దృశ్యాలు, ప్రదర్శనలో ఉంచిన మహిళల కోటును తాకుతూ పరిశీలిస్తున్న చిత్రాలను ప్రభుత్వం బయటపెట్టింది. అయితే ఈ ఫొటోలు ఏ రోజున తీశారనే అంశంపై స్పష్టమైన తేదీని మాత్రం పత్రిక పేర్కొనలేదు.

అమెరికాలో నివాసముంటున్న చైనా అసమ్మతివాది వాంజున్ షీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఈ సంచలన ఆరోపణలకు తెరలేపారు. తొలుత కిమ్ మరణించారని పేర్కొన్న ఆయన, దేశంలో తీవ్ర వారసత్వ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండటంతో చైనా రాజధాని బీజింగ్ నుంచి సుమారు 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్‌కు పంపినట్లు ఆరోపించారు.

ఆ తర్వాత మరో పోస్టులో, కిమ్‌కు మెదడులో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యుల బృందాన్ని ఉత్తర కొరియాకు రప్పించారని తెలిపారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా కోమాలోకి వెళ్లిన కిమ్‌ను కాపాడలేకపోయారని, ఆయన మృతదేహాన్ని అత్యంత రహస్యంగా ఉత్తర కొరియాకు తరలించారని వాంజున్ షీ ప్రచారం చేశారు. అయితే ఈ కథనాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు గానీ, ధ్రువీకరించదగిన ప్రత్యక్ష సాక్ష్యాలు గానీ బయటకు రాలేదు.

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం , మరణంపై ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 2020 సంవత్సరంలో కూడా ఆయన తీవ్రమైన గుండె శస్త్రచికిత్స అనంతరం మరణించారని, ఈ వార్త 99 శాతం నిజమని ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయిన జీ సియోంగ్-హో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే కిమ్ ఒక కార్యక్రమంలో ప్రత్యక్షమై ఆరోగ్యంగా కనిపించడంతో ఆ ప్రచారమంతా బూటకమని తేలింది. తదనంతరం జీ సియోంగ్-హో తన తొందరపాటు వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. ఉత్తర కొరియా మూసివున్న సమాజం కావడం వల్ల అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం కష్టంగా మారి, తరచూ ఇటువంటి అసత్య వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయని పర్యావరణ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.