Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana High court: భార్యాభర్తల మధ్య జరిగే చిన్న వివాదాలకు విడాకులు ఇవ్వలేం.. పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

jagan 20 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana High court: భార్యాభర్తల మధ్య జరిగే చిన్న వివాదాలకు విడాకులు ఇవ్వలేం.. పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

TS High court

Telangana High court: దాంపత్య జీవితంలో తలెత్తే చిన్నపాటి గొడవలు, సాధారణ అభిప్రాయ భేదాలను క్రూరత్వంగా (Cruelty) పరిగణించి విడాకులు మంజూరు చేయలేమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక చర్యను క్రూరత్వంగా పరిగణించాలంటే సదరు వ్యక్తితో భాగస్వామి ఎంతమాత్రం కలిసి జీవించలేరనే కచ్చితమైన నిర్ధారణకు వచ్చేలా ఆధారాలు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తీవ్రమైన విభేదాలు లేని దంపతులు స్వల్ప కారణాలతో సమస్యను జటిలం చేసుకుని, నిలకడలేని అంశాల ఆధారంగా విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, 2009లో వివాహమైన ఒక భర్త.. తమకు పాప పుట్టినప్పటి నుంచి భార్య తనను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కింది కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ జరిపిన కింది కోర్టు భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో, తమ దాంపత్య హక్కులను పునరుద్ధరించి (Restoration of Conjugal Rights) భర్తతో కలిసి ఉండేలా చూడాలంటూ భార్య వేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ తీర్పునిచ్చింది. కింది కోర్టు ఇచ్చే తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు ధర్మాసనం ఈ అప్పీళ్లపై క్షుణ్ణంగా విచారణ జరిపి కింది కోర్టు తీర్పును సమర్థించింది. భార్య మానసిక సమస్యలతో బాధపడుతోందన్న భర్త ఆరోపణలకు, అలాగే తనను ఇల్లరికం రావాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారన్న అంశానికి సంబంధించి భర్త ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారని ధర్మాసనం గుర్తుచేసింది. గతంలో భార్య తనపై గృహహింస కేసు పెట్టి వేధించిందనే కారణంతో విడాకులు కోరుతున్నప్పటికీ, ఆ కేసును ఇప్పటికే కోర్టు కొట్టివేసిందని తెలిపింది. కేవలం గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసినంత మాత్రాన దాన్ని చట్టపరమైన క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది.

ఈ కేసు దాఖలు చేసిన సమయంలో భర్త వయసు 36 ఏళ్లు, భార్య వయసు 30 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం వారికి వరుసగా 50, 44 ఏళ్లు వచ్చాయని, వారి కుమార్తె వయసు 16 ఏళ్లకు చేరిందని కోర్టు పేర్కొంది. దాదాపు 14 ఏళ్లుగా వీరు విడిగా ఉంటున్నప్పటికీ, దంపతుల మధ్య విడాకులు ఇచ్చేంత తీవ్రమైన విభేదాలు ఏవీ లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్న చిన్న కారణాలతో విడాకులు మంజూరు చేయడం సమంజసం కాదని స్పష్టం చేస్తూ భర్త దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది.