Skip to content
తెలంగాణ › వార్తలు

El Niño Alert: సూపర్ ఎల్ నినో ముప్పు.. రానున్న 10 నెలలు అత్యంత కీలకం.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

jagan 16 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
El Niño Alert: సూపర్ ఎల్ నినో ముప్పు.. రానున్న 10 నెలలు అత్యంత కీలకం.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

revanth Reddy

El Niño Alert: ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్న “సూపర్ ఎల్ నినో” (Super El Niño) కారణంగా రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రమయ్యే ప్రమాదముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల తీవ్ర నీటి ఎద్దడి, భానుడి ప్రచండ ప్రతాపం ఉండబోతున్నాయని ఐక్యరాజ్యసమితితో పాటు శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేశారని తెలిపారు. సచివాలయంలో గురువారం రాత్రి అత్యవసరంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఎల్ నినో భయానక పరిణామాల వల్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్రమైన నీటి, విద్యుత్ సమస్యలను ఎదుర్కోబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భయంకరమైన వాతావరణ సంక్షోభాన్ని అధిగమించడానికి రాబోయే 10 నెలల కాలం రాష్ట్రానికి అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడమే కాకుండా, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతుండటంతో వ్యవసాయానికి, తాగునీటికి నీటిని అందించడం ఎంతో సవాలుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఒక సీజన్ పంటను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో వ్యాపించిన కోవిడ్ మహమ్మారి కారణంగా ఏ విధంగానైతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందో, ఈ ఎల్ నినో ధాటికి మళ్లీ అలాంటి సంక్షోభ పరిస్థితులే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 తర్వాత చరిత్రలో పలుమార్లు ఎల్ నినో వల్ల కరువులు వచ్చినప్పటికీ, ప్రస్తుతం వీస్తున్నది మరింత తీవ్రమైన ‘సూపర్ ఎల్ నినో’ అని, దీనిని అందరం కలసికట్టుగా, ధైర్యంగా ఎదుర్కొని తీరాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు సంక్షోభంపై ప్రభుత్వం ఇప్పటికే దీర్ఘకాలిక ప్రణాళికలు, కార్యాచరణను సిద్ధం చేసిందని, ఈ బృహత్తర ప్రయత్నంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని, ఇది కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా పారిశ్రామిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలిపారు. గత మూడేళ్ల అక్టోబర్ నెలల రికార్డులను పరిశీలిస్తే సగటు విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎండాకాలం నాటి పరిస్థితులు వచ్చి ఏకంగా 20,000 మెగావాట్ల ఆల్-టైమ్ రికార్డు డిమాండ్ నమోదైందని వివరించారు. ఎల్ నినో ముప్పుపై వేసవి కాలం నుంచే రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక, ధాన్య సహాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.