France Riots: ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న అల్లర్లకు కారణమేంటి.. హోంమంత్రి రాజీనామాను అధ్యక్షుడు మాక్రాన్ ఎందుకు తిరస్కరించారు..
France Riots
France Riots: ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు తీవ్ర హింసాకాండకు దారితీశాయి. నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని, దుకాణాలు దోపిడీకి గురైన దృశ్యాలను అడ్డుకోలేకపోవడంపై పోలీసు శాఖ.. పరిస్థితిపై పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ సోమవారం బహిరంగంగా అంగీకరించారు.
వందలాది దుకాణాలు దోపిడీకి గురైన తర్వాత, తాము పరిస్థితిని నియంత్రించామని వ్యాపారుల కళ్లలోకి చూసి చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ నునెజ్ సమర్పించిన రాజీనామాను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తిరస్కరించారు. శాంతిభద్రతల అమలులో నాయకత్వ స్థిరత్వం అత్యంత అవసరమని పేర్కొన్న మాక్రాన్, నిఘా వైఫల్యాలపై తక్షణమే విచారణ జరిపి కొత్త కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.
ఈ భారీ ఆందోళనల వెనుక సుదీర్ఘకాలంగా రగులుతున్న తీవ్ర నిరాశ, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల నిత్యావసర సరుకులు, విద్యుత్, గ్యాస్ , రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి సాధారణ పౌరుల కొనుగోలు శక్తి పడిపోయింది. మరోవైపు, గత నాలుగు వారాలుగా విద్యా వ్యవస్థలోని లోపాలు, సౌకర్యాల కొరతపై హైస్కూల్ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విద్యార్థి ఉద్యమం కాస్తా కార్మిక సంఘాలు, సామాన్య ప్రజలతో కలవడంతో దేశవ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు.
అయితే ఈ ప్రదర్శనల్లోకి ఆందోళనకారులతో పాటు పెద్ద సంఖ్యలో ముసుగులు ధరించిన అల్లరిమూకలు, దోపిడీదారులు ప్రవేశించడంతో నిరసనలు విపరీతమైన హింసకు దారితీశాయి. పారిస్, లియోన్, మార్సెల్ వంటి ప్రధాన నగరాల్లో సుమారు రెండు వేలకు పైగా దుకాణాలు, వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లిమోజెస్ నగరంలో ఉన్న 143 ఏళ్ల నాటి చారిత్రాత్మక మున్సిపల్ భవనానికి దుండగులు నిప్పుపెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది. రాజధాని పారిస్‌లో ఆదివారం నాటికి కూడా దోపిడీలు కొనసాగాయి. ఈ తీవ్ర హింసాకాండ వల్ల దాదాపు వందల మిలియన్ల యూరోల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఫ్రాన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అలైన్ డి క్రెస్సెంజో అంచనా వేశారు.
నిరసనకారులను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నాంటెస్ నగరంలో వాహనం తగిలి 22 ఏళ్ల పోలీస్ అధికారి మృతి చెందగా, పారిస్ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించారు. ఘర్షణల్లో దాదాపు వెయ్యి మంది భద్రతా సిబ్బంది గాయపడగా, పోలీసులు ప్రయోగించిన గ్రెనేడ్ వల్ల ఒక నిరసనకారుడి చెయ్యి తెగిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2,330 మందిని అరెస్టు చేయగా, వారిలో 70 శాతానికి పైగా వయోజనులేనని న్యాయశాఖ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 60 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ, తీవ్రస్థాయిలో వచ్చి పడిన దొంగల మూకలను అంచనా వేయడంలో ముందుచూపు లోపించిందని మంత్రి నునెజ్ ఒప్పుకున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు మాక్రాన్, ఈ హింస , దోపిడీల వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని, ధ్వంసం చేసిన ప్రతీ ఒక్కరూ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఆయన ప్రస్తుతానికి కర్ఫ్యూ లేదా అత్యవసర పరిస్థితిని విధించలేదు. ప్రధాన నగరాల్లో భద్రతను పెంచినప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయంపై ప్రజల అసంతృప్తిని ప్రభుత్వం ఎలా చల్లార్చుతుందనేది ఇప్పుడు ఫ్రాన్స్‌లో అతిపెద్ద సవాలుగా మారింది.