Iran War: ఇరాన్ మీద మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ దాడికి అమెరికా ప్లాన్.. MOAB వాడితే టెహ్రాన్ శ్మశానాల దిబ్బ అవడం ఖాయం..
Iran War
Iran War: ఇరాన్‌తో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ వైమానిక దాడులు చేసేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రణాళికలు రచిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ వ్యూహంలో భాగంగా అమెరికా తన ఆయుధాగారంలోని అత్యంత శక్తిమంతమైన, నాన్-న్యూక్లియర్ బాంబు అయిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB – GBU-43/B)ను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే ఈ నివేదికలపై అమెరికా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, ఇరాన్‌లోని కీలక ఇంధన కేంద్రాలు , పిక్‌యాక్స్ మౌంటైన్ వంటి భూగర్భ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడానికి పెంటగాన్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 9,800 కిలోల బరువు ఉండే ఈ MOAB బాంబు భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. అయితే, గ్రానైట్ పొరలతో ఎంతో పటిష్టంగా రక్షణ కల్పించిన లోతైన భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై అమెరికా రక్షణ అధికారుల్లోనే భిన్న వాదనలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది డీప్-పెట్రేషన్ వార్‌హెడ్ కానందున, దీని భారీ పేలుడు పరిధి వల్ల పౌరులకు జరిగే నష్టంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ వాతావరణం నుంచి బయటపడేందుకు, తమకు ఘన విజయం లభించినట్లు ప్రపంచానికి చాటిచెప్పేందుకు ట్రంప్ యంత్రాంగం వివిధ మార్గాలను అన్వేషిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ సైనిక చర్యల ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, ప్రాంతీయ ఉద్రిక్తతల నడుమ అమెరికా అనుసరించబోయే తదుపరి చర్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.