Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana: తెలంగాణలో కరెంట్ కోతలు.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికల వెనువెంటనే వేటు.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ సురేష్ సస్పెన్షన్..

jagan 15 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana: తెలంగాణలో కరెంట్ కోతలు.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికల వెనువెంటనే వేటు.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ సురేష్ సస్పెన్షన్..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు

Telangana: తెలంగాణలో విద్యుత్ కోతలు, సరఫరా అంతరాయాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇంధన శాఖ స్పందించింది. విధుల్లో విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ బి. సురేష్‌పై వేటు వేసింది.

ఆయనను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ టీజీ జెన్‌కో (TGGENCO) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హరీష్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి పెంపునకు అవసరమైన ప్రాధాన్య పనుల ప్రణాళిక, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, అమల్లో సీఈ సురేష్ తీవ్ర పర్యవేక్షణా లోపాలు ప్రదర్శించినట్లు జెన్‌కో తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. శాఖాపరమైన పూర్తిస్థాయి విచారణ ముగిసే వరకు ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

అంతకుముందు బుధవారం సాయంత్రం సచివాలయంలో ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నైనీ , మహానది బొగ్గు బ్లాకుల నుంచి తగినంత బొగ్గు నిల్వలు సరఫరా అవుతున్నప్పటికీ, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను సీఎం గట్టిగా నిలదీశారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్‌కో సీఎండీ ఎస్. హరీష్‌లతో సహా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈ కీలక చర్య చోటుచేసుకోవడం విద్యుత్ వర్గాల్లో కలకలం రేపింది.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పైరు చేతికొచ్చే వరకు వచ్చే 20 రోజులు పంటలకు ఎంతో కీలకమని, కరెంట్ కోతల కారణంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదని నొక్కి చెప్పారు. వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అధికంగా నమోదవుతున్న జిల్లాలను తక్షణమే గుర్తించి, ఆయా ప్రాంతాలకు అదనపు విద్యుత్‌ను పంపేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

రాష్ట్రంలో నమోదైన లోటు వర్షపాతం, ముంచుకొస్తున్న ఎల్ నినో (El Niño) ముప్పు, తాగునీటి ఎద్దడి , విద్యుత్ సరఫరా పరిస్థితులపై కూడా సమగ్రంగా సమీక్షించిన ముఖ్యమంత్రి, పదేపదే ఆదేశాలిచ్చినా అధికారుల పనితీరులో మార్పు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎంతమాత్రం సహించబోనని, ముఖ్యమంత్రిగా తాను తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా జవాబుదారీగా ఉన్నానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.